నిజమైన ధనవంతుడు ( కథ) : --సుజాత.పి.వి.ఎల్.: ---ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు. వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీలాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి