ఎవరికోసం రాసారో.?--మా నాన్నగారు రాసిన కొన్ని పద్యాలు, సంస్కృత శ్లోకాల కాగితాలు కనిపించాయి. వాటిలో ఒకటి లాస్య భంగిమలు, శివతాండవం పాటలు. ఇవి1979 జూన్ లో రాసినవి. ఎవరికోసం రాసారో తెలియడం లేదు. అప్పట్లో మా నాన్నగారి దగ్గరకు నృత్య దంపతులు నరసింహాచారి, వసంతలక్ష్మీ దంపతులు ట్యూషన్ కి వచ్చేవారు. తర్వాతి కాలంలో వాళ్ళ కుమార్తెలు లావణ్య, లాస్య కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ నలుగురూ కలిసి నృత్యరూపకాలు చేసిన సందర్భాలున్నాయి. ప్రత్యేకించి నరసింహాచారిగారు మృదంగం వాయిస్తూ శివతాండవం చేయడం తెలుసు. అలాగే నట్టువాంగంలో పేరున్నవారు. నరసింహాచారి వారికోసం మా నాన్నగారు కొన్ని నృత్యరూపకాలు రాశారుకూడా. వాటిలో మేఘసందేశం లేక మేఘదూతమో (శీర్షిక గుర్తు లేదు) నాకు బాగా గుర్తున్నది. అయితే ఈ కింద పేర్కొన్న పాటలు వారికోసం రాసారా లేక మరెవరికోసమైనా రాసారో తెలీదు. ఆ పాటలు నాకు నచ్చాయి. అవి, 1 లాస్యభంగిమలు- అలరించే అగరాజకుమారి కులుకు చూపుల చకోరి ఒయారి అంచ నడల ఒయ్యారముతో మించు మెరుగు సయ్యాటలతో ఇంచు విలుకాని భావాలను పలి కించే కరాభినయ లయ గతితో శింజాన మణిమంజీర యుగ సంజాత ఘల్ఘలారవముతో కంజాత శరు వింజామరల రంజిల్లు సుమ పుంజాకృతితో హాసముతో దరహాసముతో సవి లాసముతో ఉల్లాసముతో భాసుర లాస్యము భంగిమలను సే బాసు సెబాసని భవుడు పొగడగా 2 శివతాండవం ఆనంద తాండవము చేసే పరమేశ్వరుడప్పుడు ఆనందంబుగ అంబికముందట అమరవరులు విరివాన కురియగా వాణీ సతి వీణను వాయింప చతురాననుండు స మ్మానంబుగ మద్దెల మ్రోయింప పీతాంబరుండు లయ మానంబుగ తాళము వేయంగ నందీశ్వరుండు సు జ్ఞానంబుగ గానము సేయంగ తత్తకిట తకిట తక ధిమంధిమ తతత్తళాంగు ఝేకిట ఝంతరికిట తక తధిం తకిట తక తళాంగు తక తళాంగు తక త త్తళాంగు తక ధిత్తళాంగు ధిమియన నాగభూషణ కలాప సువిరాగి హృదయ మణిదీప హృత యోగి దురిత జనతాప హత పాపి పాప హోమశైల చాప ధిమిత ఝణుత ఝణుతకిణత కిణత తతఝేం తకిట తధిత్తోం తాదిందిన్నా తకిట తకిట తక నాదిందిన్నా తఝేం తఝేం తక తద్ధిత్తా తకిట తక ధిత్తా తద్ధిత్తా తకిట తక ధిత్తా తద్ధిత్తా తకిట తక ధిత్తా తధిగిణత తధిగిణత తధిగిణత నిరుపమ గుణ రత్నాకర నీరజరిపు కళాధరా నీకు సరి యెవా రనుచును నిర్జర గణములు పొగడగ - యామిజాల జగదీశ్


కామెంట్‌లు