ముందు రోజు రాత్రంతా వర్షం పడినట్లుంది. ఉదయం స్కూలుకు వచ్చేసరికి స్కూలు ప్రాంగణమంతా తడిచి ముద్దయింది. ఆ రోజు గార్డెనర్ కు నీళ్ళు పోసేపని తగ్గింది. అలా వర్షం పడటం మూలంగా గ్రౌండ్లో వేసిన మొక్కలన్నీ నవనవలాడుతున్నాయి. మనం బకెట్లతో ఎంత నీరు పోసినా ఆ పచ్చదనం రాదు. తల్లిపాలు తాగేపిల్లలు ఉన్నంత ఆరోగ్యం డబ్బా పాలు త్రాగిన పిల్లలు ఉండరట ! పూల మొక్కలు వెయ్యడం స్కూలుకు ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ఆలోచన చేస్తున్న సమయంలో అటెండరు వచ్చి " మాష్టారు ప్రెయర్ బెల్ కొడతానని చెప్పి బెల్ కొట్టడం జరిగింది. ప్రార్థనా సమావేశానికి టీచర్స్,విద్యార్థులు చేరుకున్నారు. తెలుగు తల్లి పాట, భారత దేశం నా జన్మభూమి అనే ప్లెడ్జ్ (ప్రతిజ్ఞ ) చెప్పడం జరిగింది. ఆ రోజు వార్తలు చదివిన అనంతరం ప్రధానోపాధ్యాయునిగా ప్రసంగిస్తూ " ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణ కలి గుండాలి. పాఠశాల టైంకు కనీసం పావుగంట, ఇరవై నిమి షాలైనా ముందైనా రావాలి. అలా అయితే టెన్షన్ ఉండదు. రెండు పూటలు స్కూలు పనిచేసేటప్పుడు ఉదయం మూడుగంటలు పనిచేయాలి. మధ్యాహ్నం రెండున్నర గంటలు అంటే మొత్తం అయిదున్నర గంటలు పనిచేయాలి. అదే సింగిల్ సెషన్ లో పనిచేస్తున్న స్కూలు అయితే నాలుగు న్నర గంటలు పనిచేయాలి. నాలుగున్నర, అయిదున్నర గంటలు పనిచేసిన వ్యక్తికి పదినిమిషాలు లేటుగా వచ్చిపదినిమిషాలు ముందుగా వెళ్లిపోతే ఆవ్యక్తికి వచ్చేది ఏమీలేదు. అనవసరంగా పదిమందిచే మాటపడటం మాత్రమే మిగుల్తుంది. కష్టపడి పనిచేస్తున్న వారు ఈ పది, పదిహేను నిముషాలకోసం ఆశ పడకూడదు. ఇంతా కష్టపడి ప్రజలచే మాటపడటం దేనికి ? మంచి టీచర్ గా పూజింప బడండి. ఇదే విషయాన్ని నేను ముప్పై సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘనాయకునిగా చెప్పుకొస్తున్నాను. టీచర్ అంటే తను చెప్పే పిల్లలకు , సమాజానికి లీడర్.టీచర్ సమాజంలో బానిసగా బ్రతకకూడదు. బోధకుడుగా బ్రతకాలి. సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించాలి. అందుకేప్రభుత్వం కూడా ఏదైనా కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మాత్రమే ఆ కార్యక్రమాన్ని అప్పజెబుతారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఊరేగింపులలో ప్రచార ఖర్చులు లేకుండా వీరిచే ప్రచారంజరిపిస్తారు. అందుకే ఉపాధ్యాయులలో, విద్యార్థులలో క్రమశిక్షణ ఉండాలి. బానిసత్వ లక్షణాలు ఉపాధ్యాయులలో ఉండకూడదు. ధీరోధాత్తులుగా ఉండాలి. విద్యార్థులను కూడా ధీరోధాత్తులుగా చేయాలి. పట్టుదలతో ప్రతీ పనినీ విద్యార్థులచే అనుకున్న (ఫిక్స్ డ్ ) టైం లో జరిగేలా చూడాలి. ప్రతీ నిముషం పిల్లలకోసం వెచ్చించాలి. ఉధ్యాయుడు నిరంతర శ్రామికుడు. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడటమే మన ధ్యేయంగా ఉండాలి. ఉన్నత పదవులను అధిరోహించినా పైసాకు కక్కుర్తి పడని వ్యక్తిగా జీవించాలి.. ఎన్నికష్టాలొచ్చినా ఎదుర్కోవాలి. ఒకరికి దాసోహం అయ్యే ప్రశక్తి ఉండకూడదు. ప్రతీ ఉపాధ్యాయుడు హూందాగా ఉండాలి. అప్పుడే మనం ప్రజాభిమానాన్ని పొందగలం. క్రమశిక్షణతో మన పని మనం చేయాలి. అదే మనకు శ్రీరామ రక్ష. అదే మన ఆస్థి అని మనం గ్రహించాలి. ఉపాధ్యాయ వృత్తిలోనున్న వ్యక్తులు తమ అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతీ పనినీ పిల్లలు పరిశీలనగా చూస్తారు. ఇలా నిరంతరం క్రమశిక్షణకు తగిన సూచనలు చేయడం జరుగుతుండేది ( సశేషం )-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.


కామెంట్‌లు