6. ఉపాధ్యాయ శిక్షణా కాలం రెండవ సంవత్సరం---ఒక వారం రోజుల గడువులోగా పార్వతీపురం లో ఉన్న 50 మంది ఉపాధ్యాయ విద్యార్థులు వమరవల్లి లో ఉన్న ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలకు వెళ్ళాలని అక్కడే మిగిలిన శిక్షణా కాలం పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం. మా లాగే పలాస ట్రయినింగ్ స్కూల్ కి కూడా ఆదేశాలు వెళ్ళాయి. వమరవల్లి ఉపాధ్యాయ శిక్షణా పాఠశాల త్రివేణీ సంగమంగా మారుతోందన్న మాట.150 మంది ఉపాధ్యాయ విద్యార్థులతో అక్కడి పాఠశాలను నడపబోతున్నారు.మరొక విషయం మాకు తెలిసింది. 1969-71బేచ్ తరువాత కొత్త బేచీని తియ్యరట.మా బేచీ అదృష్టవంతులమే. హైస్కూల్ లో మా జూనియర్స్ కి 6 సం.ల తరువాత గాని ట్రయినింగ్ కి దరఖాస్తు చేసుకొనే అవకాశం రాలేదు. ఇంట్లో వమరవల్లి బదిలీ విషయం చెప్పేసరికి అవాక్కయ్యారు. ఊర్లో ట్రయినింగ్ నల్లేరు మీద బండిలా సాగిపోయేది. ప్రభుత్వం వారిచ్చే స్టయిఫండ్ రు35 లు మెస్ బిల్ కిసరిపోయేది.ఒకొక్కసారి ఐదో ఆరో తిరిగి వచ్చేది.అది జేబుఖర్చుకు ఉంచుకోమని నాన్నగారు అనే వారు.ఆ పైన ఇద్దరన్నయ్యలు అపుడపుడు డబ్బులిచ్చేవారు.నా జేబు ఖర్చంటే మరేమీ కాదు.నోట్ బుక్స్ కొనడం,అపుడపుడు సినిమాకి వెళ్ళడం.అంతే. వమరవల్లి వేళ్తే ఇప్పుడులా కుదరదు. బస్ చార్జీలుంటాయి.సెలవులిచ్చేటప్పుడు రాకపోకలుంటాయి.ఆ పైన అక్కడ మెస్ తీరు ఎలా ఉంటుందో. నాన్న గారి ఆలోచన అది. పండావీధి వేమకోటి వారి వీధి పక్క పక్క వీధులు. పండా వీధి నుంచి నేను, ఆర్విరమణమూర్తి... వేమకోటి వారి వీధి నుంచి బెహరా, బెహరా చంద్రశేఖరరావు,బెలగాం నరసింగరావు వమరవల్లి కి బయలుదేరాం. మేము అక్కడికి చేరేసరికి రాత్రయింది.మాకు కేటాయిం చిన గదుల్లోకి చేరుకున్నాం. ఎలక్ట్రికల్ కనెక్షన్ స్కూల్ కి లేదు. ఎవరో వెలిగించిన దీపం వెలుగులో ఆ రాత్రిగడిపామర్నాడు ఉదయం పేరుకే తరగతులు. పార్వతీపురం నుంచి పలాస నుంచి విద్యార్థులు వస్తూనే ఉన్నారు.మధ్యాహ్నం తరగతులు పెట్టలేదు.సాయంత్రం నాలుగు తరువాత కళింగపట్నం బయలుదేరాం.వమరవల్లి ఊరికి ట్రయినింగ్ స్కూల్ కి అసలు సంబంధమే లేదు.రెండు మైళ్ళ దూరం లో ఆ ఊరుంది.అంత కంటే దగ్గరలో కళింగ పట్టణం ఉంది. ఆ ఊరు దాటితే సముద్రమట.అలాగే ట్రయినింగ్ స్కూల్ నుంచి వంశధార నది కూడా దగ్గరేనట. శ్రీకాకుళం నుంచి వమరవల్లి ట్రయినింగ్ స్కూల్ కి వచ్చే బస్సు రూట్ లోనే సాలిహుండం ఉందట.అది బౌద్ధ పర్యాటక కేంద్రం. ఇంకా ఆప్రాంతంలో అరసవల్లి, శ్రీకూర్మాం,శ్రీముఖలింగం పుణ్య క్షేత్రాలు చూడవలసినవి ఉన్నాయట!. ఈ ప్రదేశాలన్నీ అప్పుడప్పుడు ఇక్కడున్నప్పుడే చూడొచ్చనుకున్నాం. మాటల్లో కళింగపట్టణంవచ్చింది. ఒక కేంటిన్ లో పావలా ఇస్తే చిన్న ప్లేట్లో పకోడీ ఇచ్చారు. అందరం కొనుక్కొని తిన్నాం.కేంటిన్ నుంచి మేమంతా సముద్రానికి వెళ్ళే దారిన పడ్డాం.10 ని.లలో చేరుకున్నాం. అదే మొదటి సారి జీవితంల సముద్రం చూడడం! ఆశ్చర్యపోతూ నిలబడి పోయాను.పాదాల మీద ఏవో పాకురుతుంటే తుళ్ళిపడి కిందకు చూశాను. ఎర్రటి పురుగులు, పాకురుతున్న రకరకాల నత్తగుల్లలు కనిపించాయి.అంతలో ఒక కెరటం పెద్ద ధ్వనిచేస్తూ విరిగి పడింది. అది అలా అలా చిన్నఅలలా మారుతూ నా పాదాల మీదకు వచ్చింది.మధురానుభూతి.మొదటిగా చూడడానికి వచ్చాను కదా.పలకరింపేమో అనుకున్నాను.నడిచాం.పరుగెత్తాం.పిచ్చుక గూళ్ళు కట్టేం.ఆ ఇసుక పర్రల మీద నడక కూడా ఆనందాన్ని చ్చింది.లయ బద్ధంగా వినిపిస్తున్నఅలల హోరు, బోట్లు లో ఒడ్డుకు చేరుతున్న జాలర్లు, వాళ్ళు తెచ్చే రకరకాల చేపలు,కావడి కట్టి మోసుకుపోతున్న మనిషంత ఎత్తు చేపలు,ఇంకా పెద్ద పెద్ద తాబేళ్లు ...జలనిధి సౌందర్యమంతా అక్కడ చూశాం.ముందు ముందు నేను రాయబోయే కవితలకు కావలసిన మాధుర్యాన్ని నా మనసులో భద్రపరచుకున్నాను. అంతలో చీకటి పడింది. స్కూలుకు తిరిగి వచ్చే టప్పుడు తలా ఒక కిరసనాయిలు లైట్ నుకొనుక్కున్నాం. కొత్త ట్రయినింగ్ స్కూల్ లోమేము సర్దుబాటు కాడానికి వారం రోజులు పట్టింది. వంశధార నదిని కూడా చూశాం.స్నానం చేశాం.వీలయ్యేటప్పుడల్లా సముద్రం చూడడానికివెళ్ళేవాళ్ళం. పార్వతీపురం లో మిగిలి పోయిన టీచింగ్ ప్రాక్టీస్ పాఠాలు అక్కడ దగ్గర ఊళ్ళ పాఠశాలలకు వెళ్లి పూర్తి చేశాం.నేను కవితలు రాయడం మాకు హిందీ చెబుతున్న పి.రామారావు మాష్టారు గారికి తెలిసింది.ఆయనకు తెలుగు సాహిత్యమంటే ఇష్టం. కవితలు ఒకసారిచూస్తాను.తీసుకురా అని ఒకరోజు అన్నారు.కవితలు చూపించాను. చూశారు.సలహాలిచ్చారు.తెలుగు సాహిత్యం లో చదవ వలసిన పుస్తకాలు గురించి కవిత్వం గురించి చెప్పారు. ఆగష్టు 15 సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో నా వ్యాసానికి రెండవ బహుమతి వచ్చింది. నా ఆలోచనలతో రాసే అక్షరాలకు బహుమతి రావడం నాకు ఆనందదాయకమయింది. ఆ ప్రోత్సాహంతో ఏవేవో ఊహలు అల్లుతుండేవాడిని.మిత్రులు కొంతమంది కవీ కవీ అని సరదాకి పిలిచేవారు. వెలుగు నీడలు సినిమా గుర్తుకొచ్చింది. నవ్వుకున్నాను. ఒకరిద్దరు నన్ను నా కవిత్వాన్ని కేళి చేసేవారు.నేను బాధపడ్డాను. మిత్రులు కొందరు నువ్వెక్కడ రాణిస్తావేమో అని వాళ్ళకు భయం.నువ్వు ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్ళు అని వెన్ను తట్టారు. రచనారంగం లో కృషి చేసి నిలబడాలనే దృఢంగా నిర్ణయించు కున్నానప్పుడు. అంతలో సీనియర్స్ పరీక్షా ఫలితాలువచ్చాయి.సగం మంది పరీక్ష తప్పా రట.ఒక్కసారి అందరం త్రుళ్ళి పడ్డాం.షికార్లు, బాతాకానీలు అన్నీ బంద్. తరగతి పుస్తకాలు పట్టుకొని పొలాల లోను అరటి తోటల్లోను సాయంత్రాలు గడప సాగాం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి.ఒక వైపు పరీక్షల టెన్షన్. మరో వైపు విడిపోబోతున్నామనే బాధ.ఆటోగ్రాఫ్ ల సందడి ప్రారంభమయింది.నన్ను చాలా మంది కవీ అని సంబోధిస్తూ ప్రేమతో ప్రోత్సాహ పలుకులురాయడం నాకింకా గుర్తే.అప్పటి వారి అభినందనలే నన్ను రచయిత గా నిలబెట్టాయేమో.ఒక మిత్రుడు చిలుకలపల్లి వెంకట రావు ఆ చంద్రార్కం కవిగా కీర్తి ప్రతిష్టలు పొందు అని అతిశయోక్తి తో ఆటోగ్రాఫ్ లో రాయడం నేనెప్పటికీ మరచిపోలేను. అప్పటి మిత్రులందరకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న పరీక్షలు ఏప్రిల్ నెలలో ముగిశాయి. ఒకరి నొకరు వదల లేక భారంగా ఇళ్ళకు తిరుగుముఖం పట్టేం.అప్పటి మిత్రులు కొంత మంది ఇప్పటికీ తారస పడ లేదు.(సశేషం)- బెలగాం భీమేశ్వరరావు 9989537835


కామెంట్‌లు