అన్నదాత ----అవును, అక్షరాలా అన్నదాతే! నలభై నాలుఏళ్ళ పది నెలలు నడిచిన "బుజ్జాయి" పిల్లల మాసపత్రికతో నాకున్న అనుబంధం 2000 జనవరి నుంచి 2019 జూన్ సంచిక (వెలువడిన చివరి సంచిక) వరకూ కొనసాగింది. జీ. అప్పారావుగారు ప్రచురణ కర్తగా ఆయన నేతృత్వంలో వెలువడిన ఈ మాసపత్రికకు ఎక్కవ శాతం రచన చేసిన మధురాదర్ గారే నాకు మొట్టమొదటగా బుజ్జాయి మాసపత్రికలో రాసే అవకాశం ఇచ్చారు.మొదటగా ఈ పత్రికలో నేను రాసిన వ్యాసం బ్యాంకుల చరిత్ర గురించి ఒక్క పేజీ. అది అచ్చవడంతోనే మధురాదర్ గారు కబురంపి పాతిక రూపాయలతోపాటు ఓ ప్రతి కానుకగా ఇచ్చారు. "పాతిక రూపాయలేనా అని తక్కువగా చూడకు. రెండు అరటి పళ్ళు, అర కిలో టొమాటోలు వస్తాయ" న్నారు మధురాదర్ గారు. మరుసటి నెల రెండు వ్యాసాలు రాసాను. అంటే జస్ట్ రెండు పేజీలు. ఇలా మధురాదర్ గారితో ఉన్న అనుబంధం పెరుగుతూ వచ్చింది. కొన్నేళ్ళకు ఆయన అనారోగ్యంతో కన్ను మూశారు.అప్పుడు బుజ్జాయి అధిపతి అప్పారావుగారు నేను పని చేస్తున్న సన్ టీవీ ఆఫీసుకి ఓ మధ్యాహ్నం ఫోన్ చేసి ఓ అయిదు నిమిషాలు కలసి వెళ్ళమన్నారు.సరేనని మా ఇన్ చార్జ్ తోట భావనారాయణగారి దగ్గర ఓ అర గంటలో వస్తానని చెప్పి బుజ్జాయి ఆఫీసుకి వెళ్ళి అప్పారావుగారిని కలిసాను.ఇక్కడో విషయం చెప్పాలి. అప్పటివరకూ అప్పొరావుగారు ఆయనే అని తెలీదు. ఆయనను కలిసి అప్పారావుగారు రమ్మంటే వచ్చానండి. ఆయనను కలవాలి అన్నాను. ఆయన ఓ నవ్వు నవ్వి "నేనే అప్పారావుని" అంటూ కూర్చో మన్నారు.కుండలో నీళ్ళిప్పించారు.మధురాదర్ గారు పోయిన విషయం చెప్పి ఆయనకు నివాళులర్పిస్తూ ఓ నాలుగు మాటలు రాసివ్వాలంటే భగవద్గీతలోంచి ఓ శ్లోకం కోట్ చేసి కొన్ని మాటలు రాసిచ్చాను. ఫోటోతోసహా తదుపరి సంచికలో ఆ నివాళి సమాచారం వేశారు. ఈ నెల నుంచి బుజ్జాయి ఎడిట్ చేసివ్వండి అని అడిగితే అది శ్రమతో కూడినదని, సన్ టీవీలో పని చేయడంవల్ల టైమ్ కుదరకపోవచ్చని చెప్పాను.అప్పుడాయన ఇప్పుడెలాగూ మీరు నెలనెలా రెండు పేజీలీ రాస్తున్నారు. వచ్చే నెల నుంచి పన్నెండు పేజీలు రాసివ్వండని చెప్తే అలాగేనని ఒప్పుకుని రకరకాల కలంపేర్లతో రాస్తూ వచ్చాను. ఏ నెలకా నెల డబ్బులు ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా మొదటి పేజీలో గాంధీజీ జీవితచరిత్రలోంచి ఓ పేజీ రాయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో అప్పారావుగారితోనే కాదు, వారి కుటుంబంతోనూ సంబంధాలు పెరిగాయి. ఒకానొకప్పుడు ఇరవై ఆరు నెలలు బుజ్జాయి ఆఫీసులో ఆశ్రయం పొందాను.కాలం గడుస్తూ వచ్చింది.సాక్షిలో రిటైరైన తర్వాత నెల నుంచే ఎడిటర్ గా పేరు వేస్తూ వచ్చారు. ఇదిలావుంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఏటా రెండు వందల యాభై కిలోల బియ్యం ఇస్తున్నారు. అందుకే అప్పారావుగారిని అన్నదాత అన్నాను. గత ఏడాది పత్రిక ఆపేసినా ఇప్పటికీ ఆయన కరుణతోనే మా కుటుంబం భోజనం చేస్తోంది. అంటే మ్యాగజైన్ తో సంబంధం లేకుండా ప్రతీ ఏటా బియ్యం ఇస్తున్నారు. నేనేమీ రాయకుండా ఆయన బియ్యం తీసుకోవడం సిగ్గుగానే ఉంది. ఆ మాటే ఆయనతో చెప్పాను కూడా. అయితే ఆయన ఒక్కటే చెప్పారు "నేనున్నంత వరకూ నాకు చేతనైన సాయం చేస్తానని".బుజ్జాయిలో నాకిష్టమైన గీతాంజలి, నెపోలియన్ కథలు, జెన్ కథలు ధారావాహికంగా రాసాను. ఈ మూడు శీర్షికలూ నా ఇష్టంతో రాసినవే. ఆయన వద్దనకుండా వేస్తూ వచ్చారు. ఆపేసిన చివరి ఇష్యూలో పదహారు పేజీలు వివిధ పేర్లతో రాశాను.అప్పారావుగారికి కృతజ్ఞతలు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనో తెలీడం లేదు. ఆయన ముందు నేనొక ఆవగింజనే!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు