వీటూరి---నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో "ఆంధ్రప్రభ" దినపత్రిక సినిమా పేజీలో వీటూరి పేరు చూసినప్పుడల్లా బలే ముచ్చటేసేది. అంతేకాదు, ఎప్పటికైనా నేనూ అలా నా పేరు చూసుకోవాలని అనుకున్న సందర్భాలు న్నాయి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళి మనసులో మాట చెప్పాను. అప్పుడాయన "నీ మొహమాటపు ధోరణి, బెరుకుతనం సినీ రంగం తగినది కాదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవడమే సముచితం" అని అనడంతో ఆయన చెప్పింది నిజమే అనిపించింది. ఆయన నన్ను సరిగ్గానే అంచనా వేశారు. ఎందుకంటే నలుగురిలో మాట్లాడటమంటే ఒకింత జంకే. అప్పుడే కాదు, ఇప్పటికీ వెనకడుగు వేస్తాను నలుగురిలో మాట్లాడ టానికి. అటువంటి నేను దాదాపు ముప్పై ఏళ్ళు మీడియాలో ఎలా నెట్టుకొచ్చానో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. మీడియా ప్రపంచంలోనూ రాణించలేకపోయాను. అందుకు కారణం నా తీరుతెన్నులే. సరే విషయానికొస్తాను. మాకు వీటూరిగారు వరుసకు బాబాయ్ అవుతారు. మా రెండో మేనత్తకు వీటూరి స్వయానా తమ్ముడు. వీటూరి వాళ్ళావిడ కూడా మాకు చుట్టమే. పైగా మద్రాసు టీ. నగర్లో మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. కనుక ఆయనను చూడటానికి అప్పుడప్పుడూ వెళ్తుండేవాడిని. వీటూరి పూర్తిపేరు వీటూరి వెంకటసత్యసూర్య నారాయణ మూర్తి."కల్పన" అనే నాటకం ద్వారా నాటక రంగానికి పరిచయమైన వీటూరి ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధికెక్కారు. కల్పన నాటకంలో కథానాయిక పాత్రలో ఆయన నటించారు.తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించారు. పద్యాలు రాసి పత్రికలకు పంపేవారు..కవి సమ్మేళనాల్లో పద్యాలు ఆలపించేవారు. తను రాసిన పౌరాణిక నాటకాలకు ఆయనే హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామంలో జన్మించిన వీటూరి సొంతంగా ఓ నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశారు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన ఓ సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అనే బిరుదుతో సత్కరించారు. జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతోనూ ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో కథలు రాశారు.1957 లో అక్కాచెల్లెలు చిత్రానికి రచనలో సహకరించడం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన వీటూరి సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజుగార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు సహాయకుడిగా పని చేసి సినిమా స్క్రిప్టు రాయడం ఎలాగో తెలుసుకున్నారు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు కూడా రాశారు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో ఏర్పడిన పరిచయంతో ‘గజదొంగ’ చిత్రానికి ఆయన మాటలు రాశారు.1962 లో ‘స్వర్ణగౌరి’ అనే చిత్రానికి సాహిత్యమందించిన వీటూరి రాసిన తొలి సాంఘిక చిత్రం ‘దేవత ’. ఈ చిత్రం 1965 లో వచ్చింది ఇందులో ఆయన రాసిన సాహిత్యానికి విశేష ఆదరణ లభించింది. నిర్మాత భావనారాయణ, జానపదబ్రహ్మ బి. విఠలాచార్యల ప్రోత్సాహంతో అనేక చిత్రాలకు రచన చేసిన వీటూరి ‘విజయలలిత పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించి ‘అదృష్టదేవత' సినిమా నిర్మించారు. కానీ ఇది విజయవంతంకాలేదు. ఆయన దర్శకత్వంలో ‘భారతి (1975)’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ఆయన రచనకూడా చేశారు. తండ్రి ద్వారాను, మానాన్నగారి ద్వారానూ కవిత పట్ల మక్కువ పెంచుకున్న వీటూరి హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన తొలి చిత్రం ‘దేవత’ లో ‘‘బొమ్మను చేసి ప్రాణము పోసి’’ అనే క్లైమాక్స్‌ పాటకు మొదట రెండు పల్లవులు రాశారు. వాటిలో మొదటిది ‘‘నవ్వలేవు ఏడ్వలేవు ఓడిపోయావోయ్‌ మేధావి.... నవ్వించువాడు, యేడ్పించువాడు వున్నాడు వేరే మాయావి’. ఇక రెండవ పల్లవి ‘‘బొమ్మనుచేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా’’ అనేది. అయితే మొదటి పల్లవికన్నా రెండవ పల్లవినే అందరూ ‘‘ఓకే’’ చేశారు. కానీ ఇరవై రోజులైనా ఆయనకు చరణాలు కుదరడం లేదు. మరోవైపు సావిత్రి గర్భవతి కావడంతో త్వరగా సినిమా పూర్తి చేయాలనుకున్న పద్మనాభం శ్రీశ్రీని కలిసి ఈ క్లైమాక్స్ పాటను రాసిమ్మన్నారు. అయితే శ్రీశ్రీ పల్లవిని మార్చకుండా రెండు చరణాలను వెంటనే రాసిచ్చేశారు.దేవత చిత్రం తర్వాత పద్మనాభం తీసిన శ్రీరామకథ, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రాలకు కూడా వీటూరే రచన చేశారు. ఇక చిక్కడు దొరకుడు చిత్రంలో యన్ టీ ఆర్, కాంతారావులపై చిత్రీకరించిన "ఔరా వీరాధి వీరా" అన్న పోటీ గీతాన్ని వీటూరి రసవత్తరంగా రాశారు.నటుడు కాంతారావు నిర్మించిన సప్తస్వరాలు, గుండెలు తీసిన మొనగాడు చిత్రాలకు రచన చేసిన వీటూరి రాజసింహ, రాజయోగం, కత్తికి కంకణం, వీరపూజ, ఆకాశరామన్న, వినాయక విజయం, వేంకటేశ్వర వ్రతమహాత్మ్యం, మంగళగౌరి, లోగొట్టు పెరుమాళ్ళకెరుక వంటి చిత్రాలకుకూడా సాహిత్యమందించారు.క్రాంతికుమార్ నిర్మించిన శారద చిత్రంలో వీటూరి రాసిన రాధా లోలా గోపాలా గానవిలోలా యదుబాలా నందకిశోరా నవనీత చోరా అనే పాటకూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.వీటూరికి అద్భుత ఫలితాలు సాధించి పెట్టిన చిత్రం "భక్తతుకారాం".గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమాలో మొట్టమొదటగా పాడిన పాట వీటూరి రచనే. పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967) సినిమాలో ఈ పాట (ఓ ఏమి ఈ వింత మోహం) ను ఎస్పీబీ రఘురామయ్య, పీబీ శ్రీనివాస్, పి. సుశీలతో కలిసి పాడారు. కన్నుల్లో మిసమిసలు (దేవత), తొలి వలపే పదే పదే (దేవత)లాంటి గీతాలతోపాటు ఎన్టీఆర్ నటించిన యమగోల చిత్రంలో ఆడవే అందాల సురభామిని, గుడివాడ వెళ్ళాను వంటి పాటలను కూడా రాసిన వీటూరి యథాలాపంగా మాంగాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. నియమం ప్రకారం ఆరు వారాలు ఈ అమ్మవారి గుడికి వెళ్ళారు. కాకతాళీయమో లేక, అమ్మవారి అనుగ్రహమో ఆ ఏడాది ఆరోగర్యపరంగాను, ఆర్థికపరంగాను ఆయనకు తృప్తిగాను గడిచింది. అప్పుడాయన అమ్మవారి మీద ఆరు పాటలు రాసి ఆమె చరణాలకు అంకితం చెయ్యాలని అనుకున్నారు కానీ అప్పటికి నాలుగు సంనత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతుండడంతో అనుకున్న మాట ప్రకారం ఆయన పాటలు రాయలేకపోయారు. అందుకు అమ్మవారు ఆగ్రహించిందేమో తెలీదు కానీ వీటూరి భయంకరమైన జబ్బుతో 29 రోజులు కోమాలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆరునూరైనాసరే ఆరు పాటలు రాసి అచ్చు వేయించి అమ్మవారికి అర్పించాలని నిశ్చయించుకున్నారు. వాటికి ఆయన రాగాల పేర్లు పెట్టలేదు. ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు పాడుకునే రీతిలో పాటలు రాశారు. ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన అన్నగారి కుమారుడు శ్రీహరికి, ఎవిన్ బాబుకి ఎంతో ఋణపడి ఉన్నానని వీటూరి చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని శ్రీ కృష్ణ చిత్ర ప్రింటర్స్ అధినేత శ్రీ బీవీ నరసింహారావుగారు ముద్రించారు. పుస్తకం చిన్నదైనా ఇందులోని భక్తి గొప్పదంటూ అందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆశించారు. మాంగాడు అంటే మామిడితోపు (తోట) అని అరవంలో అర్థం. దీనినే సంస్కృతంలో ఆమ్రవనం అని అంటారు. అసలు ఈ తల్లి ఇక్కడ ఎలా, ఏ విధంగా వెలసింది అనే ప్రశ్నలకు జవాబుగా కథాసంగ్రహాన్నిస్తూ ఈ పుస్తకం అందించారు. 1934లో వీటూరి నారాయణ, రాముడమ్మ దంపతలకు పంచమ సంతానంగా జన్మించిన వీటూరి 1985లో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు