ఇద్దరు మహానటులు కలిసి నటించిన తమిళ చిత్రం- రచన : యామిజాల జగదీశ్---జంటగా నటించడం అనేది కేవలం ఓ మగ ఓ ఆడా కలిసి నటించడాన్ని మాత్రమే చెప్పుకోవడం కాదు. ఇద్దరు ప్రముఖ హీరోలు కలిసి నటించడాన్నికూడా జంటగా నటించడాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తమిళ సినిమా జగత్తులో ఒక్కో దశలో అగ్రకథానాయకులు జంటగా నటించి విజయకేతనాన్ని ఎగురవేసిన సంఘటనలున్నాయి. చిన్నప్ప, కిట్టప్ప తదితర నటులు కలిసి నటించడం మొదలుకుని ఈనాటి "అజిత్ - విజయ్"ల వరకూ ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. అటువంటి హీరోల మధ్య దీర్ఘకాలంపాటు నువ్వా నేనా అన్నట్లుగా తమిళ సినీ రంగంలో నటించి అనేక రికార్డులు నమోదు చేసినవారు ఎంజీఆర్, శివాజీ గణేశన్. ఈ ఇద్దరు మహానటులకు ఉన్న పేరుప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు తెలిసిన అంశమే. ఈ ఇద్దరి సినిమాలనూ ప్రజలు ఆదరించారు.ఎంజిఆర్ రాజకీయాలలో సొంతంగా ఆల్ ఇండియా అన్నా ద్రావిడ కళగం అనే పార్టీని ప్రారంభించి ప్రజల మద్దతుతో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారుకూడా. మరోవైపు శివాజీ తుదిశ్వాస వరకూ నటిస్తూ వచ్చారు. ఎవరైనా ఎవరికైనా సాయం చేస్తే "ఇతనేమన్నా ఎంజియారా" అని తీసిపారేసేవారు. అలాగే ఎవరైనా ఆవేశంతో నటిస్తే "ఇతనేమన్నా శివాజీయా అలా నటించడానికి" అని అనడం కద్దు.వీరి తర్వాతి తరంలో కమల్ హాసన్, రజనీకాంత్ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాలు సంపాదించారు. రజనీ అయితే తొలిసారి కమల్ హాసన్ సినిమాలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరు మంచి మిత్రులుకూడా. అలాగే విజయాలూ సాధించారు. ఎంజిఆర్ - శివాజీ విషయానికొస్తే వీరిద్దరూ కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు విడివిడిగానే నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం పేరు "కూండుక్కిళి." అంటే తెలుగులో పంజరంలో పక్షి అని అర్థం.ఆర్ ఆర్ పిక్చర్స్ పతాకంపై టి ఆర్ రామన్నా దర్శకత్వంలో ఎంజిఆర్, ఎఎన్ఆర్ కలిసి నటించిన చిత్రమే కూండుక్కిళి. ఈ చిత్రంలో సరోజ కూడా నటించారు. శివాజీ జీవా పాత్రలో నటించారు.ఆ పాత్రతోనే కథ మొదలవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ తాడు దొరికినప్పటికీ శివాజీ రైలు శబ్దం వినిపించడంతోనే పట్టాలపై తల పెట్టి పడుకుంటాడు.అప్పుడు రైలు సమీపిస్తున్న సమయంలో ఎంజిఆర్ వచ్చి శివాజీని కాపాడుతాడు. ఎంజిఆర్ తంగరాజ్ పాత్రలో నటించాడు. ఆ క్షణంలోనే ఇద్దరూ మిత్రులవుతారు.అనేక మలుపులు తిరిగిన క్రమంలో ఓ దశలో శివాజీని వెతుక్కుంటూ ఎంజిఆర్ భార్య వస్తుంది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది.మరోవైపు ఎంజిఆర్ జైలు నుంచి విడుదల అవుతారు. అతనికి నిజాలన్నీ తెలుస్తాయి. ఓనాడు తాను ఏ రైలుపట్టాలపై చనిపోవాలని అనుకుంటాడో శివాజీ ఆ సమయంలో ఎంజిఆర్ వచ్చి అతనిని కాపాడిన విషయం తెలిసిందేగా. ఇప్పుడు శివాజీ అదే పట్టాలపై ఎంజిఆర్ ని ఎత్తి విసిరేస్తాడు. పిడిగుద్దులు గుద్దుతాడు. ఇంతలో అక్కడికి సొక్కి అనే స్త్రీ వచ్చి జరిగిన నిజాలన్నింటినీ చెప్తుంది. అది విన్న ఎంజిఆర్ శివాజీని క్షమిస్తాడు. ఇద్దరూ మళ్ళీ కలుస్తారు. ఎంజిఆర్ తన కుటుంబాన్ని కలుస్తాడు. తమ మధ్య రాజీ కుదిర్చిన సొక్కి అనే మహిళ చేయి పట్టుకుని గాల్లో ఓ చేయి తిప్పుతూ శివాజీ నడిచివెళ్ళగా శుభంకార్డు పడుతుంది.టైటిల్స్ లో ఎంజి రామచందర్, శివాజీ గణేశన్ అని ఇద్దరి పేర్లూ ఒకే సారి చూపిస్తారు. స్క్రీన్ ప్లే, కథ, మాటలు విందన్ అనే అతను సమకూర్చగా తంజై రామయ్య దాస్, షరీఫ్, మరుదకాసి పాటలు రాశారు. ఈ చిత్రంలో మొత్తం పన్నెండు పాటలున్నాయి. టి.ఆర్ రామన్నా దర్శకత్వం వహించారు. సినిమాలో ఎక్కువ శాతం శివాజీ కనిపిస్తే జెయిలుకి వెళ్ళిన ఎంజిఆర్ మళ్ళీ సినిమా ముగిసే సమయంలో కనిపిస్తాడు. ఈ చిత్రం 1954 ఆగస్టు 26 వ తేదీన విడుదలైంది. సినిమా విడుదలైన రోజో లేక తర్వాతో ఎంజిఆర్, శివాజీ అభిమానుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. సినిమా విడుదలైన సినిమా థియేటర్లో గొడవ తారస్థాయికి చేరింది. దాంతో సినిమా ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. సినిమా రీల్ ని తగులబెట్టారంటూ అనేక వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ ఇదే సమయంలో వచ్చిన చిత్రాలు, 1960, 70, 80 దశకాల వరకూ కొత్త ప్రింటుతో అనేక సినిమాలు మళ్ళీ ప్రదర్శనకు వచ్చాయి కానీవీరిద్దదరూ కలిసి నటించిన కూండుక్కిళి సినిమా మాత్రం మిస్సయింది.ఏదైతేనేం మక్కళ్ తిలగం ఎంజిఆర్, నడిగర్ తిలగం శివాజీ కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూండుక్కిళి చరిత్రపుటలకెక్కడం విశేషం.


కామెంట్‌లు