కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వు ప్రకారం ఉన్నత పాఠశాలలు ఎప్పటిలాగానే ఉదయం 9.50 నిము షాలకు ప్రారంభించి మధ్యాహ్నం 1గంట వరకూ పాఠశాల నడపాలి. ఒక గంట భోజన విరామ సమయం తరువాత మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల తిరిగి ప్రారంభించి సాయంత్రం4.45 నిముషాలకు విడిచిపెట్టడం జరుగుతుంది.అయితే మధ్యాహ్నం వర్కింగ్ అవర్స్ మధ్యలో పది నిమిషాలు ఇంటర్వెల్ ఇవ్వాలని పేర్కొనబడింది. ఆ ప్రభుత్వ ఉత్తర్వును ఇంప్లిమెంట్ చెయ్యిమని జిల్లా విద్శఖాధికారివారు ప్రతీ స్కూలుకు పంపారు. అయితే ఏ ఒక్కరూ తొందరపడి ఇంప్లిమెంట్ చెయ్యలేదు. అందరూ డి.ఇ.వో గారి నుండి రిమైండర్ కోసం నిరీక్షిస్తున్నారు. కానీ పదిహేను ఇరవై రోజులైనా డి.ఇ.ఓ గారి నుండి ఎటువంటి మెసేజ్ రాలేదు. నాకన్నా ముందుగా ఉన్న హెడ్మాష్టరుని పూతిక పుల్లలా, ఎందుకూ పనికిమాలినవానిగా చూసే వారని, అతనో హెడ్మాష్టరు అనే కనీస గౌరవం ఇచ్చేవారు కాదని ఆ స్టాఫ్ మెంబర్స్ లో కొంతమంది ద్వారా నాకు సమాచారం అందింది. నేను చాలా బాధపడ్డాను. అతనొక హెడ్మాష్టరు నేనొక హెడ్మాష్టరుననికాదు. హెడ్మాష్టరు, అసిస్టెంట్స్ అన్నవారు ఒక కుటుంబం లాంటివారు. హెడ్మాష్టరు ఆ కుటుంబ ( స్కూలు ) యజమాని. ఆ యజుమానిని గౌరవించవలసిన అవసరం ఉంది. అలానే హెడ్మాష్టరు కూడా తన అసిస్టెంట్స్ ను గౌరవించవలసిన అవసరం ఉంది. తన స్టాఫ్ లో కొందరు అడ్డుదారిలో వెళితే నెమ్మదిగా వారికి సర్దిచెప్పి సక్రమ మార్గంలోపెట్టాలి. రిపీటెడ్ గా చెప్పినప్పటికీ వినకపోతే అలా లొంగేటట్టు చేయడానికి ప్రధానోపాధ్యా యునికి అనేక మార్గాలున్నాయి. తన అసిస్టెంట్స్ మీద హెడ్మాష్టరు కంప్లైంట్ ఇవ్వడం, హెడ్మాష్టరు మీద అసిస్టెంట్స్ కంప్లైంట్ఇ వ్వడం సరియైన పద్ధతికాదు. పాఠశాల వాతావరణం చెడిపోతుంది. మనం పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాము గానీ వీధి రౌడీల్లా పోట్లాటకు కాదు. ప్రధానోపాధ్యాయుడు అవినీతిపరుడైనప్పుడు తప్పనిసరిగా నిలదీయవలసిందే ! ఏదిఏమైనా పాఠశాలలో నిరంతరం ప్రశాంతత నెలకొనాలి. పాఠశాల సరదా సంతోషాలకు, ఆనందం, ఆహ్లాదానికి నిలయమై ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు, ఆఫీసు స్టాఫ్ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే ఉత్తమ పాఠశాలగా అభివృద్ధి చెందగలదు. పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు గౌరవిస్తారు. లేకపోతే నలుగురులో నవ్వులపాలు అవ్వవలసిందే ! సంవత్సరం పొడవునా పాఠశాలలో తగాదా లాడుకొని బ్రతికేవారు ఉపాధ్యాయు లనిపించుకోరు. వీధి రౌడీలని పించుకుంటారు. విద్యార్థుల భవిష్యత్తును చెడగొట్టేవారవుతారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వారి పిల్లల భవితను ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని తమ పిల్లలనుబడికి పంపుతారు. అది మనం ఆలోచించాలి. మనం ఆస్కూలు నుండి మరో స్కూలుకు బదిలీపై వెళితే మనమే కావాలి అని ఆ గ్రామస్తులు కోరాలి. అదీ ఉపాధ్యాయుని జీవిత లక్ష్యం అయిఉండాలి. ఆ గౌరవాన్ని ఉపాధ్యాయుడు పొందాలి.జిల్లాలో కొత్త జీ. వో ను ఇంప్లిమెంట్ చేసినా చేయక పోయినా మా స్కూలుకు నేనే మొదట ఇంప్లిమెంట్ చేయా లని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని రెండు మూడురోజుల్లో ఇంప్లిమెంట్ చేసాను. పై ఉత్తర్వును ఇంప్లిమెంట్ చేసినట్టుగ డి.ఇ.వొ ఆఫీసుకు రిపోర్ట్ కూడా పంపించాను.సాయంత్రం 4.45 వరకూ స్కూల్ లో స్టాఫ్ ఉండాలి. ఎంతవేగంగా పాఠశాల నుండి కదలాలని నిర్ణయించు కున్నా కనీసం మరో 5, 10 నిమిషాలు పడుతుంది. బొబ్బిలి బలిజిపేట నుండి టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ వచ్చేవారు. ఆయా ప్రదేశాలలోనున్న ఇళ్లకు తిరిగి వెళ్ళాలంటే బర్లి సెంటర్ కు గంట కాలం నడుచుకు వెళ్లి ఆ సెంటర్ లో బస్సుకోసం నిరీక్షించవలసిందే ! ఆ సెంటర్లో బస్సెక్కి ఎవరిళ్ళకు వారు చేరాలంటే రాత్రి ఎనిమిది అయ్యే‌ది. మరుచటి దినం స్కూలుకు రావాలంటే మరల బొబ్బిలిలో పక్కి బస్సుకోసం 7.30 గంటల నుండి నిరీక్షణ చేయవలసిందే ! ఇలా నెల రోజులు ఇంటికి ఎప్పుడు వెళ్ళేవారో తెలిసేదికాదు.ఒకనాడు స్టాఫ్ అంతా నన్ను కలిసి పాఠశాల కొత్త టైమింగ్స్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ! జిల్లాలో తెలిసి నంతవరకూ ఏ హైస్కూలు కొత్త పనివేళలు ఇంప్లిమెంట్ చెయ్యలేదు మన స్కూలు తప్పించి. మీరు ఎలాగైనా ఈ టైమింగ్స్ మార్పుచేసి గతంలోనున్న టైమింగ్స్ లోపాఠశాల నడిపితే బాగుంటుందని స్టాఫ్ అంతా రిక్వెస్ట్ చేసారు. కానీ నేను డెప్యూటీ డి.ఇ.ఓ, డి.ఇ.వో లను కన్సల్టెంట్స్ చేస్తేగానీ , వ్రాతపూర్వకంగా ఆర్డర్స్ ఇస్తే గానీ ఏమీ చేయలేనని చెప్పేసాను. కావాలంటే బొబ్బిలిలో ఉన్న డెప్యూటీ డి.ఇ.వొ ఆఫీసుకు వెళ్లి ఈ విషయమంతా చెప్పండి. అతను మార్పు చేయండని చెప్పినా మార్చేద్దా మన్నాను. ఇద్దరు, ముగ్గురు టీచర్స్ కలిసి వెళ్ళి విషయమంతా డెప్యూటీ డి.ఇ.వోకు విన్నవించుకున్నారు అయినా అందుకు తను ఏం చేయలేనన్నారు.. అది జిల్లా అంతటికీ సంబంధించిన సమస్య. ఒక్క డివిజన్ కు సంబంధించిన సమస్యకాదు. మీ హెడ్మాష్టరుగారు డి.ఇ.వో గారు మాట్లాడు కొని పరిష్కరించవలసిన సమస్య అని చెప్పి వారిని సాగ నంపేసారు. నిజానికి నేను కోరుండి నాయంతట నేనే ఆ జీ.వోను ఇంప్లిమెంట్ చేసాను. వీరి గడుసు మాటలకు ఆట కట్టిద్దామని. కావాలంటే నేనే ఇ.ఆర్. అప్పారావు డి.ఇ.వో గారితో ఫోన్లో మాట్లాడి వెంటనే కొత్త టైమింగ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా పాత టైమింగ్స్ కు స్కూలునుతెచ్చేయగలను. కానీ వారిని మరికొంత కాలం ఇలా పనిచేయిద్దామనే నిర్ణ యించుకున్నాను. మరికొన్ని రోజులు గడిచాయి.వారి బాధ భరించలేనిదైయింది. ఇ.ఆర్. అప్పారావు, డి.ఇ.వోగారికి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను. జరిగినదానికి అతను నవ్వుకున్నారు. అతను పెర్మిషన్ తో రెండు, మూడు రోజులలో పాఠశాలలో పాత టైమింగ్స్ నే ఇంప్లిమెంట్ చేసాను. స్టాఫ్ అంతా చాలా సంతోషించారు. ( సశేషం )--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు