అసమానతలపై అక్షర సమరం --అక్షర సమరాలే అతని సాహిత్యం...వ్యవస్థలోని సమస్యలపై పోరాడే శరమే అతని కలం....తేలికైన తేట తెనుగు పదాలతో జాలువారిన కూనలమ్మలు...అలతి అలతి పదాలతో అబ్బుర పరచే నానీలు, నానోలు , మొగ్గలు.... అనేక ప్రక్రియల సముదాయమే ఈ "అక్షర సమరం" సంపుటి. ప్రముఖ కవి, రచయిత,మిమిక్రి కళాకారుడు , ఉపాధ్యాయుడు కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం చే రచింపబడినది. వీరు సాహితీ సేవే కాకుండా సామాజిక సేవలు కూడా చేస్తున్నారు. వీరి ఇతర రచనలు బాల కిరణాలు ,మనో కెరటాలు....సాహిత్యపరంగా వీరు అనేక బిరుదులను , అనేక పురస్కారాలను పొందారు. వృత్తి పరంగా కూడా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. "అక్షర సమరం" లోని ప్రతి కవిత తేలిగ్గా సామాన్యులక్కూడా అర్ధమయ్యేలా ఉంది. ఇందులో మొత్తం 51 కవితలున్నాయి. అన్నీ సామాజిక అంశాలే....సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అక్షరాలతో సమరమే చేసినట్లుగా పాఠకులు అనుభూతి చెందేలా ఉన్నాయి....ప్రతి కవితకు చిత్రాలు కూడా జత చేసి సంపుటికి మరింత శోభను చేకూర్చారు.... విత్తం లేక విత్తనం లేక సారం లేక సాగుబడి లేక //....' రైతు కథ' కవితలో....రైతుల వ్యధలను చక్కగా వివరిస్తూ రేపటి తరం అనగనగా ఒక రైతు అని చెప్పుకునేలా ప్రస్తుతం రైతు పరిస్థితి ఉందని అన్నారు.... //అప్పుడప్పుడు నా అక్షరాలు కదిలే గోదారిలా పరవళ్ళు తొక్కుతుంటాయి//...'అక్షర సమరం' కవితలో.... తన అక్షరాలు గోదావరిలా , నిప్పుల కొలిమిలా, పిల్లతెమ్మెరలా , కెరటంలా సమాజ శ్రేయస్సుకోసం ఎప్పుడూ సమరం చేస్తుంటాయనడం చాలా బాగుంది. //శవాలు కూడా కప్పుకుంటాయి శాలువాలు పార్ధీవ దేహాలు కూడా వేసుకుంటాయి పూలమాలలు //...'ఇదేనా నీ కలం' కవితలో....కవి కలం ఎప్పుడూ సమాజ శ్రేయస్సుకోసమే అక్షరాలు కురిపించాలని....సన్మానాల కోసం , పురస్కారాల కోసం , రాజకీయ భజనల కోసం వద్దని....ఇకనైనా నిజాయితీగా రాయమని కవులకు చేస్తున్న హెచ్చరికలు హర్షించతగినవే.... //ప్లాట్లు కోసం నన్ను నరికి నీవు పడుతున్న పాట్లు చూసి నాకు కన్నీరొస్తుంది// 'చెట్టు వేదన' కవితలో.... మనిషి అత్యాశకు పోతూ చెట్లను నరికి వేస్తూ తన ఆయుష్షునే తగ్గించుకుంటున్నాడని ఇకనైనా చెట్ల విలువ తెలుసుకోమని మంచి సందేశం ఇచ్చారు....'కలం పోరాటం' కవితలో....శ్రీశ్రీ, దాశరథి, గురజాడ, యోగి వేమన , రాయప్రోలు , చిలకమర్తి , దేవులపల్లి, ఆరుద్ర మొదలైన కవులు సమాజహితం కోసం తమ కలాలతో ఎలా పోరాడారో వివరించిన తీరు చాలా బాగుంది.... //అమ్మంటే ఒక కోవెల ఒక ఊయల ఒక వెన్నెల అమ్మంటే ఒక తేజస్సు ఒక ఉషస్సు ఒక యశస్సు// 'అమ్మ' కవితలో.....అమ్మ గురించి అమృతం లాంటి పదాలు రాశారు... 'నేటి చదువులా' మరియు 'గర్భ శోకం' కవితలలో .....నేడు కార్పోరేట్ స్కూళ్లు మరియు కార్పోరేట్ కళాశాలల్లోని విద్యావ్యవస్థ గురించి..దానికి బలై పోతున్న విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రుల గర్భశోకం గురించి చాలా హృద్యంగా రాశారు.... 'విజయ బావుటా' కవితలో ఆవేశంగా రాసిన వాక్యాలు చదువుతుంటే ఈ కవిలో మనం మరో శ్రీశ్రీ ని చూస్తాము....స్వచ్ఛమైన సమాజం కోసం ప్రతి అక్షరంలో ఆరాటం మనకు కనిపిస్తుంది. 'శోకిస్తోంది...భారత్' కవితలో....నోటు కోసం ఓటును , తాగుడు కోసం పుస్తెలను , పదవుల కోసం ప్రజాస్వామ్యాన్ని, అధికారం కోసం ఆత్మాభిమానాన్ని , స్వార్థం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటున్న మనుషులను చూసి తనను కూడా పక్క దేశానికి అమ్మేస్తారేమోనని భారత దేశం శోకిస్తోందని రాసిన వాక్యాలన్ని పాఠకులను ఆలోచింపచేస్తాయి.... ఇందులోని ప్రతి కవితలోను మంచి సందేశాలను ఇచ్చారు. నవ సమాజ నిర్మాణానికి తన వంతు కృషిగా కవి రాసిన కవితలన్నీ అక్షర సమరాలే అని నిజాయితీగా మనం ఒప్పుకోవాలి...అనేక ప్రక్రియలతో ఇలా కదంబంలా ఒకే సంపుటిగా కాకుండా ఒకే ప్రక్రియలో ఉంటే ఇంకా మరింత అద్భుతంగా ఉండేదని అనిపిస్తుంది....ఒక "సందేశాల సమాహారం" లాంటి పుస్తకాన్ని పాఠకులకు అందించిన 'కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం' కు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. సమీక్షకురాలు -శ్రీమతి శాంతి కృష్ణ.- 9502236670.


కామెంట్‌లు