గురుజాడవారి "దిద్దుబాటు"-- మన జీవితాలలో కథలకు ఉన్న ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. తెలుగు కథకు ఎప్పుడూ అత్యున్నత స్థానమే ఉండటం విశేషం. ఎందరో కథకులు తెలుగు కథా జగత్తును పరిపుష్టం చేశారని చెప్పు కోవచ్చు. ఈ క్రమంలో గురజాడ అప్పారావుగారు రాసిన ‘దిద్దుబాటు’ కథ అచ్చయి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగు కథానిక శతజయంతి ఉత్సవాలను 2009 ఫిబ్రవరి 7, 8 తేదీల్లో విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. వేదగిరి రాంబాబుగారి సారథ్యంలో పోరంకి దక్షిణామూర్తి, రావి ఎన్. అవధానిగార్ల సహాయసహకారాలతో ఈ సదస్సు దిగ్విజయంగా జరిగింది. కథానిక శతజయంతిని పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు బాలిగారు లోగో రూపొందించారు.తొలి రోజున గురుజాడవారింటి డాబా మీద రచయితలందరూ కలిసి భారీ గ్యాస్ బెలూన్ ని ఎగరేసిన తర్వాత జరిగిన (వారంరోజులయ్యేసరికి ఈ బెలూన్ ని ఎవరో తీసుకుపోయారు) కార్యక్రమంలో రావి ఎన్. అవధానిగారి "దిద్దుబాటు" కథ విశేషాలు వివరించారు. ఈ కథ 1910లో ‘ఆంధ్రభారతి’ ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది. గురజాడ వారు ఈ కథను తొలుత ‘కమలిని’ పేరుతో గ్రాంథిక భాషలో రాశారు. అయితే ఆ తర్వాత దీనిని వ్యావహారిక శైలిలో మార్చి రాసి ‘దిద్దుబాటు’ పేరుతో పంపగా ‘ఆంధ్రభారతి’ లో ముద్రితమైంది. సంఘ సంస్కరణ ఉద్దేశంతో గురజాడ అప్పారావుగారు రాసిన కథే 'దిద్దుబాటు'. అలనాటి సమాజంలో వ్యభిచారం ఓ వృత్తిగా ఉండేది. విద్యావంతులతోపాటు ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వేశ్యల పట్ల వ్యామోహముండేది. అయితే వేశ్యాలోలుడైన తన భర్తకు బుద్ది చెప్పడంకోసం భార్య ఆడిన నాటకమే ఈ కథలోని ప్రధాన ఇతివృత్తం. ఈ కారణంగానే గురజాడవారు తమ కథకు 'దిద్దుబాటు' అని పేరు పెట్టారు. వేశ్యావృత్తి పట్ల తమకున్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ కుటుంబంలో భార్యాభర్తలు సమానమని, విద్యతో స్త్రీలో చైతన్యం తీసుకురావచ్చని గురుజాడవారు ఆనాడే గుర్తించారుఈ కథతోనే తెలుగు కథా ప్రపంచానికి కొత్త బాట పడిందని చెప్పేవారున్నారు. (కానీ, బండారు అచ్చమాంబ గారు రాసిన ‘స్త్రీవిద్య’ ‘ధనత్రయోదశి’ కథలే తొలి కథలని కొందరు తగిన ఆధారాలతో నిరూపించారు.. అచ్చమాంబ కథలు 1902లో ‘హిందూసుందరి’ అనే పత్రికలో అచ్చయ్యాయి.)అప్పారావు గారింట్లో తర్వాత విజయనగరంలోనే మరొక చోట జరిగిన కార్యక్రమంలో కథలు, వాటి స్వరూప స్వభావాలపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. గురుజాడ వంశీయులతోపాటు కొలకలూరి ఇనాక్, వీరాజీ, విహారి, రావూరి భరద్వాజ, అవసరాల రామకృష్ణారావు, కాళీపట్నం రామారావు, జి. బ్రహ్మాజీరావు, తదితరులెందరో ఈ రెండు రోజుల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో వంద మందికి ఇరవై గ్రాముల వెండి డాలర్లు ప్రదానం చేశారు. విజయనగరం సంస్థానంవారు గురుజాడవారికిచ్చిన డాబా ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దానిని అప్పారావుగారి స్మారక మందిరంగా మార్చేశారు. గురజాడ వారు వినియోగించిన వస్తువులను, ఆయన రాసిన పుస్తకాలను, డైరీలను, పెన్నుని ఇక్కడ ప్రదర్శనకుంచారు. ఈ ఇంటికి పక్కనే ఉన్న జాగాలో గురజాడవారు సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకున్నారు. కానీ ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేసే లోపే ఆయన అస్తమించడం విచారకరం.. ఇక విజయనగరంలో ఉన్న విగ్రహాలలో ఒకటి గురజాడవారి స్మారకమందిర ఆవరణలో ఉంది. అది ఆయన కూర్చున్న తీరులో ఉన్న విగ్రహం. విజయనగరంలో జరిగిన సదస్సు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు గురజాడవారి స్మృత్యర్థం వేదగిరి రాంబాబు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. - యామిజాల.జగదీశ్


కామెంట్‌లు