శ్రీవారి సుప్రభాతం -రమణీయం రమణ వ్యాఖ్యానం--తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి రోజూ 'సుప్రభాతం' అనే 'మేలుకొలుపు' సేవ అత్యంత విశిష్టమైనది. గొప్పది. ఈ విషయాన్ని నేనిప్పుడు ప్రత్యేకంగా మడి కట్టుకుని చెప్పక్కర్లేదు. అయితే ఈ సుప్రభాతానికి తెలుగులో ఓ వ్యాఖ్యానం చదివాను. ఆ అనుసృజన నన్నెలా కట్టిపడేసిందనడానికి నా దగ్గర మాటలు లేవు. ఆ వ్యాఖ్యానకర్త బహు గ్రంథాల రచయిత వజ్ఝల వేంకటనారాయణ వేంకటరమణగారు.తిరుమలలో ఇప్పటికీ ప్రతిరోజూ మొట్టమొదటగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ప్రతిరోజూ తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధిలోని శ్రీవైఖానస అర్చకుల తిరుమాళిగకు వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారు వాకిలి వద్ద నిరీక్షిస్తారు. ఈ లోపు పెద్ద, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంటారు. మూడు గంటలవడంతోనే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారాలను తెరుస్తారు. సన్నిధి గొల్ల వెనుకే వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళాన్ని తీసుకుని అందరూ లోపలికి వెళ్తారు. బంగారువాకిలి ముందు నిలిచి ఉన్న వేదపారాయణదారులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వారితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులలో ఒకరు అన్నమయ్య కీర్తన ఒకటి ఆలపిస్తారు. అప్పుడు అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పుపై పవళించి వున్న భోగ శ్రీనివాస మూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడిలోపలికి తీసుకుని వెళ్తారు. బంగారువాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు సమర్పిస్తారు. తర్వాత శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కను అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంతసేవానంతరం బ్రహ్మాది దేవతలు అర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణ దార్లు తదితరులతోపాటు భక్తులు లోపలికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అదలా ఉండనిచ్చి విషయానికొస్తాను.1970- 77 ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి "సప్తగిరి" ఆంగ్ల మాసపత్రికలో వి.ఎస్. వేంకట నారాయణ గారు "ఎ కామెంటరీ ఆన్ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్, స్తోత్రమ్, ప్రపత్తి అండ్ మంగళాశాసనమ్" ధారావాహికంగా వెలువడింది. ఆ రచనకే సరళమైన తెలుగు అనువాదాన్ని ఆంధ్రులకోసం అందించారు వజ్ఝల వేంకటనారాయణ వేంకటరమణగారు. ఈ పుస్తకం శీర్షిక "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్"శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ ఏదీ రాయలేదనే కొరతను తీర్చడానికన్నట్లు వీవీవీ రమణగారు శ్రీవేంకటేశ్వరుడి దివ్య కథను "శ్రీనివాసం" అనే పద్యగాన రచన చేశారు. ఈ పుస్తకం వెలువడిన తర్వాత తమ తండ్రిగారి ఆంగ్ల వ్యాఖ్యానాన్ని స్వామి వారి ఆదేశంగా తేట తెలుగులో ఎలాటి అడ్డంకులూ లేకుండా సునాయాసంగా పూర్తి చేయడం తనకెంతో శక్తినీ, తృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చిందన్నారు రమణగారు.ఈ పుస్తక ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సాయం అందించింది. తన తెలుగు అనువాదాన్ని కొండలరాయుడైన శ్రీనివాసునికే భక్తిపూర్వకంగా సమర్పించిన రమణగారు చెప్పినట్లు నేటి ప్రపంచంలో కులమతాలకు అతీతంగా పూజలందుకుంటున్న ఏకైక దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడనేది జగద్విదితం.శ్రీవారి భక్తుడైన ప్రతివాది భయంకర అణ్ణన్ ఈ సుప్రభాతాన్ని రచించారు. ఆయన క్రీ.శ. 1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు, ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు.సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి. అవి, వేంకటేశ్వర సుప్రభాతం (దేవునికి మేలుకొలుపు) లో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉంటాయి. ఈ భాగాన్ని ప్రతివాద భయంకర అణ్ణన్ గారు రాశారు. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరునిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధసిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తన సూచిస్తోంది. వెంకటేశ్వర స్తోత్రం - భగవంతుని కీర్తిస్తూ పదకొండు శ్లోకాలు ఉన్నాయి. ప్రపత్తిలో 16 శ్లోకాలు (శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం). గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడమే ప్రపత్తి లక్షణం. ఇక మంగళాశాసనంలో 14 శ్లోకాలు ఉంటాయి. ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించారంటారు.కౌసల్య తనయుడు శ్రీరామచంద్రుడే శ్రీవేంకటేశ్వరుడని మనకు గుర్తు చేస్తూ "కౌసల్యా సుప్రజా రామ పూర్విసంధ్యా ప్రవర్తతే/ ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్" అనే శ్లోకంతో సుప్రభాతం మొదలవుతుంది. "పుణ్యమాత కౌసల్యకు తనయుడవైన ఓ శ్రీరామా ! సర్వశ్రేష్టుడా, తూర్పున రాముడుదయించాడు. దైనందిన దైవ కార్యక్రమాలు, ప్రార్థనలు ఆరంభించాలి. కాబట్టి ఓ పురుషోత్తమా నిద్రలే " అని తొలి శ్లోకొనికి భావం రాయడంతోపాటు శ్రీరాముడైనా శ్రీ వేంకటేశ్వరుడైనా సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు అవతారమూర్తే అంటూ సవివర వ్యాఖ్యానాన్ని ఇచ్చిన రమణగారు ప్రతి శ్లోకాన్ని విపులంగా చెప్పుకొచ్చిన తీరు నన్నీ పుస్తకం పదే పదే చదివింపచేసింది. చదువుతున్నకొద్దీ మనసుకొక ప్రశాంతత. "ప్రపత్తి"లో .....శ్రీమన్ ! కృపాజలనిధే ! కృత సర్వలోక ....అని ప్రారంభమయ్యే శ్లోకాన్ని విడమరచి చెబుతూ శ్రీరాముని భక్తుడైన త్యాగయ్య అమృతవాహినిలో పాడిన పాట "శ్రీరామ పాదమా! నీ కృప జాలునే! చిత్తానికి రావే" ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యానం అమోఘం. సుప్రభాతాన్ని నిత్యమూ ఎవరైతే పఠిస్తారో వారు తమలోని దైవాన్ని తెలుసుకోగలరన్న తెలుగు వ్యాఖ్యానకర్త రమణగారి అభిప్రాయం అక్షరసత్యం. నేను "బుజ్జాయి" మాసపత్రికలో తిరుపతి క్షేత్రం గురించి ఓ ఆరేడు నెలలు సీరియల్ గా రాసిన రోజుల్లో రమణగారు ఇచ్చిన ఈ సుప్రభాత వ్యాఖ్యాన పుస్తకం నాకెంతో తోడ్పడింది.ఇలా ఉండగా, ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారితో పాడించిన సుప్రభాతం రికార్డు హిస్ మాస్టర్ వాయిస్ సంస్థవారికి "బంగారు బాతు" అని చెప్పకతప్పదు. ఆ సంస్థ "ఎంఎస్" గానం చేసిన సుప్రభాతాన్ని రికార్డు స్థాయిలో విక్రయించింది. తమ సంస్థ టర్నోవర్ తగ్గుతోందని అనుకున్నప్పుడు సుప్రభాతానికి సంబంధించి వెయ్యి కాపీలు విడుదల చేస్తే ఏ ఒక్క పంపిణీదారు గానీ రీటైలర్ కానీ ఆ రికార్డు తమకు వద్దని తిరస్కరించేవారు కాదు. అంతేకాదు, అమ్ముడు పోలేదని తిరిగిచ్చిన వారూ లేరు. సుప్రభాతానికున్న మహిమ అలాంటిది.ఈ "హెచ్ఎంవీ" సంస్థ పేరు తర్వాతి రోజుల్లో సరిగమగా మారింది.- యామిజాల జగదీశ్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి