పాత్రికేయుల ప్రొఫెషనాలిటీ.. పర్సనాలిటీ....--పాత్రికేయులు వృత్తిగతంగా ఎలా వ్యవహరించాలో జర్నలిజంలో చాలా ఏళ్లుగా కొన్ని సూత్రీకరణలు, ప్రమాణాలు ఉన్నాయి. సంఘటనలకు, పరిణామాలకు సంబంధించి పాత్రికేయులు సాక్షులుగా, పరిశీలకులుగా మాత్రమే ఉండాలని, తొణకని తటస్థతతో వాటిని రిపోర్టు చేయాలని చెబుతారు. జర్నలిస్టులు ప్రజాబాహుళ్యంలో భాగమైనప్పటికీ, వారికి విశ్వాసాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతం మాత్రమే కావాలనే వాదన ఉంది. ముఖ్యంగా రాజకీయాలు, కులమతాలు, ప్రాంతీయతల పరంగా జర్నలిస్టులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను, భావజాలాలను మానసికంగా తమకే పరిమితం చేసుకోవాలని, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయకూడదని, రాతల్లో చూపకూడదని, భౌతిక కార్యాచరణలో పాలుపంచుకోకూడదనే పద్ధతులూ ఉన్నాయి. విధి నిర్వహణలో పాత్రికేయుడు ఔట్‌సైడర్‌గా, స్వతంత్రమైన వ్యక్తిగా ఉండాలని, చూసింది చూసినట్టుగా పత్రికా రచన చేయాలని చెబుతారు. సంఘటనలు, పరిణామాల్లో సగటు వ్యక్తివలె ‘ఇన్‌వాల్వ్’ అయితే, పాత్రికేయ విధి నిర్వహణలో ప్రొఫెషనాలిటీ కొరవడుతుందనే భావజాలం కూడా ప్రచారంలో ఉంది.1993లో న్యూయార్క్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్ సూడాన్‌లో కరువు విలయతాండవం చేస్తున్న సందర్భంలో... చిక్కి శల్యమైన ఓ బాలిక ఆహారం కోసం ఎదురుచూస్తుండగా, ఆమె పక్కనే ఓ రాబందు కాచుకొని ఉన్న దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. ఈ చిత్రాన్ని ‘ది వల్చర్ అండ్ ఎ లిటిల్ గర్ల్’ అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన మొదటి పేజీలో ప్రచురించింది. ఈ ఒక్క ఫోటో సూడాన్‌లోని కరువు తీవ్రతను యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టింది. 1994లో ఈ ఫొటో ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్ ప్రైజ్‌ను గెలుచుకుంది. అయితే ఈ ఫోటో ఎంత ఆదరణ పొందిందో, అంత వివాదాస్పదమూ అయింది. అత్యంత హృదయవిదారక పరిస్థితుల్లో మరణం అంచున ఉన్న బాలిక పట్ల ఒక మనిషిగా స్పందించకుండా రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుంటూ గడపడం మానవత్వమేనా... అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అక్కడ రాబందులు రెండు ఉన్నాయని, ఒకటి ఫొటోలో కనిపిస్తున్నది అయితే, మరొకటి ఫొటోగ్రాఫర్ రూపంలో ఉందనే విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన కెవిన్... పులిట్జర్ అవార్డు అందుకున్న మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ పరిణామం జర్నలిస్టుల ప్రొఫెషనాలిటీ, పర్సనాలిటీల మధ్య ఉండే సన్నని విభజన రేఖపై తీవ్ర చర్చకు దారి తీసింది. జర్నలిస్టులూ మనుషుల్లో భాగమేనని, వారికీ భావజాలాలు, అభిప్రాయాలు ఉంటాయని, వాటిని వ్యక్తపరచడంపై పరిమితులు విధించడమంటే వారి స్వేచ్ఛను హరించడమేనని, స్వేచ్ఛ లేనిచోట సృజన వికాసం పొందలేదనే వాదనలు వెలువడ్డాయి. ప్రజల పక్షాన తమ అభిప్రాయాలను చాటుకుంటూనే విధి నిర్వహణ చేయవచ్చనే కొత్త సూత్రీకరణలూ వచ్చాయి. ఈ మార్పు వల్లే కాబోలు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది జర్నలిస్టులు– ప్రజల పట్ల, తమ ప్రాంతం పట్ల, తమ దేశం పట్ల వకాల్తా పుచ్చుకొని ప్రెస్‌మీట్లలో పాలకులతో వాగ్వాదాలకు, ఘర్షణలకు దిగిన దృశ్యాలు ఆవిష్కారమయ్యాయి. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఈ మార్పుకు సరైన సాక్ష్యంగా కనిపిస్తుంది. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో పాత్రికేయ విభజన రేఖలను, లక్ష్మణరేఖలను తోసిరాజని జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమకారులై కదం తొక్కారు. రాయినిగూడెంలోనైతే ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగాన్ని బాజప్తా అడ్డుకొని తెలంగాణ కాంక్షను దైర్యంగా చాటగలిగారు. ఉద్యమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను తమ వృత్తిపరమైన పరపతి, పలుకుబడి, సంబంధాలతో విడిపించగలిగారు. కేసులు నమోదు కాకుండా మేనేజ్ చేయగలిగారు. ఉద్యమానికి చివరికంటా రక్షణ కవచం వలె నిలిచారు. జర్నలిస్టులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమంటే వారి పాత్ర ఎంత క్రియాశీలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రస్తుత తెలంగాణ స్వయంపాలనలో తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితి ఎట్లా ఉందని చూసుకుంటే... అదో పెద్ద డిబేట్ అవుతుంది. దానికిది సందర్భం కాదు.తెలుగు పత్రికా రంగంలో క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టుల్లో సింహభాగం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే కనిపిస్తారు. అడుగడుగునా ఒడిదొడుకులు, సంక్షోభాలు, సంఘర్షణలు, సమస్యలు వారి జీవన గమనంలో భాగంగా కనిపిస్తాయి. అందుకే సామాన్య ప్రజల సమస్యల పట్ల వారిలో ఒకరకమైన మమేకత కనిపిస్తుంది. పీడితులూ బాధితులకు సంబంధించి, సామూహిక ప్రజల సమస్యలకు సంబంధించి వార్తా రచనకే పరిమితం కాకుండా, చొరవతో వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులతో, సమాజంలోని భిన్న వర్గాలతో మాట్లాడి సాయం అందేలా వ్యక్తిగతంగా తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. అయితే ఇట్లాంటి పాత్రికేయుల సంఖ్య స్వల్పంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ స్పృహ, అవగాహన, చైతన్యాన్ని అందింపుచ్చుకునే పాత్రికేయుల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. అయితే సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల భౌతిక కార్యాచరణ అంతిమ ప్రయోజనం.. ప్రజలది అయినప్పుడు మాత్రమే దానికి ఆమోదనీయత, మద్దతు ఉంటాయి.ఈ కోణంలో సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి కరీంనగర్ బ్యూరో చీఫ్ నగునూరి శేఖర్ చేసిన ఓ మానవీయ ప్రయత్నం సగటు పాత్రికేయులందరికీ స్ఫూర్తిదాయకం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని కాట్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డునపడిన నేరెళ్ల మమత(18), సమత(12) కన్నీటిగాథను కేవలం పత్రికారచనకే పరిమితం చేయకుండా, వారిని గట్టెక్కించే కార్యాచరణకు స్వయంగా పూనుకున్నారు. వారి దీనస్థితిని సోషల్‌మీడియాలో పోస్టు చేయడం ద్వారా, దేశ విదేశాల నుంచి బాలికలకు ఆర్థికంగా అండ లభించేలా చేయగలిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వయంగా మాట్లాడి వారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే చర్యలకు బాసటగా నిలిచారు. స్థూలార్థంలో ఇది శేఖర్ మానవీయతకు నిదర్శనమే కావొచ్చుగాని, సూక్ష్మార్థంలో అది పాత్రికేయ వృత్తికి ఉన్న విశ్వసనీయతకు, పరపతికి సాక్ష్యం. ఈ శక్తిని సమాజం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వాడే సంకల్పం, చిత్తశుద్ధిని పెంపొందించుకున్నప్పుడు, దానిని వీలైనప్పుడల్లా అమలు చేసే అలవాటును జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు పాత్రికేయ వృత్తికి సమాజం జేజేలు పలుకుతుంది.సూడాన్ బాలికను ఫొటో తీయడంతో పాటు, ఆమెకు ఆహారం సమకూర్చి శిబిరంలోకి తీసుకుపోయి ఉంటే, బహుశా కెవిన్ కార్టర్‌కు పులిట్జిర్ అవార్డును మించిన ప్రశంసలు జీవితపర్యంతమూ దక్కేవి. కానీ ఆ చైతన్యం, స్పృహ లేకపోవడం వల్ల కెవిన్ అప్పుడు ప్రొఫెషనాలిటీకే పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడా స్పృహను ఆచరణలోకి తీసుకువెళ్లే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కావాల్సిందల్లా.. నిబద్దత, నిజాయితీ మాత్రమే. సోషల్ రెస్పాన్సిబిలిటీని జర్నలిస్టులు రాతల్లోనే కాదు, చేతల్లోనూ చూపిస్తే ఈ సమాజానికి వారి పర్సనాలిటీ ఎంత మేలు!–శంకర్ శెంకేసి--79898 76088
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి