ఇ. ఆర్. అప్పారావు డి. ఇ. వో గారు బొబ్బిలి మండలా ఫీసుకు ఇనస్పెక్షన్ కు వచ్చి మూడో రోజు అవుతుంది. ఈరోజు తరువాత విజయనగరం వెళ్లిపోతారు. ఆ కారణంగా మూడోరోజు తప్పనిసరిగా మా స్కూలుకు వస్తారని నేను కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాను. ఎందుకంటే మా ఇద్దరం కలిసి ఉండేటప్పుడు " మీ స్కూల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని ఉందయ్యా ప్రభాకరం" అని చాలాసార్లు అన్నా రు. నేను ఏ స్కూలులో అసిస్టెంట్ గా పనిచేసినా నేను బోధించే క్లాసులకు (8, 9, 10 తరగతులకు ) సంబం ధించి మెరిట్ లిస్ట్ లను ఈ క్రింది విధంగా తయారు చేసు కునేవాడిని. 1. A గ్రేడ్ ---- 60% పైబడినవారు 2 . B గ్రేడ్ ---- 50% -- 59 శాతం మధ్యలో నున్నవారు 3-. C గ్రేడ్ ---- 35% -- 49 శాతం మధ్యలో నున్నవారు 4. D గ్రేడ్ ---- 20% -- 34 శాతం మధ్యలో నున్నవారు 5. E గ్రేడ్.---- 0% --- 19 శాతం మధ్యలో నున్నవారు మొదటి యూనిట్ టెస్ట్ నుండి ఇలా రికార్డు మెయింటైన్సే వాడిని. మొదటి టెస్ట్ కన్నా రెండో టెస్ట్ లో విద్యార్థిలో కదిలిక వచ్చి పై గ్రేడ్ కు వెళ్ళాలి. అలా ఆ విద్యార్థి వెళ్ల లేకపోయాడంటే దానికి కారణమేమిటో మనం కనుక్కోవాలి. ఆ లోపాన్ని సరిదిద్దాలి. మనం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ముందుకు వెళ్తాడు. ఆ విశ్వసనీయతోనే ముందుకు వెళ్లేవాడిని. నేను బి.ఇడి అసిస్టెంట్ గా ఉన్నప్పుడు పదవతరగతి ఇంగ్లీషు, సోషల్- స్టడీస్ బోధించేవాడిని. అప్పుడు నా పరిధి ఆ రెండు సబ్జెక్ట్స్ వరకే ! పక్కి వచ్చిన తరువాత పదవ తరగతి పిల్లలకు నేను బోధించేది ఒక్క ఇంగ్లీషు అయినా,హెడ్మాష్టరుగా అన్ని సబ్జెక్ట్స్ పై దృష్టి కేంద్రీకరించవలసి వచ్చే ది. ఆ కారణంగా నేను పదవ తరగతి ఇంగ్లీషు బోధించినా కామన్ గా అన్ని సబ్జెక్ట్స్ ల్లో విద్యార్థులకొచ్చిన మార్కులు వేయించి ఏ శ్రేణిలో ఏ విద్యార్థి పాసవడానికి అవకాశ ముందో పరిశీలించేవాడను. డి. ఇ. వో గారు వస్తే అతను పదవతరగతి పిల్లల మార్కుల జాబితా తనకు ఒకటి అందజేయ మంటారని మరో లిస్ట్ తయారు చేయించి ఒక ఫైల్ లో పెట్టి ఉంచాను. డి.ఇ.వో గారికి ఉదయం మండలాఫీసులో ఇనస్పెక్షన్ ఉంటుంది. ఆ కారణంగా వస్తే మధ్యాహ్నం రావొచ్చని అనుకున్నాను. కానీ డి.ఇ.వో గారు మధ్యాహ్నం అయినా వస్తారనే కబురు రానేరాలేదు. సాయంత్రం నాలుగున్నర అవుతోంది. అయినా డి ఇ వో గారు రాలేదు. పాఠశాల లాంగ్ బెల్ కొట్టించేసి ఒక్క టెన్త్ క్లాస్ పిల్లలను సాయంత్రం జరపబోయే స్పెషల్ క్లాస్ కు ఉంచాను.ఒక సైన్స్ టీచర్, ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ( ఎం.ఎల్. ఏ గారి చిన్నాన్న కొడుకు ) పక్కి గ్రామంలోనే నివసిస్తుంటారు. వారిని పిల్లలకు తోడుగా ఉంచి ఆరు గంటల వరకూ చదివించమన్నాను. ఎందుకైనా మంచిదని నేను కూడా మరో గంట ఉందామని నిర్ణయించు కున్నాను. నేను పిల్లల చదువులకు తోడుగా ఉంచిన ఇద్దరు టీచర్స్ చదివిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో నేను ఆఫీసు రూంలోకూర్చునే పరిశీలిస్తున్నాను. సాయంత్రం ఐదున్నర గంటలు అయింది. డి.ఇ.వో గారు ఇంకా రాలేదు. నాకు బొబ్బిలిలో ఒక మెరేజ్ ఫంక్షన్ కు ఎటెండ్ అవ్వాల్సి ఉంది. మోటార్ సైకిల్ పై బర్లి రోడ్ జంక్షన్ గుండా బొబ్బిలి బయలుదేరి ఇంటికి చేరి, తరువాత మేరేజ్ ఫంక్షన్ కు వెళ్ళాను. వెళ్లిన గంటలోనే ఇంటినుండి కబురొ చ్చింది . డి ఇ వో గారు, రామభద్రపురం ఎం.ఈ. వో ( మా చుట్టం, స్నేహితుడు ), ఇంకా అతని స్టాఫ్ ఇంటికి జీప్ లో వచ్చారని కబురు తెచ్చిన అబ్బాయి చెప్పాడు. ఫంక్షన్ హాల్ నుండి వెంటనే ఇంటికి వచ్చాను. విషయం కనుక్కు న్నాను. నేను లేకపోవడంతో డి ఇ వో గారు సంస్థానం హైస్కూలుకు వెళ్ళారని , అక్కడకు నన్ను రమ్మనమన్నారని, ఎంత వేళైనా నాకోసం వేచి ఉంటామని చెప్పారు మా ఇంటి దగ్గర. సంస్థానం హైస్కూలుకు తక్షణమే వెళ్ళాను. అయినా రాత్రి తొమ్మిది అయింది. నాకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళీవెళ్ళగానే డి ఇ వో అప్పా రావుగారు " ప్రభాకరం ! మీ స్కూలుకు వెళ్ళాను. ఎం ఈ ఓ సుదర్శనరావుతో మీ ఇంటికీ వచ్చాను. గానీ నీవు లేవు " అన్నారు నవ్వుతూ. " సార్ మీరు పక్కి ఎలా వచ్చారండీ ? నేను ఐదున్నర వరకూ స్కూలులోనే ఉండి ఈ ఊరూలో మేరేజ్ ఫంక్షన్ కు వచ్చేసానండి " అన్నాను. తరువాత " డి.ఇ.వోగారు పిరిడి మార్గం ( పక్కి గ్రామానికి వేరే మార్గం పిరిడి గ్రామం)గుండా వచ్చాను నివ్వూ,నేను రెండు నిమిషాల వ్యవధిలోనే తప్పి పోయామని, మీ టీచర్స్, స్కూలు గేటు ముందున్న కిళ్ళీ బడ్డీవాడు చెప్పా రు. అప్పుడే బర్లి మార్గం గుండా వెళ్లిపో యావట అన్నారు. మా ఇద్దరం పెరసనల్ గా ఉన్నప్పుడు స్కూల్ పరి పాలనా సంబంధమైన విషయాలు అడిగారు. పక్కి ఉన్నత పాఠశాలలో చేరినప్పటి నుండీ ఆ రోజు వరకూ జరిగిన సంఘటనలు వరుసగా చెప్పుకొచ్చాను. ఒక టీచర్ పనిచేసే విధానం నచ్చకపోవడంతో ఇంక్రిమెంట్ స్టాప్ చేసాను అని చెప్పాను.అతనిపై ఏంటీ గా ఫైల్ మెయిన్టెయిన్ చేస్తున్నావా లేదా పర్మినెంట్ గా ఇంక్రిమెంట్ స్టాప్ చేసేద్దామనే ఉద్దేశంలో ఉన్నావా ? లేక టెంపరరీగానా అని అడిగారు. ఇంకా నిర్ణయించుకోలేదు. అతనిపై ఫైలును మాత్రం మెయిన్టెయిన్ చేస్తున్నాను. మనిషి ప్రవర్తనను బట్టే నిర్ణయం తీసుకుందా మనుకుంటున్నాను అన్నాను. డి ఇ వో గారు ఒక్క క్షణం మౌనం వహించారు. నేనూ ఏమీ మాట్లాడలేదు. డి ఇ వో గారు మౌనం వీడి ఆ టీచర్ జాబ్ లో చేరి మూడు సంవత్సరాలైంది అంటున్నావు. పోనీలే సర్వీసుకు కొత్తవాడు. మొదటిలోనే గండికొడితే జీవితాంతం బాధపడతాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారు. పదవతరగతి పరీక్షల రికార్డు మీ సైన్స్ అసిస్టెంట్ చూపించారు. చాలా పూర్ రిజల్ట్ వస్తుంది.మంచి రిజల్ట్ తీసుకురాడానికి ట్రై చెయ్యి అన్నారు. ప్రయత్నం చేస్తానన్నాను. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు