పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగిపోయాయి.ఫలితా లు కూడా వచ్చాయి.ఫలితాలు వచ్చిన కొన్ని గంటలలోనే సమాచారం జిల్లా విద్యాశాఖాధికారివారికి పంపాలి. ఆ కారణంగా మాస్కూలులో ఎంతమంది పాసైందీ ఫోన్ ద్వారా పంపాను జిల్లావిద్యాశాఖాధికారి ఇ. ఆర్. అప్పారావుగారికి. అట్నుంచి ఫోన్లో ఎవరెవరికి ఏ ఏ క్లాసులొచ్చాయో ఆ విద్యార్థుల పేర్లు పెట్టి అడిగారు. నాకు ఏవో ఒకటి రెండు పేర్లు మినహా మిగిలిన విద్యార్థుల పేర్లు జ్ఞాపకం లేదు. నాకు సర్వీసు ప్రారంభం నుండి అంటే టెక్కలి గరల్స్ హైస్కూలు లో పనిచేసినప్పటి నుండీ ఒక అలవాటు ఉంది. క్లాసులో 40, 50 మంది విద్యార్థులున్నా "మీ నాన్నగారు ఏం పని చేస్తుం టారు,అమ్మగారు ఏం చేస్తుంటారు" లాంటి ప్రశ్నలు వేసేవాడిని కాదు. వాళ్లతో అవసరం లేని కబుర్లు కాలక్షేపా నికి మాట్లాడటం అలవాటుగా ఉండేది కాదు. వాళ్ళ అమ్మ, నాన్న ఏం పనిచేస్తే మనకెందుకు ? అలా తెలుసుకోవడం వలన మనం అందరి పిల్లలను క్లాసులో సరిసమానంగా చూడలేం అన్న భావం నాలో ఉండేది. ఆ రోజుల్లో అందరూ సాధారణ స్కూళ్ళలోనే చదివేవారు. కార్పొరేట్ స్కూళ్ళు ఉండేవి కాదు. డబ్బున్నవాళ్ళకీ, డబ్బు లేని నిరుపేదలకు ఒకటే స్కూల్. ఫలానావారు ఎం. ఎల్. ఏ గారి అబ్బాయి, ఆర్డీవో గారి అమ్మాయి, ఇంజనీర్ గారి అమ్మాయి అని ఇలా పిల్లల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడం నాకిష్టముండేదికాదు. అలానే నేను గరల్స్ హైస్కూలులో పనిచేసేటప్పుడు అసైన్ మెంట్స్, పేపర్ వేల్యూషన్, కాంపోజిషన్ వర్క్ చేసేటప్పుడు టీచర్ టేబుల్ చుట్టూ విద్యార్థులను చేరనిచ్చేవాడనుకాదు. దాని వలన క్లాసులో ఇన్-డిసిప్లైన్ క్రియేట్ చేసినట్టవుతుంది. విద్యార్థుల పుస్తకాలన్నీ సి.పి.ఎల్ చే కలెక్ట్ చేయించి లీజర్ పీరియడ్లలో వేల్యూ చేసేవాడను.అలానే విద్యార్ధి చేసిన తప్పులు తెలియజెప్పడానికి ఒక్కొక్కరినీ పిలచేవాడను.అయినా అందరి పేర్లు జ్ఞాపకం ఉండేవికాదు. అయితే క్లాస్ లో బాగా తెలివిగా ఉన్న విద్యార్థులు, బాగా మొద్దుగా ఉన్న విద్యార్థులు మాత్రమే జ్ఞాపకం ఉండేవారు. అలా మిగిలిన విద్యార్థుల పేర్లు అసలు జ్ఞాపకం ఉండేవికాదు. డి .ఇ. వో అప్పారావుగారు మా స్కూలుకు ఫిబ్రవరిలో వచ్చారు. ఒక్కసారి ఎవరెవరు పాసవ్వడానికి వీలుందో మైండ్ లో పెట్టుకున్నారేమో ! పేర్లతోసహా. ఫలానా విద్యార్థి అంటూ పేరుపెట్టి పాసయ్యాడా ? అతడు ఏ శ్రేణిలో పాసయ్యాడు అని అడిగారు. అతను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాను.అలా అడిగిన వెంటనే చెప్పలేకపోయినందుకు సిగ్గు పడ్డాను. జిల్లాలో ఎన్నో స్కూళ్లు ఉంటాయి. అతను అన్ని స్కూళ్లలోగల విద్యార్థుల పేర్లు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారో అనే సందిగ్ధంలో పడ్డాను. లేకపోతే అతని డైరీలో ఆ విద్యార్థులపేర్లు నోట్ చేసుకున్నారా అనే సంశయం నాలో ఏర్పడింది.చివరకు నా దగ్గర ఉన్న నామినల్ రోల్స్ లో నున్న ఇన్ఫర్మేషన్ తో ఎవరెవరు ఏ క్లాసులో పాసయ్యారో తెలియ జెప్పాను. ఏదేమైనా ప్రధానోపాధ్యాయుడు రడీమేడ్ ఇన్ఫర్మేషన్ తో తప్పనిసరిగా ఉండాలి అనుకున్నాను.ఇక్కడ రెడీమేడ్ ఇనఫర్మేషన్ అంటే పాఠశాల ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం, పాఠశాల విస్తీర్ణం, సర్వే‌‌, రిజిస్ట్రేషన్ నెంబర్లు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య గరల్స్, బోయస్ (ఎస్ .సి; ఎస్టీ; బీ.సీ, ఓ.సీలతో వివరణ ) ; పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ( ఎస్ .సి; ఎస్టీ; బీ.సీ, ఓ.సీలతో వివరణ ), పాఠశాల ప్లాన్; పాఠశాలకు ఉన్నగదులు ; కావలసిన ఇతర భౌతిక వనరులు; గత సంవత్స రం పదవ తరగతి పరీక్షా ఫలితాల వివరాలు, ఇంకా పాఠశాలలకు కావలసిన ఇతర అవసరాలు ఒక హేండ్ బుక్ లో వ్రాసుకుని తన దగ్గరే నిరంతరం హెడ్మాష్టరుగా ఉంచు కోవాలి. ఏ అఫీయల్ వచ్చినా సమాచారం ఇవ్వడానికి తడుముకో కూడదు. ప్రతీ విషయానికి గుమస్తా మీద ఆధారపడకూడదు. హెడ్మాష్టరు అంటే ఆ సంస్థకు అధికారే కాదు. అటెండరు, గుమస్తా, టీచర్ ల పని చేయడానికి సర్వసన్నద్ధుడై ఉండాలి. ఒకరి మీద ఆధారపడి నిరంతరంజరగవలసిన పనులకు తనే ఆటంకం కల్పించుకో కూడదు. ( సశేషం ) -శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్: 7013660252.


కామెంట్‌లు