ఠాగూర్ ఊహాలోకం- జగదీశ్ యామిజాల -రవీంద్రనాథ్ ఠాగూర్ ఊహాలోకం అనే తమిళ పుస్తకం నాకెంతో ఇష్టం. ఠాగూర్ రచనలలోంచి కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలను తమిళంలోకి కోవేందన్ అనే కవిపండితుడు అనువదించారు. మద్రాసులో అచ్చయ్యింది. ప్రపంచ దేశాల కవులలో ఒకరై మన భారతదేశానికి ఓ గుర్తింపు తెచ్చిపెట్టిన ఠాగూర్ సాహిత్యం అజరామరమైనది. ప్రకృతి, ప్రేమ, జీవితం గురించి ఆయన అభిప్రాయలు అనేకం. వివిధ దేశాలలో పర్యటించి ప్రసంగాలు చేసి బెంగాల్లో శాంతినికేతన్ ని స్థాపించిన ఠాగూర్ మాటలు ఎప్పటికీ ఆణిముత్యాలే.ప్రేమకాన్క, గీతాంజలి, కబీర్ గీతాలు, గోరా, చిత్ర‌, వనమాలి, ఊహలవలయాలు, ఇలా అనేక పుస్తకాలలో తనకిష్టమైన మాటలను ఎంచుకుని తమిళ రచయిత పాఠకలోకానికి అందించారు.నేనీ తమిళ పుస్తకాన్ని 2002 లో మద్రాసులో కొన్నాను. ఈ పుస్తకంలోంచి కొన్నింటిని అనువించి కొన్నేళ్ళయ్యింది. వాటిలోనివే ఈ మాటలు....... 1 నా హృదయం విచారంలో ఉంది. కారణం పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో దానికి తెలియకపోవడమే! 2 నీ ప్రశాంత రూపాన్ని చూస్తున్నాను. నన్ను ఆస్వాదిస్తున్న నీ కనుచూపులపై ఆకస్మికంగా నా దృష్టి పడింది. 3 కళ్ళకు కనురెప్పలలా శ్రమకు సేదదీరడమనేది ఓ హక్కే 4 జాబిల్లీ! వచ్చేసే! కిందకు దిగి వచ్చేసే! నా నుదుట ఓ ముద్దివ్వు! 5 నీ కనుసౌంజ్ఞలతో కవుల సంగీత వాయిద్యాలనుంచి పుట్టే గీతాలు అందరినీ అన్నింటినీ ఆకర్షించవచ్చు. 6 కొమ్మలు పండ్లను ఇస్తున్నాయని భూమి అడుగులో ఉన్న వేళ్ళు ప్రతిఫలాన్ని ఆశించడం లేదు 7 హృదయమా! ప్రశాంతంగా ఉండు. ఏపుగా దట్టంగా ఎదిగిన వృక్షాల ప్రార్థనే ఇది! 8 విముక్తే భగవంతుడు. ఎందుకంటే వెలుగూ అతనే 9 నా జీవనతంత్రులను మీటేటప్పుడు ఓ నాథా! నువ్వు నన్ను స్పర్శించే ప్రతిసారీ ప్రేమగీతం పుట్టుకొస్తోంది! 10 ప్రేమించేటప్పుడు ఆకు పువ్వవుతోంది. ప్రార్థించేటప్పుడు పువ్వు పండవుతోంది. నీ ఆహ్వానాన్ని స్వీకరించి నీ సువిశాల సామ్రాజ్యంలో నేను విహరించాలి 11 నీ దగ్గర నన్ను కోల్పోవడంకన్నా తీరం చేరడం శ్రేష్టమైనదా? 12 ఇంటికి రావలసిందిగా నేను నిన్ను పిలవడంలేదు తీరం కనిపించని ఏకాంతంలో నేను వాడిపోయేటప్పుడు నాతో ఉండు, ప్రేమా!! 13 పరిపూర్ణంగా నిన్ను నువ్వు ఆ భగవంతుడికి అర్పించుకో! అతనిని నీ ఏకైక తోడుగా చేసుకో!! 14 ప్రపంచంలోని విశిష్టమైన వాటిలో నా వంతు నీ ద్వారానే నాకు లభిస్తుందనే విషయం నాకు తెలుసు! 15 నా ప్రియమైన మిత్రుడా! సముద్రతీరాన దాని ఘోషను నేను వింటున్నప్పుడు లోతైన నీ ఉన్నత భావాల ప్రశాంతతను నేను గ్రహించగలుగుతున్నాను


కామెంట్‌లు