వేసవిశలవులలో ఆఫీసు వర్క్ చేయడానికి రోజూ స్కూలుకు వచ్చేవాడను. నాన్-టీచింగ్ స్టాఫ్ కూడా నాతో వచ్చేవారు. ఒకనాడు ఒక వ్యక్తి నా ఆఫీసు రూంకు ఎదురుగా రెండు వందల గజాల దూరంలో నిల్చొని ఇద్దరు వ్యక్తుల తో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే వ్యక్తి రాజకీయ నాయకుడిలా ఉన్నాడు. అతనికి ఎదురుగానున్న ఇద్దరు వ్యక్తులు కూలి వాళ్లలా ఉన్నారు. ఇంతలో మా రికార్డు అసిస్టెంట్ వచ్చి " సర్ ! మీకు ఎదురుగా ఆ పాకల దగ్గర నిల్చున్న వ్యక్తి ఈ ఊరు రైతు సంఘనాయకుడండీ. అతని పేరు ' బాబ్జీ' . మన పాఠశాలకు ఏ పని కావాలన్నా అతనే చేస్తారండీ. మన స్కూలు పిల్లలు కూర్చునేందుకు అయిదు సెక్షన్ లకు గదులు చాలవు. ప్రతీ సంవత్సరం ఆ ఐదు సెక్షన్ల పిల్లలకు అక్కడ ఐదు పూరిపాకలు రెళ్ళు గడ్డితోవేయిస్తారు. మన స్కూలు ఫంక్షన్లలో కూడా పాల్గొంటారు." అని రికార్డు అసిస్టెంట్ ఇంకా ఏవేవో చెప్పబోతున్నాడు. ఇంతలో ఆ నాయకుడు తనతో వచ్చిన కూలీలతో వెళ్లిపోతున్నాడు " పిలవమంటారా సర్ ! " అన్నాడు రికార్డు అసిస్టెంట్. వద్దనేసాను. స్కూలు అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడని ముందుగా తెలిస్తే నేనే ముందుగా వెళ్లి కలిసే వాడిని. ఇంతవరకూ ఆ రాజకీయ నాయకుడు మనకెదురు గానే ఉన్నాడు. ఎవరో మనకెందుకులే అని పలకరించలేదు.ఇప్పుడు వెళ్లిపోతున్న వ్యక్తిని పిలవడమెందుకు ? తరువాత పాఠశాలకు వచ్చినప్పుడు కలవొచ్చులే అనుకున్నాను. మా రికార్డు అసిస్టెంట్ ఇంకా కొన్ని విషయాలు చెబుతూ " ప్రస్తుత మండల ప్రెసిడెంట్, మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్ గారైన వాకాడ నాగేశ్వరరావుగారికి ఆప్తుడు ఈ బాబ్జీగారు.ఈ ఇద్దరూ రాజకీయంగా ఎప్పుడూ కలిసిమెలసి ఉంటారు. కలిసిమెలసి పనులు చేస్తారు." అన్నాడు. అహా అలాగా ! అన్నాను. కానీ వాకాడ నాగేశ్వరరావు నా క్లాస్-మేట్ అని గానీ, నా స్నేహితుడనిగానీ నేను ఆ రికార్డు అసిస్టెంట్ కు చెప్పలేదు. నేను శలవుల్లో ఆఫీసుకు రోజూ తొమ్మిది గంట లకు వచ్చి పనులన్నీ చూసుకుని ఒంటి గంటకు ఇంటికి వెళ్ళేవాడిని. రెండు రోజులు పోయిన తరువాత బాబ్జీగారు, పదిమంది కూలీలు, ట్రాక్టరుతో రెల్లుగడ్డితో వచ్చి పని చేయి స్తున్నారు . నేను తొమ్మిది గంటలకు వచ్చాను. అతని దగ్గరకు వెళ్ళి పలకరించాను. బాబ్జీగారు చాలా సంతోషించి " మీ క్లాస్-మేట్, ఫ్రెండ్ వాకాడ నాగేశ్వరరావు మీ గురించి అంతా చెప్పాడు. పాఠశాల ను జాగ్రత్తగా చూస్తారట. బలిజి పేటలో ఉన్నప్పుడు ప్రజల సహకారంతో పాఠశాలను చాలా అభివృద్ధి చేసి మొదటి జన్మభూమిలో జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ తెచ్చారట ! చాలా సంతోషం. మా పిల్లలకోసం మీరు కష్టపడుతున్నారు. ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తాం " అన్నారు. థాంక్స్ చెప్పాను. ఈ పని అయిన తరువాత ఒకసారి నా ఆఫీసు రూంకు రండి. అలానే అప్పుడప్పుడూ పాఠశాలకు వచ్చి పోతుండండి అన్నాను. " " అలానే వస్తాను కానీ ప్రస్తుతం కాదు. మీ ఫ్రెండ్ నాగేశ్వర రావు నేనూ ఏదో రోజున తప్పనిసరిగా కలసి వస్తాం.ఇంతకీ మీరు ఉంటుండగా మా అవసరం స్కూలుకు ఉండదు. " అన్నారు బాబ్జీగారు. ఈ ఊరు మీది. ఈస్కూలు మీది. పిల్లలు మీవారు. వారు బాగుపడాలనే కోరిక నాయకునిగా మీకు ఉంటుంది. తరువాత మాకు ఉంటుంది.మొత్తం పై ఇద్దరిదీ బాధ్యత. మీ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలి. అని చెబుతూ ఆఫీసు రూంకు వచ్చేసాను. తరువాత మూడు, నాలుగు రోజుల్లో వేసవి శలవులు అయిపోయాయి. పాఠశాల రీ- ఓపెనింగ్ అయింది. నాకంటే ముందుగా హెడ్మిష్ర్టస్ ఉండేవారని చెప్పాను.ఆమె చాలా అమాయకు రాలు. పైగా భయస్థు రాలనీ, ఒక సీనియర్ టీచర్ తగాదా కోరనీ, ఎవరికైనా మంచి జరిగితే చూడలేకపోయేవాడనీ, ఈర్ష్య, ద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంటాడనీ విన్నాను. ఆ టీచర్ బ్రతుకంతా అవతలివాడి విషయాలు ఇవతలి వాడికి చేరదీయడం, ఇవతలివాడి విషయాలు అవతలి వాడికి చేరదీసి తగాదాలు పెట్టడమే తన పనట.మరికొంత మంది టీచర్లు ప్రాంతీయ, జాతి,కుల వైషమ్యాలతో తిట్టు కుంటూ ఉండేవారనీ టీ, టిఫిన్ లకు, హోటళ్ళకు, ఎస్. టి.డీ బూతులకు ఫోన్ చేద్దామంటూ వీధిలోకి వెళ్లి వాళ్ళ పీరియడ్ చివర్లో వచ్చేవారట. అలానే ఏవో కారణాలు చెప్పి స్కూలుకు లేటు రావడం చేసేవారట. ఇటువంటి అస్థవ్యస్థ పరిస్థితులు పాఠశాలలో కోకొల్లలుగా ఉన్నాయని నాన్- టీచింగ్ స్టాఫ్ ద్వారా విన్నాను. అలానే అటెండరు, నైట్-వాచర్ లు గుమస్తా, రికార్డు అసిస్టెంట్ ఎటువంటివారో చరిత్రంతా ఒకరిమీద ఒకరు చెప్పుకొచ్చారు. ఇక గుమస్తా, రికార్డు అసిస్టెంట్ లు నైట్ వాచర్ , గార్డెనర్ పై చెప్పుకొచ్చే వారు. ఇలా విషయసేకరణ జరిగింది. అయినా నేను అన్ని విషయాలను మనసులో ఉంచుకుని వాళ్ళ చర్యలను పరిశీలించేవాడిని. ఎందుకంటే ఒకరంటే ఒకరికి పడక చెప్పొచ్చు. గార్డెనర్ రెండు, మూడు రోజుల్లో జీతాలందు తాయనగా నా దగ్గరకొచ్చి నైట్-వాచర్ .గునపాం, పార, బొరిగెలు, బకెట్ లు తన ఇంటి దగ్గర ఉంచుకున్నాడు ఇమ్మంటే ఇవ్వకుండా ఉన్నాడండీ. నేను మొక్కలు ఎలా నాటుతానండి అంది. నైట్- వాచర్ ను పిలిచి అడిగాను గార్డెనర్ ఇలా అంటుందని. ఇంటి దగ్గర వెతుకుతానన్నాడు. వెతకడం కాదు.గంటలో తెచ్చివ్వాలి.నివ్వు ఇంట్లో దాచినవి తెచ్చిస్తావో? బజారుకెళ్ళి కోనేసి తెస్తావో నాకు తెలియదు గంటలో ఇక్కడ వస్తువులు ఉండాలన్నాను. ఇకనుంచి పాఠశాల వస్తువులు పాఠశాలలోనే ఉండాలి. అలా కాని పక్షంలో ఆ వస్తువు ఖరీదుకు మరి రెండింతలు కట్టవలసి ఉంటుందని చెప్పాను. పాఠశాల సామగ్రి ఇంట్లో పెట్టు కోవడం ఒక నేరం. గార్డెనర్ పనికి ఆటంకం కలిగించడం మరో నేరం. నీవు గార్డెనర్ కు మొక్కలు వెయ్యడంలో సహాయం చేసి, బోర్ లో నీరు బకెట్ కు నివ్వే కొట్టి గార్డెనర్ కు ఇచ్చి, మొక్కలకు పోయించి బ్రతికించాలన్నాను. అలా అనేసరికి మొక్కలను నాటి, నీరు పొయ్యమంటే పోస్తాను గానీ మొక్కలు బతికించడం నా చేతిలో లేదండయ్యా అన్నాడు. మొక్క బ్రతకడం బ్రతకకపోవడం నీవు నాటే విధానాన్ని బట్టి, నీరుపోయడాన్నిబట్టి, ఆ నేల సారాన్ని బట్టి, వాటికి నీవు కల్పించే రక్షణను బట్టి ఉంటుంది. నీవు నైట్- వాచర్ వి కాబట్టి పశువులు, పందులు, మేకలు, కోళ్లు రాకుండా చూడాలి. పాఠశాల పనిరోజుల్లో పగలంతా గార్డెనర్ కాపలా ఉంటుంది. మిగిలిన కాలం పాఠశాల ఆస్థులకు కాపలా దారుడవు నీవే కదా ! మన స్కూల్ తరగతి గదుల ముందు నుండి బళ్ళు పరిగెత్తించి తీసుకువెళ్తుంటే అంతా చూస్తున్నా రు గానీ వారినినిలువరించగలిగే ప్రయత్నం చేయలేదు. పాఠశాల అంటే ప్రతీ ఒక్కడికీ అలుసైపోయింది. మరి పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యు లెవరు ? బండ్లను పాఠశాల గుండా రావొద్దని వచ్చేవారికి చెప్పండి. వారు మన మాట వినకపోతే ఊరు పెద్దలముందు పెడదాం అని చెప్పాను. మీరు ఎవరి దగ్గరా జడవ వలసిన అవసరం లేదు. ఇక పిల్లలు ఆడుకొనే ప్లే గ్రౌండ్ పశువులు పచ్చగడ్డి మేసే " గ్రీన్ లాండ్ " లా ఉంది. అంతా చూస్తుంటే మన స్కూలు మనది కాదు. మనఇల్లు మనదికాదు. అంతా పరాధీనమే ! మనకు బాధ్యత లేదు. మన పనులు మనం చెయ్యం.ఫస్ట్ వచ్చేసరికి మన జీతాలు మనకు వచ్చేయాలి. మన వస్తువులు మనం కొనుక్కోం. ప్రభుత్వ ఆస్థులతోనే బ్రతికేయాలి. పెద్దవాళ్లమైపోవాలి. ఇవీ మన నీచాతినీచ మైన బ్రతుకులు. మనుషులు మారండి. తిండి కోసం జంతువులు రోజంతా ఎండలో, వర్షంలో, చలిగాలుల్లో తిరుగుతాయి. మనం మాత్రం ఏమీ కష్టపడకూడదు.కూర్చొని జీతాలు అందుకు తినాలి. అలా చెయ్యడానికి మనకు సిగ్గు, లజ్జా ఉండాలి. ఈరోజు నుండి ఎవరి పనులువారు చెయ్యండని సీరియస్ గా చెప్పి పంపించేసాను. ( సశేషం )-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్: 701 3660 252.
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి