కృష్ణగారి గురించీ....--మా మావగారు, పాత్రికేయులు జీ. కృష్ణగారు 2001 ఏప్రిల్ ఆరవ తేదీన తుదిశ్వాస విడిచినప్పుడు పి. లోకేశ్వర్ గారు ఓ పత్రికలో ఆయన గురించి రాసిన మాటలు బాగున్నాయి. వాటిలో ఒకటి రెండు విషయాలు తీసుకున్నానిక్కడ. కాస్తంత మార్చి రాశానంతే. లోకేశ్వర్ గారు ఏమీ అనరనే ధీమాతో.ఆ మాటలు సంగ్రహించాను....... కృష్ణగారు! జగమెరిగిన విలేఖరే కాదు! జగాన్నెరిగిన విలేఖరి!! కృష్ణగారు మద్రాసులో ఓ దినపత్రికలో పని చేస్తున్న రోజులవి. ఓ రోజు సాయంత్రమైంది. ఇంటికెళ్ళే హడావుడిలో ఉన్నారు. ఇంతలో టెలిప్రింట్లో ఫ్లాష్ ఫ్లాష్ అంటూ వరుసగా మెసేజ్ రావటం ప్రారంభమైంది. ఏమిటా మెసేజ్ అని ప్రింటర్ వైపు చూశారు. గాంధీజీ అసాసినేటెడ్ అని మెసేజ్. కృష్ణగారు కొయ్యబారిపోయారు. ఇంతలో మరో మెసేజ్....ది అసాసిన్ ఈజ్ ఎ హిందూ అని.ఈలోగా ఆఫీసు గేట్ దగ్గర కాపలా ఉండే ముస్లిం వాచ్ మన్ ని కొందరు చితకబాదారు. టెలిప్రింటర్ మెసేజ్ లో అసాసిన్ హిందువు అనే పదం లేకుంటే ఎందరి ముస్లింల ప్రాణాలు పోయావో....ఆ వెంటనే కృష్ణగారు పెన్నూ పేపరు పట్టుకుని రోడ్డుమీదికొచ్చారు. కోడంబాక్కం వస్తావాని ఓ ముసలి రిక్షావాలాను కృష్ణగారు పలకరించగా రాను...పెద్దాయన పోయారుగా అంటూ ఆ రిక్షావాలా సంతాపం ప్రకటించాడట.నెహ్రూతో సహా అనేకమంది పెద్దవాళ్ళను ఎన్నో సార్లు రిపోర్టు చేసిన కృష్ణగారు గాంధీజీని మాత్రం రిపోర్ట్ చేయలేకపోయానే అని బాధపడ్డారు. ఆ క్షణంలో కృష్ణగారి తడి మనసులో అదో రకమైన బాధ. అంతలోనే ఆ కళ్ళు మళ్ళీ మెరిసాయి. కారణం గాంధీజీ చితాభస్మం తీసుకేళ్ళిన ప్రత్యేక రైలులో విజయవాడ నుండి కన్యాకుమారిదాకా వెళ్ళే అవకాశం లభించింది. రైలు పెట్టెలో ఆ కలశం పక్కనే నిలుచుని వైష్ణవ జనతో ...అంటూ గొంతుపోయేలా భజనలు చేశారు. ఆ తర్వాత గాంధీజీ ఇద్దరు కొడుకులతో తనకున్న దగ్గరి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.ఇక్కడో విషయం చెప్పుకోవాలనిపించింది. మద్రాసు కోడంబాక్కంలోని పద్మనాభ పిళ్ళయ్ వీధిలో బాలభారతి అనే పేరుతో ఓ పిల్లల మాసపత్రిక ఉండేది. ఆ పత్రికలో పని చేసిన పరిచయంతో కృష్ణగారితో గాంధీజీపై ఓ మూడు నాలుగు పేజీలు రాయించి బాలభారతివారికిచ్చి వేయించాను. కృష్ణగారు తన జీవితంలో రాసిన ఆఖరి వ్యాసం ఆదే. ఆ తర్వాత ఆయన కలం ముట్టలేదు. అప్పటికే ఆయన కుదురుగా రాయలేక పోతున్నారు. అయినా బలవంతంగా రాయించాను. ఆఖరుగా అచ్సయిన ఆ వ్యాసం తాలూకు సంచిక నా దగ్గరలేకోయింది. నా బ్యాడ్ లక్ అది!!ఆయన ఎప్పుడు ఇల్లు అద్దెకు తీసుకున్నా నాలుగ్గదులు ఉండేట్టు చూసుకునేవారు. వాటిలో మూడు గదులు ఆయన తీసుకుని ఒక గది మాకిచ్చేవారు. చాలా సంవత్సరాలు అట్లాగే పక్క పక్క వాటాల్లో ఉండేవాళ్ళం. ఆయన ఏ పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా గుంటూరు లక్ష్మీకాంతంగారు కావ్యకంఠ గణపతి మునిగారిపై నాయన శీర్షికతో రాసిన పుస్తకంలో ఏదో ఒక పేజీలో కొన్ని మాటలు చదివితే తప్ప బయట అడుగువేసేవారు కాదు. కావ్యకంఠ గణపతి మునిగారి కుమార్తె వజ్రేశ్వరిగారు అప్పుడప్పుడూ కృష్ణగారింటికి రావడం నేనెరుగుదును. కావ్యకంఠ గణపతి మునిగారు సాలూరు మండలంలోని శివరాంపురంలో మా తాతగారింటికి వచ్చి భోంచేసినట్లు మా నాన్నగారు చెప్తుండేవారు. మా నాన్నగారు మంత్ర శాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలు గణపతిముని గారి దగ్గరే నేర్చుకున్నారు. కృష్ణగారి నుంచి ఓ ఇరవై సంపుటాల జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషులోది నేను ఆయన నుంచి అడిగే తీసుకున్నాను. వాటిమీద కృష్ణగారు నాకు కట్నకానుకగా ఇచ్చారని నేనే రాసేసుకున్నాను వినయంగా. ఇప్పుడా పుస్తకాలు మా రెండో అన్నయ్య ఆనంద్ ఇంట ఉన్నాయి. ఆ ఇరవై సంపుటాలను ఆరోజుల్లో కృష్ణగారు ఏడు వందల యాభై రూపాయలకు కొన్నట్టు ఓమారు నాతో చెప్పినట్లు గుర్తు. ఆయనను చూసే జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించాను కానీ తగినంత కృషి చేయకపోవడం నా లోపమే....!! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు