పెంకిపిల్ల--"పెంకిపిల్ల" అనడంతోనే నేను చలాకీఅయిన ఓ అల్లరిపిల్ల గురించో లేక 1951 లో విడుదలైన పెంకిపిల్ల సినిమా గురించో చెప్తున్నానని అనుకుంటే పొరపాటు. మద్రాస్ నుంచి "పెంకిపిల్ల" పేరుతో దాదాపు పదమూడేళ్ళు ఓ మ్యాగజైన్ వచ్చింది. 1941 లో ప్రారంభించిన "పెంకిపిల్ల" 1954 వరకు నడిచింది. ఈ మ్యాగజైన్ సంపాదకులు పసుమర్తి రాఘవరావుగారు. ఆయన 1940-50 వ దశకంలో సినిమా లోకంలో "పెంకిపిల్ల రాఘవరావు"గారిగా సుపరిచితులు. పసుమర్తి వేంకట భవానీ శంకరరావు (1890 - 1963), సూరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ఒక కుమార్తె. వారి సంతానంలో పెద్దకుమారులైన వీరరాఘవ సీతారామ స్వామిగారు ఎప్పుడూ మల్లెపూలలాంటి తెల్ల బట్టలతో చిరునగవుతో ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కందికుప్ప వారి ఆడపడుచు రామలక్ష్మిగారితో ఆయన వివాహమైంది. రాఘవరావుగారికి అయిదుగురు కొడుకులు. ఒక కుమార్తె. తండ్రిగారిలాగే రాఘవరావుగారు కూడా పోస్ట్ మాస్టర్ గా పని చేశారుఅయితే అలనాటి రాజకీయ నాయకులు వి.వి. గిరిగారికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన సూచన మేరకు మద్రాసు వెళ్ళారు. అక్కడ ప్రముఖ రచయిత తాపీ ధర్మారావుగారి నేతృత్వంలో సంపాదకీయానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నారు. అంతేకాదు తాపీ గారి ఆశీస్సులతో పెంకి పిల్ల మ్యాగజైన్ ప్రారంభించారు. పెంకిపిల్ల అనే పేరుకూడా తాపీగారి సూచనే. ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, రేలంగి, చిత్తూరు నాగయ్య తదితర నటులతో సన్నిహిత సంబంధాలుండేవి. టాలీవుడ్ లో కొత్త సినిమాలు , షూటింగ్ జరుగుతున్న సినిమాల విశేషాలు, వ్యాసాలు, విడుదలైన తెలుగు సినిమాలపై సమీక్షలు, అలాగే హిందీ సినిమా, హాలీవుడ్ సినిమా విశేషాలు, సామాజిక కథలు, ఘాటైన సంపాదకీయాలు, నాటి ప్రసిద్ధ సినిమా సంస్థలయిన వాహిని, ప్రతిభా, విజయా, భరణీ, అంజలీ మొదలైన వారి సినిమా ప్రకటనలతో పెంకిపిల్ల పత్రిక పాఠకలోకాన్ని అలరించేది.రాఘవరావుగారి తమ్ముడు కవి, భావకులు అయిన ఈశ్వర సుబ్బారావుగారు కూడా పెంకిపిల్ల మ్యాగజైన్లో కథలుగట్రా రాసేవారు. ప్రముఖ కవులు శ్రీశ్రీ, ఆరుద్ర వంటివారితో ఈశ్వరసుబ్బారావుగారికి మంచి పరిచయముండేది. ఈయన హోమియోపతి, జ్యోతిషంలో ప్రజ్ఞావంతులు. ముక్కుసూటి మనిషి. పార్నంది సుబ్రహ్మణ్యంగారు మేనేజరుగా వ్యవహరించిన ఈ పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్, మధునాపంతుల సూర్యనారాయణ మూర్తి, న్యాయశ్రీ, దశిక రామారావు, పన్యాల రంగనాథరావు వంటి మేటి రచయితల రచనలు వెలువడుతుండేవి వడ్డాది పాపయ్య, జి.ఎన్. సూరి వంటివారుకూడా ఈ పత్రికకు రాస్తుండేవారు. మొత్తంమీద సినీ పత్రికగా పెంకిపిల్ల మంచి పేరే గడించింది.రాఘవరావు గారి కుమారులు కృష్ణారావుగారు, పార్నంది వేంకట సూర్యనారాయణ మూర్తిగారు ఇచ్చిన వివరాలతో ఈ విషయాలు మీతో పంచుకున్నాను. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు