మానేరు ముచ్చట్లు- మాకు తెల్లవారబోతూందని కోడికూతతో కన్నా పెద్ద మసీదు లే ఆజాయే తెలిపేది.అజాయే ఊరంతటికీ అలారం.సరిగ్గా ఉదయం 5గంటలకుపెద్ద మసీదు ముఖద్వారము నానుకుని ఉన్న మెట్లేక్కి రాగయుక్తంగా పాడే ఆ మేలుకొలుపు శ్రవణానందకరంగా ఉండేవి.కొండెకచో సామగానచ్ఛాయలు వినబడేవి.అవి గుండెలలోనుండి వచ్చే పిలుపులు.ఏ భాషైనై ఏ మతమైనా అందరికీ ఒక్కడే అయిన పరమాత్ముని పలుకరింపులవి.’అల్లాహో అక్బర్.లా ఇలాగుంటుంద ఇల్లల్లా’అంటూ గొంతెత్తి పాడేవారు ఎవరో కాని కంఠంలో శ్రావ్యత,పిలుపులో ఆర్ద్రత వినిపించేవి. మా తాత అజాతో లేచి తన కార్యాచరణ మొదలు పెట్టేవారు.అజా అయింది. లే . లేచి చదువుకో’ఇవీ మాకు తెల్లారగానే వినిపించే సుప్రభాత సువాక్కులు. దాదాపు ఆరువందల సంవత్సరాలు మహమ్మదీయ పరిపాలకుల ఏలుబడి లో ఉన్న ఊరు కదా!హిందూ సంస్కృతి తో పాటు మహమ్మదీయ సంస్కృతి కూడా సమాంతరంగా విస్తరిల్లిన ఊరు.నేను చదువుకునే రోజుల్లో నా సహాధ్యాయులైన ముస్లిం మిత్రుల పేర్లు నాకింకా జ్ఞాపకం.షేరలీ,సత్తార్,వజీర్, గఫార్,ఇబ్రాహిం,ముజీబ్ ఇంకా ఒకరిద్దరు పేర్లు గుర్తుకు రావడం లేదు.ఇప్పుడు వాళ్లంతా ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియదు.రెండేండ్ల క్రితం కరీంనగర్ రైతు బజార్లో షేకలీ కలిసాడు.నేనే గుర్తు పట్టి పలుకరిస్తే పరమ సంతోషపడి పోయాడు.వాళ్ల ఇళ్లన్నీ దాదాపుగా వాడకు కొన్ని అన్నట్లుగా ఉండేవి.మేము రోజు బడికి వెళ్లే దారిలో పెద్ద గవనికి దగ్గరలో ఎక్కువగా ముస్లిముల ఇళ్లుండేవి.పిల్లలు తెలిసినంతగా పెద్దవాళ్లు నాకు తెలియదు గాని బాపుకు మాత్రం చాలా మంది తెలిసిన వాళ్లు,మిత్రులుండేవారు.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు