బలిజిపేట హైస్కూల్ చాలా పెద్ద హైస్కూలు. నేను బలిజిపేటకు బదిలీపై బి. ఇడి అసిస్టెంట్ గా వచ్చేసరికి పాఠశాల విద్యార్థుల స్ట్రెంగ్త్ వెయ్యి, పదకొండు వందల మధ్య ఉండేది. అలా చుట్టు ప్రక్కల 2,3 గ్రామాల్లో యూ. పిస్కూళ్ళు, హైస్కూళ్ళూ వచ్చేసాయి. వాటి మూలంగా బలిజిపేట హైస్కూల్ స్ట్రెంగ్త్ రానురానూ700-800 మధ్యకు పడిపోయింది.అంత పెద్ద హై స్కూలుకు కావలసినదానికంటే ఎక్కువగానే భౌతిక వనరులు మొదటి జన్మభూమి ( 1997 జనవరిలో అనుకుంటాను ) రెండు నెలలలో సమకూర్చు కోవడం జరిగింది. ఇలా సంపాదించడానికి ఆయా గ్రామాలప్రజాప్రతినిధుల అవసరం రాలేదు. మా టీచర్స్ ముందుగా ఆయా గ్రామాలు వెళ్లి వాళ్ళను మోటివేట్ చేసేవారు. తరువాత ఏడుగురు టీచర్స్ ( ఆ వారం గ్రూప్ ) గ్రూపుతో ఒకసారి వెళ్తే చాలు. అనుకున్న మాట ప్రకారం పాఠశాలకు ఇస్తామన్న వస్తువు వారం పదిరోజులలో వచ్చేసేది. అలా 12 టేబుల్స్, 25 కుర్చీలు, మ్యాప్ లు, అట్లాసులు, వాచీ ఇలా పాఠశాలకు కావలసిన వస్తువులు రావడమేగాకుండా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం యొక్క కిటికీలు,ద్వారాలు, గచ్చులు బాగు చేయించడం రంగులు, పాఠశాల కు రంగుల్లో సున్నాలు, వేయించడం జరిగింది. రెండు నెలల్లో ఇంతటి కార్యక్రమంవిజయవంతం చేయడం, మొదటి జన్మభూమి సందర్భంగా జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్టు పొందడం జరిగింది. కానీ ఇక్కడ ఈ పక్కి గ్రామంలో ఎం. ఎల్. ఏ గారు, విద్యాకమిటీ సభ్యులు ఏమాత్రం పట్టుదల వహించినా ఆ స్కూలు ఆఫీసు రికార్డులకు ఒక పెద్ద బీరువా, కుర్చీలు సమకూర్చు కోవడం ఏమంత పెద్ద విషయం కాదు. ఈఊరుకు ఇంతమంది పెద్ద పెద్ద నాయకులున్నారు. మాట ఇచ్చారు. పదేసార్లు అడిగినా ఎలుక మీద పిల్లి, పిల్లి మీద ఎలుక చందాన ఒకరి మీద ఒకరు చెప్పుకొచ్చారు. కొన్ని నెలల కాలం గడిచింది. పాఠశాలను అభివృద్ధి చేయవలసిన నాయకులే ఇలా చేస్తే మరి ఆ స్కూలును బాగుపరచేదెవరు ? వాళ్ళ ఊరు పిల్లల కోసం స్కూలు, ఆ పిల్లల కోసం పాటుపడే ఉపాధ్యా యులకు సహకరించవలసిన నాయకులు వెనుకంజ వేయడం నన్ను చాలా బాధ పెట్టింది. ఏమైతేనేం మా ఉపాధ్యాయులే ఊరులో ఉన్న కొంతమంది దాతలను కలుసుకొని అనుకున్నది సాధించారు. నాయకులకు లేని శ్రద్ధ మనకెందుకులే అని పాఠశాల నిర్వహణలో ఎటువంటిలోపం రానీయలేదు. ఒకనాడు సాయంత్రం నేను స్కూల్ స్టేడియంలో కు‌ర్చీ వేసుకుని పిల్లల ఆటలను చూస్తున్నాను. ఇంతలో ఒక అబ్బాయి తండ్రి వచ్చి " హెడ్మాష్టరుసారూ ! మీకో విషయం చెబుదామని వచ్చానండీ.మధ్యాహ్న భోజన విరామ సమయంలో మీ స్కూలులో ఒక టీచర్ ( టీచర్ పేరు చెెెప్పాడు )పిల్లలను పిలచి చనువుగా మాట్లాడుతూ ఏ ఏ పంటలు పండిస్తామో తెలుసుకొని ఉల్లిపాయలు, మిరప కాయలు తీసుకురారా అనడం అవి ఇచ్చిన తరువాత ఇంకేవో తెమ్మంటున్నారు సార్ ! అప్పటిికీ లేేదనక చాలా సార్లు ఫ్రీగా ఇచ్చామండీ ! మాటిమాటికీ ఫ్రీగా ఇవ్వాలంటే మాకూ కష్టమేనండీ. ఇంతకు ముందు ఎంతోమంది టీచర్లు మా బడికి వచ్చారు గానీ ఇటువంటి టీచర్ ను ఎప్పుడూ చూడ్నేదండి. ఇక చేప, మాంసం, గుడ్డు వండుకున్నామని తెలిస్తే తనకు ఒక కప్పుతో తీసుకురమ్మంటున్నారండి. !మా ఇళ్ళల్లో ఊరగాయ, అప్పడాలు, ఒడియాలు, బూరెలు, గారెలు లాంటివి చేసుకోడానికి కూడా భయపడుతున్నా మండీ. టీచర్లు అడిగినవి ఇవ్వకపోతే మార్కులు తగ్గించేస్తా రేమోనని పిల్లలు భయపడుతున్నారండీ అని తనగోడును వెళ్ళగక్కుకున్నాడు వినయంగా. సైలెంట్ అయిపోయాడు. అంతా విన్నాను. " రంగయ్య ! నివ్వు అలా భయపడవలసిన అవసరం లేదు. మీ పిల్లలు బాగా చదువుకుంటేమంచి మార్కులొస్తాయి. గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. ఎవరి దగ్గరా మీ పిల్లలు భయపడవలసిన అవసరంలేదని చెప్పాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచన నా మెదడును పట్టేసింది. టీచర్స్ ఇలాదిగజారి ప్రవర్తిస్తారా ? హైస్కూలులో పనిచేస్తూ ఎంత డిగ్నిఫైడ్ గా ఉండవలసింది ! ప్రభుత్వం ఉపాధ్యాయులకు కొన్ని వేల రూపాయల నెలకు జీతం ఇస్తుంది. హాయిగా, హూందాగా బ్రతకడం మానేసి ఇదేం ఖర్మ ! మిరపకాయలు అడుక్కోవడం, వేరుశనక్కాయలు అడుక్కోవడం, కందులు అడుక్కోవడం, కూరలు అడుక్కోవడం ఇదేం పని ! ఇలా ఆలోచిస్తుంటే నా మనసు ఏదోలా అయిపోతుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద స్కూళ్ళలో స్టాఫ్ ఎక్కువమంది ఉన్న స్కూళ్ళల్లో పనిచేసాను. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారెవరినీ, ఇంత చీప్ మెంటాలిటీతోనున్న వారిని చూడలేదు. కానీ ఈరోజు చూడగలిగాను. ఈసమస్యను పరిష్కరించేందుకు నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదలచుకోలేదు. సైన్స్ మాష్టారిని, ఒక సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ ని ( ఎం. ఎల్.ఏ గారి చిన్నాన్న కొడుకు) పిలచి నాకు వచ్చిన కంప్లైంట్ గురించి చెప్పి నా వరకూ ఈ సమస్యతిరిగి రాకూడదన్నాను. అలాగే ఆ టీచర్ తో మాట్లాడి ఈసమస్యను అక్కడితో ముగింపుచేసారు. ఆ రోజు నుండి ఆ టీచర్ లో మార్పు వచ్చింది. అది తెలుసుకున్న నేను ఎంతో సంతోషించాను. ఇంతలో ప్రభుత్వం నుండి పాఠశాల నిర్వహణలో పని వేళలు పొడిగిస్తూ ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా వచ్చాయి. దాని ప్రకారం రోజు మొత్తంపై రెండు ఇంటర్వెల్ లు ఇస్తూ సాయంత్రం4.45 వరకూపాఠశాలనునిర్వహించాలన్నదే దానిలోని సారాంశం. ( సశేషం )- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు