బాలనాథం, నేను బి.ఇడి క్లాస్ మేట్స్ ము. బలిజిపేటలో నేను పనిచేసేటప్పుడు అతను సైన్స్ అసిస్టెంట్, నేేను సోషల్ స్టడీస్ అసిస్టెంట్ ను. ప్రస్తుతం అతను బూర్జ హై స్కూల్ హెడ్మాష్టరు. నేను పక్కి హైస్కూల్ హెడ్మాష్టరును. మేము ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్ళేవాళ్ళం.ఏది తిన్నా, ఏది కొన్నా ఇంత అంతా కాదు. అటువంటి స్నేహం మాది. నేను పక్కినుండి కదిలితే నా స్థానానికి రావాలని చూసాడు తను. ఇంతకీ నేను మరో స్థలానికి కదలడానికి నా దారులన్నీ మూసుకుపోయాయి. మరి అతడు నా స్థానంలోకి ఎలా వస్తాడు. ఏదో మిష్టరీ జరగాలి. అదీ ఆ భగవంతుడు వచ్చిమాయ చేయాలి. ట్రాన్ఫర్స్ కౌన్సెలింగ్ కు వెళ్లడానికి ఇంకా అయిదు రోజులు టైముంది. నేను నా ప్రయత్నాన్ని విరమించుకుని ట్రాన్ఫర్స్ కౌన్సెలింగ్ కు వెళ్ళకూడదనేనిర్ణయించుకున్నాను. పని జరగదు. డబ్బులు ఖర్చు. కానీ ట్రాన్ఫర్స్ కౌన్సెలింగ్ ఎల్లుండి కాకినాడలో ఉందనగా బాలనాథం నా దగ్గరకు వచ్చాడు. కాకినాడ వెళ్దాం పద అన్నాడు. ఎందుకు అన్నాను. కౌన్సెలింగ్ కు అన్నాడు. నీకేం మతిపోయిందా ? మనిషికి ఐదారు వేలు ఖర్చవుతుంది. దండుగ కదా ! టూ అండ్ ఫ్రో బస్ ఛార్జీలు, ఆటోలు, లాడ్జీ రెంట్లు, హోటల్ ఖర్చులు,ఇతరములు ఉంటాయి. ఇంతకూ పని అవ్వని దానికి వేల మీద అనవసరంగా ఖర్చు దేనికి ?మన ఇద్దరికీ కలిపి పది పన్నెండు వేలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులను ఇంట్లో ఖర్చుపెట్టుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అన్నాను. అందుకు బదులుగా పోనీ కౌన్సెలింగ్ పేరుతో కాకినాడకు వెళ్దాం. మనమేనాడూ కాకినాడ ప్రాంతం చూడలేదు.అక్కడ ఉన్న దేవాలయాలు, ఇతర ప్రదేశాలు చూసి వద్దాం. అక్కడ సినిమా హాళ్లు అన్నీవరుస క్రమంలో ఉంటాయటగా పద. అవన్నా చూద్దామన్నాడు. మరి ఎంత చెప్పినా విన్నట్టు లేడనుకొని అలాగేలే వెళ్దా మన్నాను. మరుచటి దినం ఉదయమే కాకినాడ కౌన్సెలింగ్కు బయలు దేరాము. రాత్రి 9,10 గంటల మధ్య కాకినాడ చేరాం. ఆరాత్రి రూం తీసుకున్నాం. మేం దిగిన లాడ్జీలోనే మన ప్రాంతం మిత్రులు చాలామంది మాకంటే ముందుగానే దిగారు. మేము వెళ్ళేసరికి ఒక ఓపెన్ హాల్ లో కూర్చొని మాలాగే కౌన్సిలింగ్ కు వచ్చిన ఇతరులతో మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు చూసి పలకరించుకోవడాలు జరిగి పోయాయి. మరుచటి దినం దినచర్యలన్నీ వేగంగా ముగించుకుని ట్రాన్ఫర్స్ కౌన్సెలింగ్ హాలుకు చేరిపోయాం. ఆ హాలులో మాకు తెలిసినవారు చాలామంది ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకున్నాం. ఆ పలకరించిన వారిలో సీతానగరం హైస్కూల్ హెడ్మాష్టరు పోస్టును ఆశించిన గుమ్మలక్ష్మీ పురం ఎం.ఇ.వో కూడా ఉన్నారు. మేమంతా స్నేహితులమే ! అతనినీ పలకరించాను. ఎందుకంటే విజయనగరం జిల్లాలో గల చాలామంది హెడ్మాష్టర్లు, ఎం.ఇ.వోలు, నా క్లాస్ మేట్స్, నాకంటే ఒకటి రెండు సంవత్సరాల సీనియర్లు లేక జూనియర్లు అయి ఉంటారు. పైగా నేను 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరే షన్ సమితి, జిల్లా శాఖల్లో ప్రెసిడెంట్, ప్రధానకార్యదర్శి, కార్యదర్శిలాంటి పదవులను అనేక సంవత్సరాలుగా నిర్వహించాను. ఆకారణంగా చాలామంది స్నేహితులు పరిచయస్తులే ! అయినా మనకోసం వారి ప్రయత్నాన్నివిరమించుకోరుకదా !కొద్ది క్షణాలలో కౌన్సిలింగ్ ప్రారంభించడానికి ముందు హెడ్మాష్టర్ల ర్యాంకింగులతో లిస్టు ఇచ్చారు. నాది 64వ నెంబరు. నా తరువాత కొద్ది నెంబర్లు తరువాత నా స్నేహితుడు బాలనాథం ది. గుమ్మ లక్ష్మీపురం ఎం.ఇ.వో నెంబర్ ఆ లిస్ట్ లో ఏడవది. సీతానగరం హై స్కూలు హెడ్మాష్టరు పోష్టును ఖాళీ చేయవలసిన మేడంగారి నెంబర్ 8. ఆర్. జె. డి ఆఫీసు గుమస్తా వరుస నెంబర్లు పిలుస్తున్నారు. లిస్టులో సీరియల్ నెంబర్ 7 ను పిలిచారు. గుమ్మలక్ష్మీపురం ఎం.ఇ.ఓ ఇంటర్వ్యూ పేనల్ ముందుకు వెళ్లారు. తను వెళ్లిన రెండు నిమిషాలలోనే 8వ నెంబర్ ను ప్రస్తుతం సీతానగరంలో పనిచేస్తున్న హెడ్మిష్ర్టస్ నుపిలిచారు. ఆమె భర్త హెడ్మాష్టరుగా పనిచేస్తున్నారు. అంటే ఆమెది స్పౌజ్ కోటాలోకి వస్తుంది. ఆమె వెళ్లిన పదినిమిషా లలోనే ఆమె కోరుకున్న చోటుకు ఆర్డర్స్ ఇచ్చేసారు. ఆర్డర్స్ పట్టుకుని ఆమె తన భర్తతో వెళ్లి పోయారు. సీతానగరం పోస్ట్ ఖాళీ అయిందన్నమాట. మరి గుమ్మలక్ష్మీపురం ఎం. ఇ. ఓ గారిని సీతానగరం వేసారో లేదో తెలియదు. ఇలా అనుకుంటుండగానే గుమ్మలక్ష్మీపురం ఎం.ఇ.ఓ గారు నిరాశ, నిస్పృహలతో మా ముందు కుర్చీలో కూర్చుండి పోయారు. ఏమైందని నేనే అడగాలనుకున్నాను. కానీ నేను అడక్కుండా బాలనాథంచే అడిగించాను. ఎంచేతనంటే ఆ సీతానగరం నాక్కావాలి. కాబట్టి నేనడిగితే అతను మరో విధంగా భావించడానికి అవకాశం ఉంది. బాలనాథం అడిగాడు ఏమయిందని ? నాకు సీతానగరం మేడంగారికంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఆ కారణంగా తనపేరు ముందు పిలిచారనీ , తనను పిలిచేసరికి సీతానగరంపోస్ట్ ఖాళీ లేదని ప్రస్తుతానికి ఇవ్వలేమని, ఫస్ట్ రౌండ్ అయిన తరువాత మళ్లీ రెండో రౌండ్ పిలుస్తామన్నారని చెప్పారు. అయితే నా నెంబర్ 64. ఇప్పటికి 8మంది అయ్యారు. నేను సీతానగరం పోస్ట్ పొందడానికి 55 మందిని దాటిరావాలి. అంటే ఈ 55 మందిలో ఏ ఒక్కరికీ సీతానగరం అక్కరలేకుండా ఉండాలి. అది జరిగే పనేనా ? అలా ప్రతీ ఒక్కరినీ పిలుస్తున్నారు. నెంబరు పెరుగుతున్న కొలదీ నాలో టెన్షన్ పెరుగుతూనే ఉంది. ఎవరు ఆ పోస్ట్ ను తన్నుకుపోతారేమోననే భయం. సీతానగరం కావాలని సీతానగరం నేటివ్ ప్లేస్ గలవారొకరు అడిగారనీ, అందుకు అప్పటికుండే రూల్స్ ప్రకారం గజిటెడ్ పోస్ట్ కు ఏ పరిస్థితిలోను నేటివిటీ కలిగిన వ్యక్తిని వెయ్యరని ఆ అభ్యర్థిని తిరస్కరించారని విన్నాను. చాలా సంతోషించాను. మిగిలిన అభ్యర్థులంతా వరుసగా ఒకరితరువాత ఒకరు లోనకువెళ్ళి వారికి కావలసిన స్థలాలను ఎంపిక చేసుకొని ఆర్డర్స్ తీసుకుపోతున్నారు. విజయనగరం , విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నియమింపబడుతున్నారు. ఇంతలోబొబ్బిలి, సీతానగరం లను ఎవరు తన్నుకుపోతారోనన్నగుండె దడ, ఆతృత, ఆరాటం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నా నెంబర్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే చోటుకు వెళ్ళాను. ఆర్జేడీ గారు వేకెన్సీ పొజిషన్ లిస్ట్ ఇచ్చారు. అందులో బొబ్బిలి, సీతానగరం ఉన్నాయో లేదో చూసాను. ఉన్నాయి. నా ఆనందానికి అవధులు లేవు. ఇదంతా మాయాజాలంలా ఉంది. 9 వ నెంబర్ నుండి 63వ నెంబరువరకూ ఎవరూ కోరకపోవడమేమిటి ? ఒకేఒక్కరు కోరినా గజిటెడ్ పోస్ట్ జీ.వో అడ్డం రావడమేమిటి ?నా రెసిడెన్ష్ బొబ్బిలిలో ఉంటున్నది. అందుకే బొబ్బిలి గరల్స్ హైస్కూల్ కావాలన్నాను. అప్పటికి నాకు 50 సంవత్సరాలు దాటినా గరల్స్ హైస్కూలులో నియమించడానికి ఆర్జేడీ గారు ఇష్టపడలేదు. తరువాత ఆల్టర్నేటివ్ సీతానగరం. అడిగిందే తడవుగా ఆర్జేడీగారు సీతానగరం హైస్కూలుకు నన్ను హెచ్. ఎం గా నియమిస్తూ ఆర్డర్స్ ఇచ్చేసారు. మరో పావుగంటలో మా స్నేహితుడు బాలనాథంకు పక్కి హైస్కూలులో హెచ్. ఎం గా నియమి స్తూ ఆర్డర్స్ ఇచ్చారు. జరగదు అనుకున్న పని జరిగింది.ప్రయత్న లోపం ఉండకూడదు అని ఈ సంఘటన రుజువుచేసింది. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,- ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు