ప్రముఖ వాగ్గేయకారులు: --ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకమే "ప్రముఖ వాగ్గేయకారులు". ఈ పుస్తక రచయిత జి. కృష్ణగారు. భారత ప్రభుత్వ పబ్లికేషన్ డివిజన్ సమాచార మంత్రిత్వ శాఖ 1990 అక్టోబర్ లో ప్రచురించింది. ముప్పై పేజీల పుస్తకమే. ధర పన్నెండు రూపాయలు. పుస్తక ప్రదర్శనలో యాభై శాతం డిస్కౌంటుపై ఇచ్చారు. అంటే ఆరు రూపాయలు. ఇందులో వాగ్గేయకారులంటే ఎవరనే వివరణ వ్యాసంతో ప్రారంభమైన ఈ పుస్తకంలో అన్నమాచార్య , క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, మునిపల్లె సుబ్రమణ్య కవి, భక్తరామదాసు, త్యాగరాజు, తూము రామదాసు తదితరులను పరిచయం చేశారు కృష్ణగారు.మనిషి అనేక విధాలుగా భావాన్ని ప్రకటించుకొనగలడు. పక్షిని అనుకరించగలడు. పశువును అనుకరించగలడు. ఇతర మనుషులను అనుకరించగలడు. ప్రకటితంకాని అనేక మనోవ్యాపారాలను మనోవ్యత్తులను పాటలలో చెప్పగలడంటూ వాగ్గేయకారుల విషయాలను క్లుప్తంగా సంగ్రహించి మనముందుంచారు.కొన్ని వేల పాటలు రాసిన అన్నమయ్య వాటినన్నింటినీ రాగిరేకుల మీద రాసి తిరుపతి దేవస్థానంలో ఆనాటివారు పదిల పరిచారు. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు అన్నమయ్య గురించి సంగీతప్రియులకు తెలియచెప్పడానికి ఎంతో కృషి చేశారంటూ అన్నమయ్య 32 వేల పదాలు రాసినట్లు అతని కొడుకు పెదతిరుమలాచార్యుడు స్పష్టం చేసిన విషయాన్నిచ్చారు.వివిధ పుణ్య క్షేత్రాలు చూసినందువల్ల గానీ వేదాంతతత్వం ఎరిగినందువల్లగానీ క్షేత్రయ్య అనే పేరు పెట్టుకుని ఉండవచ్చనేది కొందరి ఊహైనా అతని అసలు పేరు వరదయ్య అని క్షేత్రయ్య పదాలు అభినయానికి అనునయమన్నారు. నాట్యాభినయాలకోసం క్షేత్రయ్య రాసిన జావళీలనేకం.ఇక నారాయణ తీర్థులనగానే ఆయన కృష్ణలీలాతరంగిణి గుర్తుకురాకమొనదు. ఒక్కొక్క కీర్తనా ఓ తరంగమే.మునిపల్లె సుబ్రమణ్య కవి కీర్తనలు రమ్య మైనవే. మొత్తంమీద చిన్న పుస్తకమే అయినా ఇందులోంచి తెలుసుకున్న విషయాలు బోలెడు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
bangaRAM చెప్పారు…
విలువైన సమాచారం.