చిక్కాల హృదయాన్ని కోల్పోయాను--ఆవును, ఆ రసరమ్యమైన ఉత్తరాన్ని పదిలం చేసుకోవలసిన వాడిని. కానీ ఎలా ఎక్కడ ఎప్పుడెలా నా చేజారిందో తెలియడం లేదు. ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా ఆచూకీ తెలీడంలేదు. అన్నట్లు ఇంతకీ దేని గురించో ఇదంతా అనుకుంటున్నారా....అదేనండి, విషయానికొస్తున్నా...తిరువణ్ణామలైలోని చలంగారింట్లో పరిచయమైన చిక్కాల కృష్ణారావుగారు నా పెళ్ళయిన కొత్తలో ఓ రెండున్నర పేజీల పెద్ద ఉత్తరం రాశారు మాకు. ప్రియమైన రేణుకా జగదీశ్ లకి అంటూ మొదలుపెట్టిన తన ఉత్తరంలో ఖలీల్ జిబ్రాన్ కవితల్ని తెలుగులో అనుసృజించి తన ఆప్యాయానురాగాలను అందంగా అల్లిన మాటలవి. అటువంటి ప్రేమ గల ఉత్తరాన్ని దాచుకోవలసిన నేనెలా పోగొట్టుకున్నానో తెలీడం లేదు. చలంగారింట ఉత్తరాల పర్వం ఎంత గొప్పగా సాగుతుందో చెప్పలేను. బసవరాజుగారు సైకిల్ మీద పోస్టాఫీసుకి వెళ్ళి చలంగారికి వచ్చిన ఉత్తరాలన్నింటినీ ఓ బస్తాలో వేసుకుని ఇంటికి చేరేవారు. ఉదయం భోజనాలవడంతోనే ఓ గదిలో సమావేశమయ్యేవాళ్ళం. అక్కడ షౌగారి పక్కన చలంగారు కూర్చునేవారు. మిగిలిన వాళ్ళం ఆ గదిలో ఆసీనులయ్యేవాళ్ళం. తమకొచ్చిన ఉత్తరాలను చదవడం, ఆయన స్వయంగా కొన్నింటికి జవాబిస్తే మరికొన్నింటికి ఆయన విషయం చెప్పగా కృష్ణారావుగారు రాసేవారు. ఈశ్వరాశీర్వాదాలతో చలం అని ఉత్తరం ముగిసేది. నేను ఓ ఐదారు ఉత్తరాలు అందుకున్నా చలంగారి నుంచి. మా నాన్నగారికి 1962 లో ఆయన స్వదస్తూరితో రాసిన పోస్ట్ కార్డు నా దగ్గరుంది పదిలంగా.చలంగారింట జరిగే ఈ ఉత్తరప్రత్యురాల తీరువల్ల, ఆయన పుస్తకాలవల్ల ఆ శైలినంతా పట్టుకున్న కృష్ణారావుగారు తమ రచన పండించడంలో విజయవంతమయ్యారని నా వ్యక్తిగత అభిప్రాయం. కృష్ణారావుగారు ఆసక్తికరమైన అపూర్వమైన పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని పంపొరు కూడా. అయితే ఆయన పంపని "మోహరాత్రి" కావ్యాన్ని నేను కొనుక్కున్నా. యాభై అయిదు పేజీల చిన్న పుస్తకమే కావచ్చు కానీ అద్భుతమైన ఊహ. అమోఘమైన నడక. "చదివినంత కాలం అనారోగ్యం వెంటాడగ చదువు చాలించి చలం స్నేహం కోరి తిరువణ్ణామలై చేరి సౌరిస్ గారిని, అరుణాచలాన్ని దర్శించి భగవాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత కలిగిన ఓ దివ్యమైన సుందరమైన మధురమైన యదార్థమైన స్వానుభవానికిది రూపకల్పన. ఆ అనుభవానందపు అమృతఘడియల్ని కాలగర్భంలో కలసిపోనివ్వక వాటిని రసభరితం చేయాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం ( మోహరాత్రి ) . దివ్యమైన మురళీనాదం అనుక్షణం వినాలంటే లోపల నిశ్శబ్దంగా వుండాలి. ఆత్మానుభవం కావాలంటే, ప్రేమలో లీనం కావాలి" అంటూ ఈ అమోఘమైన ఈ వచన రచనను ఎంత హాయిగా మధురంగా ఆయన సాగించారో చెప్పలేను. నన్ను ఆద్యంతం కట్టిపడేసిన ఈ మోహరాత్రి నాలో భాగమైపోయిందన్నది ముమ్మాటికీ నిజం. చలంగారితో దీర్ఘకాలం పయనించిన కృష్ణారావుగారి జీవితం ధన్యమైంది.-యామిజాల జగదీశ్


కామెంట్‌లు