ఇప్పుడు ఎక్కడున్నారో....ఎలా ఉన్నారో....---నేను "సాక్షి" పేపర్లో పని చేస్తున్న రోజులవి. ఆఫీసులో ఉండగానే ఫోన్ వచ్చింది. " హలో ఎవరండీ " అని అడిగాను. అవతలివైపు నుంచి ఓ పల్లవి వినిపించింది. అది బొమ్మరిల్లులో పాటని గ్రహించాను కానీ నాకెందుకు పల్లవి వినిపించారో బోధ పడలేదు. మధ్యలోనే ఆ పల్లవికి అడ్డంపడి "ఎవరండీ" అని అడిగాను.అవతలి నుంచి జవాబు "ఆ పాట రాసింది నేనేనండి" అని. ఆ పాటైతే తెలిసిందికానీ ఆ పాట రాసిన వారెవరో తెలియకపోవడంతో మళ్ళీ నా ప్రశ్న...."మీరెవరండీ" అని. అప్పుడాయన తన పేరు కులశేఖర్ అని అన్నారు. ఆయన రాసిన మరికొన్ని సినిమాల పేర్లు చెప్పి వాటిలోనూ పాటలు రాసినట్లు తెలిపారు. సరేనన్నాను.మళ్ళీ ఆయనే ఓ రెండు వాక్యాలు చదివి ఇవి మీరు రాసినవేనండి అన్నారు. ఆయన వినిపించిన వాక్యాలు ఓ ప్రేమలేఖలోవి. నెల నెలా చదువుతున్నానని చెప్పారు.థాంక్స్ చెప్పాను. అప్పట్లో నేనొక మాసపత్రికలో ప్రేమలేఖలు రాస్తున్నాను. అవి బాగున్నాయన్నారు. అలా మా మధ్య పరిచయం మొదలైందిమళ్ళీ కలుద్దామండి అని ఫోన్ పెట్టేశాను. ఆరోజు రాత్రి నేనింట్లో ఉండగా కులశేఖర్ గారి నుంచి ఫోన్. ఓ రెండు నిముషాలు మాట్లాడవచ్చాని అడిగి అర గంటపైనే మాట్లాడారు. ఆరోజే కాదు, రెండు రోజులకొకసారి ఫోన్ చేసి కవితల గురించి సాహిత్యం గురించీ మాట్లాడటమే కాకుండా ఆశువుగా ఒకటి రెండు కవితలు చెప్పి నన్నూ ఆశువుగా కవితలు చెప్పమనేవారు. "మీలాగే ఆశువుగా చెప్పలేను" అని చెప్పేవాడిని. మా ఇద్దరి మధ్య కనీసం మూడు నాలుగు నెలలపాటు ఫోన్లోనే మాటలు సాగేవి. ఓమారైతే ఫోన్ చేసి "ఉద్యోగం మానేసెయ్యండి. నాతో వస్తే సినిమావాళ్ళకు పరిచయం చేస్తాను. రచయితగా అవకాశాలు ఇప్పిస్తాను" అన్నారు. ఆ మాటతో నా పక్క సీట్లోనే ఉండే మిత్రుడు సింహంభట్ల సుబ్బారావుగారితో చెప్పేసాను "ఉద్యోగం మానేసి కులశేఖర్ తో పాటు తిరగబోతున్నానని" అన్నాను.ఆయన నేను చెప్పిన మాటలన్నీ విని "నెలనెలా ఒకటో తారీఖున జీతం ఇస్తుంటే సినిమాలలో అవకాశాల కోసం ఉద్యోగం మనెస్తాను. వెళ్ళిపోతాను. ఇక ఆఫీసుకి రాను" అని చెప్పడం అనాలోచిత నిర్ణయమని చెప్పి ముందు ఉద్యోగం చేసుకోండి" అని అన్నారు. అప్పుడు ఆలోచనలో పడ్డాను ఉద్యోగం మానెయ్యాలా వద్దాని. చివరికి ఉద్యోగమే కొనసాగిస్తానని సుబ్బారావుగారితో చెప్పాను."మంచిది" అన్నారాయన. కులశేఖర్ గారికి చెప్పేశాను ఉద్యోగం మానబోనని! అందుకు కులశేఖర్ గారు సరేనంటూనే అప్పుడప్పుడూఫోన్ చేసేవారు. కవితల గురించి, సినీ సాహిత్యం గురించి అనేక విషయాలు చెప్పేవారు. కొంతకాలం తర్వాత ఓ ఫోన్ కాల్ వచ్చింది "ఎవరండీ" అడిగాను."నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రామకృష్ణ. కులశేఖర్ గారిఫోన్లో మీ నెంబరే ఎక్కువ సార్లు నమోదవడంతో మీకు ఫోన్ చేస్తున్నానండి" అన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు కులశేఖర్ డబ్బులు ఇవ్వవలసి ఉందని, ఆయన ఎక్కడ ఉంటారో చెప్పండి" అన్నారు. అలాగే ఆయన మరొక నెంబర్ ఇస్తూ ఆయనకు ఫోన్ చేసి కులశేఖర్ అడ్రెస్ కనుక్కో మన్నారు.కానీ ఫలితం లేకపోయిఃది. సినిమా రిపోర్టర్స్ ని అడిగాను. అయితే ఆయన ఎక్కడున్నదీ ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్ కు ఫోన్ చేసి కులశేఖర్ అడ్రెస్ అడిగాను. తెలీదంటూనే ఆయనకు ఆరోగ్యం బాగులేన్నారు. అయినా అప్పటికీ ఇంకొందరిని అడిగారు. కానీ ఎవరూ చెప్పలేదు. చాలా కాలంసంవత్సరాలు గడిచాయి. సినీ పాటల రచయిత అరెస్టు అనే వార్త పేపర్లో చదివి కంగుతిన్నాను. అనేక సినిమాలకు గీత రచన చేసిన కులశేఖర్ 2013 అక్టోబరు 24 న కాకినాడలోని ఓ ఆలయంలో అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకు అరెస్టు చేసి వార్త. విస్తుపోయాను. ఆరునెలల జైలు శిక్ష తర్వాత ఆయన మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోయారని తెలిసింది. ఆ తర్వాత ఆయనను హైదరాబాదులో ఓ చోరీ కేసులో అరెస్టు చేసిపట్లు పోలీసులు తెలిపారు. పూజారులపై ద్వేషంతోనే చోరీకి పాల్పడినట్లు కులశేఖర్ చెప్పారు. ఓ దేవాలయంలో పనిచేస్తున్న పూజారి చేతి సంచిని కులశేఖర్ చోరీ చేసినట్లు పోలీసుల మాట. కులశేఖర్ నుండి పది సెల్ ఫోన్లు, చేతి సంచులు, క్రెడిట్, డెబిట్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కులశేఖర్ అరెస్టు వార్త నన్ను విస్మయపరిచింది. మంచి రచయిత, భావుకత అయిన కులశేఖర్ ని నేరుగా చూడాలని ఉంది. ఓ మంచి రచయిత ఇలా మారడంతో మనస్సు చివుక్కుమంది. ఆయనను ఒక్కసారైనా నేరుగా చూడలని ఉంది.కులశేఖర్ కి ఓ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు