ఆర్జేడీ, కాకినాడవారు 1999 నవంబరులో బదిలీ చేసారనుకుంటాను. నేనూ, నా స్నేహితుడు మాకు కావలసిన స్థలాలకు బదిలీ అయినందున మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం చెప్పలేనిది. కాకినాడలో ఒకరోజుండి అక్కడ ఉండే దేవాలయాలు‌, బజార్లు, సినిమాహాళ్లు అలా వెళ్లి ఇంకా ఏవోఏవో వింతైన ప్రదేశాలు చూసుకువచ్చాం. అట్నుండి కాకినాడ- విశాఖపట్నం బస్సెక్కి విశాఖ వచ్చాం. అక్కడ నుండి విశాఖపట్నం- పార్వతీపురం బస్సెక్కి పార్వతీపురం ముందు స్టేషన్ అయిన బొబ్బిలిలో దిగిపోయాం. మా ట్రాన్ఫర్స్ నవంబరులో అయితే జరిగాయి.కానీ అకడమిక్ ఈయర్ ఎండింగ్ లోనే బదిలీ కాబడిన కొత్త పాఠశాలలో చేరాలి. అంటే 23-04 2000న జాయిన్ అవ్వాలి. సీతానగరానికి నా ట్రాన్ఫర్ విషయం అలాగే నా స్థానంలో నా స్నేహితుడు హెడ్మాష్టరుగా వస్తున్న విషయం ఎం. ఎల్. ఏ గారితో చెప్పాను. చిన్న చిరునవ్వు నవ్వేసారు. డిశంబరులో క్రిస్టమస్ శలవులు, జనవరిలో హాఫ్-ఈయర్లీ పరీక్షలు, పండగ శలవులు, తరువాత జనవరి చివర్లో ఒక పది, పండ్రెండు రోజులు వర్కింగ్ డేస్, ఫిబ్రవరినుండి ఏప్రిల్ మూడు నెలల పాటు పక్కిలో పనిచేయాలి. ఇంతకుముందు కంటే ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగాఉండాలి. జాగ్రత్తగా పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాను.స్కూలు నుండి ట్రాన్ఫర్ అయిపోయింది కాబట్టి ఏమీ పట్టించుకోలేదు. స్కూలును తగలబెట్టేసి వెళ్లి పోయాడనే చెడ్డమాట రాకూడదు. అలా ఎవరూ అనుకోకూడదు.అలా జరిగితే నేను ఈ స్కూలుకు వచ్చేనాటికి ఏ పరిస్థితులుఉన్నాయో అవే పరిస్థితులు యథాతథంగా వచ్చే ప్రమాదం ఉంది. అంచేత ఏప్రిల్ 23, 2000 వరకూ నా పద్ధతిలో నేనే పరిపాలన కొనసాగించాను. పదవతరగతి ఫలితాలు కొద్దిగా మెరుగు పడ్డాయి. సెండాఫ్ పార్టీ చాలా బాగానే ఇచ్చారు. సీతానగరం హైస్కూల్లో ఏప్రిల్ 23, 2000 న జాయిన్ అయ్యాను. హెడ్మిష్ర్టస్ నుండి ఛార్జ్ తీసుకు న్నాను. ఆమె చాలా భయస్థురాలు, గట్టిగా మాట్లాడలేని వ్యక్తిగా, 30మంది స్టాఫ్ ను కంట్రోల్ చేయగలిగేవారుకాదని విన్నాను. అందరూ యోధానయోధులేనట. ఆ స్కూలుకు ఆవిడ హెచ్.ఎం అయితే ఆ ప్రక్కనే ఫస్ట్ అసిస్టెంట్ ప్రత్యేకంగా ఒక టేబుల్, ఒక కుర్చీ వేయించుకు కూర్చుని అసిస్టెంట్ హెడ్మాష్టరుగా పిలిపించుకునేవారు. ఆమె ఏమీ అనలేక అతనికి ఆ బిరుదును, టేబుల్, కుర్చీని శాశ్వతం చేసారు. అసలు జిల్లాపరిషత్తు హైస్కూలులో ఒక హెడ్మాష్టరు పోస్ట్ ఉంటుంది. మిగిలినవారంతా అసిస్టెంట్స్ గానే ఉంటారు. అసిస్టెంట్ హెడ్మాష్టరు పోస్ట్ ఉండనే ఉండదు. నేను వెళ్ళిన తరువాత నాకు కావలసిన విధముగా సర్దుకున్నాను. అసిస్టెంట్ హెడ్మాష్టరు పోస్ట్ తొలగించి హెడ్మాష్టరు సీటు ప్రక్కనున్న టేబుల్, కుర్చీని తీయించేసి ఒక క్లాస్ రూంలో అటెండరుచే పడించేసాను. ఇక్కడ సొమిరెడ్డి చిన్నంనాయుడు అనే గ్రేడ్-1 తెలుగు పండిట్ ఉండేవారు. నేను బలిజిపేట హైస్కూల్లో బి.ఇడి అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు అతను నా కొలీగ్ గానూ, అదే హైస్కూల్లో నేను ఎఫ్. ఏ. సీ హెడ్మాష్టరుగా పనిచేసే టప్పుడు అతను నా అసిస్టెంట్ గానూ పనిచేసారు.అప్పటికీ ఇప్పటికీ అతనికి నేనంటే చాలా అభిమానం!అతను తెలుగు భాషాప్రవీణ. భాషా పటుత్వం గలవాడు.హాస్యచతురత గలవాడు. బ్రహ్మానందంకి మారుపేరు అనుకోవచ్చు. ఆ తెలుగు మాష్టారు పిల్లలకు పాఠాలు చెబుతుంటే నాగు బాముకు నాగస్వరం ఊదినట్టుగ ఉంటుంది. పిల్లలకు ఆ మాష్టారంటే చాలాఇష్టం.అయితే నేనంటే ఈ మాష్టారుకు ఇంకా ఇష్టం. నేను నవంబరులో సీతానగరం హై స్కూల్ కు ఆర్డర్స్ అందుకున్నప్పటి నుండి నాగురించి అతను ప్రచారం చేయని రోజేలేదట. పని చేసేవానికి అందలం ఎక్కిస్తానని, అడ్డదారుల్లో నడిచేవానికి చుక్కలుచూపిస్తానని చెప్పేవా డట ! ముందుగానే ఒక టెర్రర్ క్రియేట్ చేసాడతను. అయితే నా మనస్థత్వం అటువంటిదే. నన్ను నమ్ముకున్నవానిని, నన్ను అభిమానించేవానిని నేనూ అదే విధమైన నమ్మకం, అభిమానం చూపిస్తాను. ఎందుకంటే అతను నా మనిషి. అతనికి కావలసిన పనులు నా స్వంత పనులుగా భావించి చేస్తాను. అలా ఉంటానని అందరికీ తెలుసు. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు