కొమరాడలో మా నాన్నగారు టీచరుగా పనిచేసి రిటైర్ అయి అక్కడే ఉంటున్నారు. అమ్మ నాన్నలతో కలిసి ఉందామని వేసవి శలవులలో కొమరాడ కుటుంబంతో వెళ్ళాను. నన్ను చూసిన అమ్మా నాన్నలు ఎంతో ఉప్పొంగిపోయి ఆలింగనం చేసుకున్నారు. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టు మనవలను చూసి అమ్మా, నాన్నలు ఎంతో ఉప్పొంగిపోయారు. మమ్మల్ని చూడటానికి ఆ వీధిలో ఉన్నవారు చూడటా నికివచ్చి పలకరించారు.నేను చిన్నప్పటి నుండీ వారు మా కుటుంబం యెడలచూపుతున్న ప్రేమాభిమానాలు వేరు. అవి ఎనలేని ఆప్యాయతలు.నిజానికి నేను వారి చేతులలోనే పెరిగాను. నేను కొమరాడ ఎప్పుడొచ్చినా మా అమ్మా నాన్నలతో సహా ఏదో ఒక స్వీట్ వారికి కూడా తెచ్చి ఇంటికి పలకరింపుకు వచ్చే వారికి ఇచ్చే వాడిని. ఆమాత్రం దానికే వారు పొందే ఆనందం అంతా ఇంతాకాదు. మేము కొమరాడలో ఉన్నంత కాలం వాళ్లకు పండేపంటలు తెచ్చి ఇచ్చేవారు. వారి ఆప్యాయతను ఏమని అనుకోవాలో, ఏమని పిలవాలో తెలిసేదికాదు. పల్లెటూరు వాతావరణం, ఆ ప్రేమ, అభిమానం వర్ణించ లేనిది. నేను ఆఊరులో ఉన్నంతకాలం ఉదయం,సాయంత్రం రెండు పూటలా మా గడపలో వచ్చి కూర్చుండేవాళ్ళు. వాళ్ళ రాకతో నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేది. సాయంత్రంనాగవళి నదీ తీరానికి వారితో కలిసి షికారు వెళ్ళేవాడిని. సాయంకాలం వేళ వీచే ఆ పిల్ల వాయువులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేవి. అందుకు తోడు వారితో సరదా సరదా మాటలు ఉండేవి. నాగావళి నది కెరటాలు ఎంతో చూడముచ్చటగా ఉండేవి. వర్షాకాలంలో నాగావళి నది వండ్రుమట్టి, బురదనీరు, చెత్తా చెదారాలను, మహావృక్షాలు జంతుకళేబరాలను మోసుకొస్తుంది. భయంకరమైన ఉగ్రరూపం దాల్చి ఉంటుంది. ఎవరినీ దరిచేరనీయదు.కానీ వేసవి రోజుల్లో ఎంతో ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నిర్మలమైన, స్వచ్ఛమైన నీటిలో ఎన్ని గంటలైనా స్నానం చేస్తూ ఆనందాన్ని పొందవచ్చు. ఆ నీటి ప్రవాహంలో కెరటాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉన్న సమస్యలు, టెన్షన్ మనసులో పూర్తిగా లేకుండా పోతాయి. చిన్ననాటి స్నేహితుల ఇళ్ళకు రోజులో ఏదో పూట వీలు చూసుకుని వెళ్ళి ఒక గంటో గడియో కాలం గడిపి వచ్చేవాడిని. నాకు ఉద్యోగం వచ్చిన రోజులలో ఎవరితోనూ అంత సన్నిహితంగా ఉండేవాడిని కాదు. దానివలన మా నాన్నగారులేని సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పటి నుండి పబ్లిక్ తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తునే ఉన్నాను. ఆ ఫలితమే నేను పనిచేసిన అన్ని ప్రదేశాలలోనూ ప్రజలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటానికి ప్రయత్నించేవాడిని. దగ్గర బంధువులు ఇంటికి కూడా ఏదో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వెళ్ళేవాడిని. ఉద్యోగంలో చేరిన తరువాత దగ్గర, దూరపు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం ఎంతో కొంత కాలం గడిపివచ్చే వాడిని.అదే పద్ధతిని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. పార్వతీపురంలో మా పెద నాన్నగారు, మా మేనమామగారు ఇతర బంధువులు పార్వతీపురం చుట్టు ప్రక్క గ్రామాల్లో ఉన్నారు. కొమరాడలోనే ఉండి ఆయాగ్రామాలలోనున్న చుట్టాలను చూసి వద్దా మనుకున్నాను. నాకు పార్వతీపురం అనేసరికి చిన్ననాటి సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి. వాటిని ఈసందర్భంగా మీతో చెప్పాలనిపిస్తుంది. నేను పార్వతీపురంలో ఆరవ తరగతి చదువుతున్నరోజులు. బోర్డు హైస్కూలు మెయిన్ స్కూలు బెలగాంలో ఉండేది. దాని బ్రాంచ్ టౌన్ లో ఉండేది. ఆబ్రాంచ్ స్కూలులోఆరవతరగతి చదివేవాడిని.మధ్యాహ్నం భోజనం అయిపోయిన తరువాత, నలుగురైదుగురు కలిసి థాట్రాజ్ గారి మిల్లు దగ్గరకు వెళ్ళేవాళ్ళం. ఆ మిల్లు దగ్గర ఒక నేలనుయ్యి ఉండేది. ఆ నేలనుయ్యి పాడుబడింది అనుకుంటాను.దాని చుట్టూ అర అడుగు సిమెంట్ గట్టు కట్టించి ఆ నేలనుయ్యిలో ' ధాన్యం ఊక ' ను రోజూ పోసే వారు. చివరకు ధాన్యం ఊకతో ఆ నేలనుయ్యిని పూర్తిగా కప్పేసారు. నేను, నా స్నేహితులు మధ్యాహ్న విరామ సమయంలో ఆ నేలనుయ్యి పై ఆడు కొనేందుకు వెళ్ళే వాళ్ళం. ఇవతల గట్టు నుండి ఆవలగట్టుకు, ఆవల గట్టు నుండి ఈవల గట్టుకు గెంతేవాళ్ళం. ఒకనాడు ముందు రోజు వర్షం పడింది. నేను తప్పించి, నా స్నేహితులు ఎవరూ నేలనుయ్యి వద్దకు ఆటకు రాలేదు. నేను ఒక్కడినే ఆటకు వచ్చాను. ఎవరూ ఆ చుట్టుపక్కల లేరు. నేను ఈవలి గట్టు నుంచి ఆవల గట్టుకు, ఆవలగట్టు నుండి ఈవలి గట్టుకు మధ్యలోగల ఊకపై అడుగు వేస్తూ గెంతడంప్రారంభించాను. నేను అలా గెంతుతూ గెంతుతూ ఉండగా ఉన్నట్టుండి ఊక ఊబిగా (ముందు రోజు వర్షం పడటం వలన ) తయా రైంది. ఆ ఊక ఊబిలో కాలుపడి ఊబి లాగేస్తుంది. వెంటనే నేల నుయ్యి సిమెంట్ గట్టు పట్టుకున్నాను.గట్టు చిన్నది. పట్టు దొరకలేదు. చేయి జారిపోతుంది. పట్టుకో డానికి ఏమీ ఆధారం లభించలేదు. గానీ అక్కడ ఉన్న గాలి వానమొక్క ఒకటి ఆధారంగా దొరికింది. అయినా నన్ను ఊకఊబిలోకి లాగేస్తుంది. ఏం చేయాలో తోచలేదు. ఆచుట్టుపక్కల మనుషులు ఎవరూలేరు. కొమరాడలోనున్న అమ్మకు నాన్నకు తెలియకుండా చనిపోతున్నాననుకున్నాను. ఇంతలో ఎవరో ఒక పెద్దాయన నాకు ప్రక్కగానునున్న త్రోవ నుండి దేవుడు వచ్చినట్టు వచ్చాడు. నన్ను ఊక ఊబిలో నుండి గట్టిగా చెయ్యి పట్టుకొని మీదకు లాగి " ఏం బాబూ ! చచ్చిపోవలసిందే కదా. గట్టిగా కేక వేయకుండా అలా అమాయకంగా ఉండిపోయావేం ! " అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. అలానే నా పుట్టుక స్థలమైన ఒల్లరిగుడబలో కూడా పది సంవత్సరాల వయస్సులో స్నానానికి చెరువుకు వెళ్ళి కాలుజారి చాలా లోతుకు వెళ్ళిపోయి చాలా నీరు తాగేసాను. ఇంతలో ఈత వచ్చిన ఒకతను వచ్చి నన్ను ఒడ్డున చేర్చి బ్రతికించి ఆ దగ్గరగా నున్న మా ఇంటికి చేర్చాడు. మరోసారి నేను కోటిపాంలో తొమ్మిదవ చదువుతున్నప్పుడు సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తరువాత పిల్లలు అంతా ఇళ్లకు వచ్చేస్తూ మార్గ మధ్యంలో ఒక జామిచెట్టు కనిపించింది. ఆ చెట్టు చుట్టూ తుప్పలు, డొంకలు, రకరకాల చెట్లు, ముళ్లపొదలు, పుట్టలూ ఉన్నాయి. ఆ జామిచెట్టు నిండా జామ పళ్ళు, పలకబారిన దోరజామకాయలు చాలా ఉన్నాయి. ఆ చెట్టు క్రింద తుప్పల్లో నేల నుయ్యి కూడా ఉంది. జామ పండ్లు తెంపేద్దాం అనే తొందరలో నలుగురైదుగురం చెట్టు ఎక్కిపోయాం. నేను చెట్టు చివరి కొమ్మకు చేరి ఆతృతలో అక్కడ నుండి జారిపోయి మధ్యకొమ్మన చిక్కుకు పోయానుక్రిందన నేల నుయ్యి ఉంది. అందులోపడితే అంతే ! నాకు ఈత వచ్చేదికాదు. నాతోటి విద్యార్థులే నన్ను ఆ ప్రమాదంనుండి రక్షించారు. ఇలా నా బాల్యంలో జరిగిన ప్రమాదాల నుండి బయటపడ్డాను. ఇవన్నీ తలచుకుంటే ఒళ్ళు గగు ర్పాటు చెందింది. కొమరాడలో వారంరోజులపాటుండి ఒల్లరిగుడబ, చినగుడబ, చినబొండపల్లి, పార్వతీపురంలో గల బంధువులు ఇళ్లను చూసి వచ్చేసి చుట్టరికపు సంబంధా లను విస్తృత పరచుకున్నాను. ( సశేషం ) -- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి