5. ఉపాధ్యాయ శిక్షణా కాలం మొదటి సంవత్సరం--1969 ఆగష్ట్ నెలలో పార్వతీపురం గవర్నమెంట్ బేసిక్ ట్రయినింగ్ స్కూల్ లో ఉపాధ్యాయ విద్యార్ధిగా ప్రవేశించాను.నాన్న గారు వచ్చి ఫీజు కట్టేరు.ఆ రోజు నుంచి అక్కడే బస. అపుడెపుడో బ్రిటిష్ వారి టైం లో అక్కడ జైలు నిర్వహించే వారట! మాలో మొదటి 25 మందికి ఒక పెద్ద హాలు కేటాయించారు.ఆ హాలుకి తలుపుగా 7 ఊచలుండే పెద్ద చట్రం అమర్చి ఉంది. మంచాలు లేవు పరుపులు లేవు.ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన చాప పరచి దానిపైబొంత వేసుకొంటే అదే మాకు పరుపు. ఆ రాత్రి భోజనాలయ్యాక మేమంతా మాటా మంతీ ఆడుకుంటున్నాం.మాటల్లో మాహాలుకెదురుగా ఉన్న నుయ్యి ప్రస్తావన వచ్చింది. దాని నానించి కనిపిస్తున్న ఎత్తయిన దిమ్మ మీదనే ఉరి శిక్ష పడిన నేరస్తులకు ఆ రోజుల్లో ఉరి తీసే వారట. కొత్త ప్రాంతం.ఒక్కసారి భయం వేసింది. అంతలో సీనియర్స్ ఇద్దరు వచ్చి మా అటెండన్స్ తీసుకోడంతో ఆ ప్రస్తావన ఆగింది. రాత్రి ఎవరూ బయటకు వెళ్ళరాదని చెప్పారు.అలా వెళ్ళిన వారు శిక్షార్హులవుతారన్నారు. మా సీనియర్లు 50 మంది వేరే గదుల్లో ఉన్నారు.లైట్ ఉంటుండగానేనిద్రలోకి అందరం జారుకున్నాం. నిద్రమత్తులో ఉన్న మాకు గంట గణగణమని వినిపించింది. తుళ్ళిపడి అందరం లేచాం.బయటకు చూశాం.ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. "ప్రేయర్ బెల్ అది . హెడ్మాష్టారు వచ్చేస్తారు.కాలకృత్యాలు తీర్చుకొని ప్రేయర్ హాల్ కి వచ్చే యండి."సీనియర్లువచ్చి చెప్పారు.అరగంటలో సిద్ధమై ప్రేయర్ హాల్ కి చేరుకున్నాం.అప్పటికే మా ప్రధానోపాధ్యాయులు శ్రీ సి.ఎల్ .నరసింగరావు గారు వచ్చి ఉన్నారు. సీనియర్లు 50 మంది జూనియర్లు 50 మందిమి మొత్తం 100 మందిమి హాల్లో కూర్చున్నాం.ప్రేయర్ ఆరంభమయింది. సర్వమతాలకు సంబంధించిన శ్లోకాలు, పాటలు పాడించారు.సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే గళమెత్తి ఓం నమో భగవతే వాసుదేవాయ అనిపాడుతూ మాచే కూడా పాడించడం మరపురాని అనుభూతి.రఘుపతి రాఘవ రాజారాం పాట తప్పనిసరి పాడించేవారు. ప్రార్థనయ్యాక స్థానికంగా ఉన్న వారు స్నానానికి ,కడుపులో ఇంత వేసుకోడానికి ఇళ్ళకు వెళ్ళీ వచ్చే వారం. ఉదయం8గం.నుంచి12గం.వరకు మధ్యాహ్నం 2గం.నుంచి 5 వరకు క్లాసులు. .ఇంగ్లీష్, తెలుగు, హిందీ వాచకాలతో పాటు తెలుగు, ఇంగ్లీష్ బోధనా పద్ధతులు ,సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం బోధనా పద్ధతులు వీటన్నిటితో పాటు పిల్లల మనో విజ్ఞాన శాస్త్రం, పాఠశాల నిర్వహణా పద్ధతులు ఆ యా టీచర్లు వచ్చి బోధించేవారు. ట్రయినింగ్ స్కూల్ కి అనుసంధానం గా ఒక మోడల్ స్కూల్ ఉండేది.అపుడపుడు మేం వెళ్ళి తరగతులు నిర్వహించే వాళ్ళం.విద్యార్ధుల మనస్తత్వం ,వారికి పాటలు కథల మీదుండేశ్రద్ధను దగ్గరుండి గమనించే అవకాశం కలిగింది. బోధనే కాకుండా సఫాయి వర్క్,వంటపని,మజ్జిగ చిలికి వెన్న తీయడం, వడ్డించడం ,సాంస్కృతిక కార్యక్రమాలు నడిపించడం,తోటపని ఇలాంటివి బేచ్ వర్క్స్ గా వేసి మాచే చేయించేవారు.సాయంత్రం ఒక రెండు గంటలు ఆటవిడుపుగ మాకు వదిలేవారు.కొందరు ఎదురుగా ఉండే హైస్కూల్ ప్లే గ్రౌండ్ కివెళ్లి ఆటలాడేవారు.నేను బెలగాం లో ఉండే గ్రంథాలయానికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో మా ఊరి రచయిత పంతులు జోగారావు గారి సీరియల్ కృష్ణా పత్రికలో వస్తుండేది.అది చదివే వాడిని. న్యూస్ పేపర్లు వార పత్రికలు ఒకసారి తిరగేసి హాస్టల్ కి వచ్చేసే వాణ్ణి. ఇంటి వైపు కూడా ఒకొక్క సారి సాయంత్రం వెళ్ళే వాణ్ణి.హాస్టల్లో 8గం.లోపు భోజనాలయి పోతుండేవి.8గం.నుంచి 10గం.వరకు స్టడీ అవర్స్. ఆ సమయంలో సీనియర్లు అపుడపుడు పర్యవేక్షణ చేసే వారు.చదవని వారి నెంబర్లుహాలులో లేని వారి నెంబర్లు ప్రధానోపాధ్యాయులకు అందజేసేవారు.ఆ భయం వల్ల సాయంత్రం బయటకు వెళ్ళేవారు రాత్రి భోజనాల వేళకు వచ్చేసేవారు.మహాత్మాగాంధీ శత జయంతి వేడుకల సందర్భంగా మా ఉపాధ్యాయ బృందం మా ఉపాధ్యాయ విద్యార్థులు కలిసి మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్ఠ చేశాం.అదొక మరపురాని అనుభూతి. అటు ఎప్పుడు వెళ్లినా మేము ప్రతిష్ఠించే బొమ్మను చూడగానే ఆ క్షణాలు గుర్తుకొస్తాయి. రోజులు గడుస్తున్నాయి.తరగతులు జరుగుతున్నాయి. బయట పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు పరిశీలన చేయడానికి కొన్ని రోజులు పంపేరు. పాఠశాల పనిపాట్లు ,బోధనా పద్ధతులు ఎలా జరుగుతుండేవో ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం కలగింది అంతలో వేసవి సెలవులు. ఇళ్ళకు వచ్చేశాం. ఆ వేసవిలో నాకు టైఫాయిడ్ జ్వరం. డాక్టర్ గారు మందులిచ్చి బాగా రెస్ట్ తీసుకోమన్నారు.జ్వరం తగ్గింది.ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకున్నాను. వేసవిసెలవులయిపోయాయి. ట్రయినింగ్ స్కూలుకుబయలుదేరాను. స్కూలులో కొన్ని రోజులు తరగతులు చెప్పాక మాకు టీచింగ్ ప్రాక్టీస్ కి వేశారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం,సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠాలు నలబై చొప్పున చెప్పాలి.అదీ బయట పాఠశాలలకు వెళ్ళి!సగం పాఠాలయ్యాయి.అంతలో అందరినీ దిగ్భ్రాంతి పరిచే ప్రభుత్వ ఉత్తర్వులు ట్రయినింగ్ స్కూల్ కి వచ్చాయి.(సశేషం)- బెలగాం భీమేశ్వరరావు పార్వతీపురం 9989537835
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి