మయూర సూర్య శతకం:- ఆరోగ్యం కావాలనుకునే వారికి సూర్యుడే గతి. సూర్యనమస్కారాలు చేస్తూ పండిన వయస్సులోకూడా శారీరక పటుత్వం కలిగిన వారున్నారు. సంస్కృతంలో సూర్యశతక కర్త మయూరుడు. ఆయన బాణుడి సమకాలికుడు. మయూరుడు ఉజ్జయిని ఆస్థాన పండితుడు. మయూరుడు క్రీ.శ. 7వ శతాబ్ది పూర్వార్థానికి చెందినవాడు.ఓరోజు పొద్దున్నే అగస్త్యుడు వృద్ధ బ్రాహ్మణ వేషధారియై మయూరుడి ఇంటికి వస్తాడు. ఆప్పటికే కుష్టురోగంతో బాధపడుతున్న మయూరుడిని అగస్త్యుడు సమీపిస్తాడు. మయూరుడి శిరస్సుపై చేయి ఉంచి ఆదిత్య హృదయం ఉపదేశించిన మరుక్షణమే వచ్చిన దారిన వెళ్ళిపోతాడు. అప్పుడే మయూరుడి కర్మ పరిపక్వమ వుతుంది. మయూరుడు రోగవిముక్తుడవుతాడు. అప్పుడు ఆత్మ ప్రేరణతో సూర్య శతకం రాస్తాడు. సూర్య కిరణ ప్రసార వర్ణనతో ఆరంభించి 19 శ్లోకాలలో సమగ్రంగా వర్ణిస్తాడు. ఆ తర్వాత 43 శ్లోకాలవరకూ ద్యుతి వర్ణన, 49వ శ్లోకం వరకూ వాహన చిత్రణ, 61 వ శ్లోకం వరకూ సారధి ప్రశంస, 72 వ శ్లోకం వరకూ రథానికి సంబంధించి, 82వ శ్లోకం వరకూ మండు శోభ, అటుపై 100వ శ్లోకం వరకూ సూర్యస్తుతి. ఇదీ ఈ సూర్యశతక పద్ధతి. సూర్యుడు జగత్త్రయ సంసారాన్ని ఎలా పాలించుకునేదీ కన్నుల ఎదుట ప్రత్యక్షీకరించే మహాకావ్యమే ఈ సూర్యశతకం. ఈ సూర్య శతకాన్ని పఠిస్తే సూర్యానుగ్రహం కలుగుతుందనడంలో ఏ సందేహమూ లేదు. 1951 ప్రాంతంలో మా నాన్నగారు రక్తగ్రహణితో బాధపడుతున్నప్పుడు ఈ సూర్యశతకాన్ని అనువదించారు. సరిగ్గా ముప్పై రోజుల్లో ఈ శతకం పూర్తి చేశారు. స్థిరంగా కూర్చుని రాయడానికి ఓపిక లేనప్పుడు మా నాన్నగారు పద్యాలు చెప్తుంటే వేమూరి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు రాసి పెట్టారు.ఆ సమయంలో శాస్త్రిగారు చేసిన మహోపకారం చిరస్మరణీయమని చెప్పేవారు. నాన్నగారి అనువాద పద్యాలను అప్పట్లో " సంజయ" వారపత్రికలో వారం వారం ప్రచురించి ప్రోత్సహించిన వారు పండితారిధ్యుల నాగేశ్వరరావుగారు. ఈ మయూర సూర్య శతకాన్ని మా నాన్నగారు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అంకితమిచ్చారు.తాను రాసిన ఏ పుస్తకమైనాసరే నాన్నగారు అచ్చయి రావడంతోనే మా అన్నదమ్ములకు సంతకాలు చేసి ఒక్కో ప్రతి ఇచ్చేవారు. అలాగే ఈ పుస్తకమూ నాకిచ్చారు. కానీ దానికి కాళ్ళొచ్చి ఎటో వెళ్ళిపోయింది. కొన్నేళ్ళక్రితం తనకెక్కడ పుస్తకాల దుకాణంలో కనిపించిందంటూ ఈ మయూర సూర్య శతకాన్ని నాకు కొనిచ్చారు సంగిశెట్టి శ్రీనివాస్ గారు. కానీ ఆ ప్రతీ కనిపించడంలేదు నా పుస్తకాల వరుసలో. ఎవరికైనా చదవడానికి ఇచ్చానా లేక ఎటైనా కలిసిపోయిందో తెలీడంలేదు. పదిలపరచుకోలేకపోవడం నా దురదృష్టం. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు