2. బహుమతిగా వచ్చిన పుస్తకం---పార్వతీపురం మునిసిపాలిటీలో బెలగాం ఒక ప్రాంతం. అక్కడ హైస్కూల్ మెయిన్ బ్రాంచ్ఉండేది.అది జిల్లా పరిషత్ మల్టీపర్పస్ హైస్కూల్ గా పిలవబడుతుండేది. అక్కడ ఫోర్త్ ఫారం(9వ తరగతి) నుండి సెవెంత్ ఫారం (12వ తరగతి) వరకు తరగతులుండేవి. ఫస్ట్ ఫారం (6వ తరగతి) నుంచి థర్డ్ ఫారం వరకు(8వ తరగతి) వరకు బోధన చెయ్యడానికి రెండు బ్రాంచీలు పెట్టారు. ఒకటి బెలగాం లో హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన మరొకటి పార్వతీపురం పట్టణంలో కుప్పిలి వారి మేడ లోను పెట్టారు. నేను టౌన్ బ్రాంచ్ లో చదివే వాడను. 7వ తరగతి సంవత్సరాంతంలో పాఠశాల వార్షికోత్సవం తలపెట్టారు. ఆ సందర్భంగా గత యేడాది తెచ్చుకున్న మార్కులకు గాను ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రతి తరగతికి ప్రకటిస్తూ మా టౌన్ బ్రాంచ్ కి మెయిన్ బ్రాంచ్ నుంచి సర్క్యలర్ వచ్చింది. పాఠం చెబుతున్న మా మాష్టారు మరల సుబ్బారావుగారు సర్క్యులర్ చదివి నా వైపు చూశారు. ఆ మాష్టారంటే అందరికీ భయమే. నా గుండె దడ దడ కొట్టుకుంది.కారణం గత దినం జరిగిన సంఘటన. మెయిన్ బ్రాంచ్ నుంచి హెడ్ మాష్టారు టౌన్ బ్రాంచ్ విజిట్ చెయ్యడానికి వచ్చారు.పిల్లలెలా నోట్స్ లు రాస్తున్నారని అడిగితే మా మాష్టారు నా ఇంగ్లీష్ నోట్స్ అడిగి ఆయనకు చూపించారు. నలభై మంది విద్యార్ధులలో నా నోట్స్ అడిగినందుకు నేను చాలా సరదా పడ్డాను.కించిత్ గర్వపడ్డాను.కాని ఆ సంతోషం కొద్ది క్షణాలు మాత్రమే.నా నోట్స్ లో ఒకటి రెండు తప్పులు మా మాష్టారు గారికి ఆయన చూపించారు. నా సంతోషం ఎగిరి పోయింది. మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిన హెడ్ మాష్టారు రిక్షా ఎక్కి అలా వెళ్ళారో లేదో మా మాష్టారు ఉగ్ర నరసింహం అవతారమే ఎత్తారు. నీ నోట్స్ బాగుంటుందని చూపిస్తే నాకు మాట తెచ్చినట్టు రాస్తావా అని నా వీపు మీద విమానం మోతే మోగించారు. అందుకే ఇప్పుడు ఆయన నా వైపు చూసే సరికి భయం కలిగింది.ఈసారి ఆ భయం ఎంతోసేపులేదు.మా మాష్టారు " ఒరేయ్ బెలగాం! గత యేడాది 6వ తరగతి పరీక్షల మార్కుల్లో నీకు స్కూల్ సెకండ్ వచ్చింది.ఏనవర్సరీ ఫంక్షన్లలో నీకు బహుమతి యిస్తారు.ఎల్లుండి సాయంత్రం మెయిన్ బ్రాంచ్ కు వెళ్ళు " అని చెప్పేరు. నా ఆనందానికి అవధులు లేవు. పాఠశాల వార్షికోత్సవం జరుగుతున్న రోజు నేను రొంపల్లి వేంకట రమణమూర్తి అనే నా చిన్ననాటి మిత్రుడు కలిసి బెలగాం వెళ్ళాం.సభ ఇంకాప్రారంభం కాలేదు. మా తరగతి మిత్రులు బెహరా చంద్రశేఖరరావు, చక్కా లచ్చయ్య అక్కడ కనిపించారు.మేమంతా ఒక దగ్గరున్నాం.అంతలో సభ ఆరంభమయింది. పెద్దలు మాట్లాడారు.తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.నాటికలు,నృత్యాలు అద్భుతంగా విద్యార్థులుచేశారు. అంతలో బహుమతీ ప్రదాన కార్యక్రమం ఆరంభమయింది.మా డ్రిల్ మాష్టారు బసవన్న గారు విజేతల పేర్లు పిలుస్తుంటే ఒకొక్కరు వెళ్ళి బహుమతి అందుకొని వస్తున్నారు.6వ తరగతి వంతు వచ్చింది. మొదటి బహుమతి మా పక్క సెక్షన్ విద్యార్థి పేకేటి రాంజీ కి వచ్చింది. వెళ్ళి తీసుకున్నాడు.తరువాత నా పేరు పిలిచారు.వేదిక వద్దకు వచ్చాను.వేదిక ఎక్కలేక పోయాను.అంత పొడవుగా ఉండేవాడిని మరి! ఒక మాష్టారు పరుగున వచ్చి నన్ను వేదిక పైకి ఎక్కించారు.వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ అంగర సోమశేఖరరావు గారు ప్రముఖవిద్యావేత్త. ఒకప్పుడు వార్షికోత్సవం జరుగుతున్న మా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ చేశారు.విద్యార్థుల కోసం అనేక ఇంగ్లీషు వర్క్ బుక్స్ రాశారు. మా ప్రాంతంలో ఇప్పటికీ ఆ తరం వారు ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అటువంటి ప్రముఖవ్యక్తి చేతుల మీదుగా ఒక పుస్తకాన్నిబహుమతిగా అందుకున్నాను.వేదికపై ఉన్న పెద్ద వారికి నమస్కరించి వేదిక దిగడానికి చూశాను. వేదిక పైకి ఎక్కించిన మాష్టారే నన్ను వేదిక నుంచి దించారు.అక్కడున్న వెలుగులో పుస్తకం చూశాను." పిల్లల బొమ్మల గౌతమ బుద్ధుని చరిత్ర " అని పుస్తకం పేరు కనిపించింది. గుండెలకు పుస్తకాన్ని హత్తుకున్నాను. స్నేహితులకు పుస్తకం చూపించి భద్రంగా పట్టుకున్నాను.అంతలో జనగణమనతో కార్యక్రమం ముగిసింది.కొత్త పుస్తకం వాసన చూస్తూ ఆనంద లోకంలో విహరిస్తూ ఇంటికి చేరాను నాన్నగారు గడపలోని వాలు కుర్చీలో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన చేతిలో పుస్తకం పెట్టి అమ్మ దగ్గరకు పరుగెత్తాను. అంతలో నాన్నగారు పుస్తకం పట్టుకుని ఇంట్లో కొచ్చారు. ఇంట్లో అందరు పుస్తకం చుట్టూ చేరిపోయారు. గబగబా పేజీలు వాళ్ళు తిప్పుతుంటే ఆ పుస్తకం ఎక్కడ నలిగి పోతుందేమోనన్న ఆందోళన కలిగింది. నాన్నగారు నా భుజం తట్టి "కష్టపడు.ఇటువంటి బహుమతులే బోలెడొస్తాయి." అనడం నాకిప్పటికీ గుర్తే! అమ్మ కూడా ఆనందించింది!ఆ యేడాది వేసవి సెలవుల్లో ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివానో లెక్క లేదు.ఆ పుస్తక రచయిత పేరు పూర్తిగా గుర్తు లేదు.ఇంటి పేరు వేదుల అని మాత్రం గుర్తుంది. పాఠ్య పుస్తకాలు లోని కథలు కాకుండా నేను చదివిన మొదటి బాలసాహిత్యం పుస్తకం "బాలల బొమ్మల గౌతమ బుద్ధుని చరిత్ర "అని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. (సశేషం) బెలగాం భీమేశ్వరరావు9989537835


కామెంట్‌లు