నాలుగు ప్రశ్నలు(కథ ) డి.కె.చదువులబాబు--ప్రతిభాపుర రాజ్యాన్ని చక్రధరుడనే రాజు పరిపాలిస్తున్నాడు.ఆయన కవి,పండితు లను,కళాకారులను గౌరవించి ప్రోత్సహించేవాడు.ఆయన సభలో ఎంతోమంది పండితులు ఉండేవారు.తరచూ పండితగోష్ఠులు జరుగుతుండేవి. ఒకరోజు చక్రధరుడి కొలువుకు పొరుగుదేశం నుంచి భరద్వాజుడనే పండితుడు వచ్చి "మహారాజా!నా ప్రతిభా పాండిత్యాలతో ఎన్నో రాజ్యాల పండితులను ఓడించాను.ఇంతవరకూ నన్ను ఓడించినవారులేరు.నేనడిగే నాలుగు ప్రశ్నలకు ఈసభలో కాని,మీరాజ్యంలో కాని ఎవరైన సమాధానం చెప్పగలిగితే ఈరాజ్యం మట్టిని తలపై పోసుకుని ,సాష్టాంగదండ ప్రణామంచేసి ,సమాధాన మిచ్చినవారికి పాదాభివందనంచేసి వెళ్ళిపోతాను.చెప్పలేకపోతే మీరు నాపాదానికి స్వర్ణకంకణంతొడిగి ఘనంగా సత్కరించా లి."అని సవాలు విసిరాడు.రాజు తన పండితులమీద నమ్మకంతో సవాలును స్వీకరించాడు.భరద్వాజుడు నవ్వుతూ"మహారాజా! భూమిమీద నడిచే వృక్షాన్ని ఎవరైనా చూపించగలరా? భూమిమీదనడిచే చంద్రుడినిఎవరైనా చూపించగలరా?భూలోకంలో అమృతాన్ని ఎవరైనా చూపించగలరా?"అని అడిగాడు."మూడు ప్రశ్నలే అడిగారు,మరి నాలుగవ ప్రశ్న ఏంటి?"అన్నాడు తలగోక్కుంటూ రాజు. "ఈమూడు ప్రశ్నలకు సరైన సమాధానం దొరికిన తర్వాత నాలుగవ ప్రశ్న అడుగుతాను"అన్నాడు భరద్వాజుడు.ఆప్రశ్నలకు పండితులందరూ ఆశ్చర్యపోయారు.అయోమయపడ్డారు.భరద్వాజుడు పిచ్చివాడు కాదుకదా !అని సందేహపడ్డారు.కొందరు అతితెలివి ప్రదర్శిస్తున్నాడు అనుకున్నారు .పండితులు ఎన్నో ఆలోచనలు చేశారు.కానీ చెప్పలేకపోయారు.రాజుకు ఏంచేయాలో తోచలేదు. ప్రధానమంత్రి వైపుచూశాడు.ప్రధానమంత్రి సంజయుడు బుద్దిశాలి.అనేక సమస్యలను పరిష్కరించిన చతురతకలవాడు.చాలా సేపు ఆలోచించాడు.రెండు రోజుల తర్వాత సభకు రమ్మని,సమాధానాలు చెబుతానన్నాడు.సంజయుడు చెప్పిన సమయానికి వచ్చాడు భరద్వాజుడు.ఈసంగతి రాజ్యమంతటా తెలిసి జనం తో సభనిండిపోయింది.సరైనసమాధానాలు చెప్పలేకపోతే రాజ్యం పరువుపోతుందని అందరూ ఆతృతతో,ఆసక్తితో ఉన్నారు.సంజయుడు భరద్వాజుడిని తనవెంటరమ్మని పిల్చుకుని వెళ్ళాడు. రాజధాని నగరంలోని అనాధలైన వృద్దులు,పిల్లలు ఉన్న విశాలమైన ఆశ్రమం వద్దకు తీసుకెళ్ళాడు.ఆ ఆశ్రమాన్ని అనంతుడనే ధనవంతుడునిర్వహిస్తున్నాడు.తన తాతలకాలంనుండి ఉన్న భూముల ద్వారా వచ్చే పంటను,తన సంపాదనను,విరాళాలను ఉపయోగించి నడుపుతున్నాడు.మంత్రి భరద్వాజుడికి అనంతుడిని పరిచయం చేసాడు.ఆశ్రమంఅంతా చూపించాడు.అనంతుడిని వెంటపిల్చుకుని సభకు వచ్చాడు.మంత్రి భరద్వాజుడితో "భూమిపై నడిచేవృక్షం ఈఅనంతుడే"అన్నాడు.భరద్వాజుడు మారుమాట్లాడ కుండా తలవంచి మంత్రికి,అనంతుడికి నమస్కరించి, రెండవప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు.మంత్రి సంజయుడు సైగచేయటం తో భటులు ఓబాలుడిని సభలో మంత్రి దగ్గరకు తీసుకొచ్చారు.ఆబాలుడు పరుగునవెళ్ళి భరద్వాజుడి ఒడిలో కూర్చున్నాడు. "భూమిపై నడిచే చంద్రుడు మీ ఒడిలోఉన్నాడు చూడండి"అన్నాడు మంత్రి.భరద్వాజుడు ఆబాలుని ముద్దుపెట్టుకునిమూడవప్రశ్నకు సమాధానం చూపమన్నాడు. మంత్రి సైగతో భటుడు నీరు ఉన్న పాత్రను తెచ్చాడు.ఆపాత్రలోనినీటిని చూపించి "ఈనీరే భూమి మీద అమృతం"అన్నాడు మంత్రి.భరద్వాజుడు చప్పట్లుకొట్టి తలవంచి మంత్రికి నమస్కరించాడు.సభలో రాజుతోసహా ఎవ్వరికీ,ఏమీ అర్థం కాలేదు.రాజు మంత్రిని అర్థమయ్యేలా వివరించమన్నాడు.మంత్రి చిరునవ్వుతో "మహారాజా!భూమిపై పక్షులు,జంతువులు,కీటకాల వంటి ఎన్నోజీవులకువృక్షం ఆశ్రయమిచ్చి కాపాడుతోంది.అలాగే నిస్వార్థంగా మానవులకు నీడను,గాలిని,తిండిని,ఔషధాలనిచ్చి జీవితాన్నిస్తోంది.వృక్షంలా ఎందరో అనాధలకు నీడను,తిండిని,ఔషధాలను అందిస్తూ ఆశ్రయం కల్పించిన అనంతుడు భూమి పై నడిచే వృక్షమేకదా! ఈ బాలుడు భరద్వాజుడి కుమారుడు.ఎవరి సంతానం వారికి భూమిపై నడిచే చంద్రుడే కదా!కాదని ఎలా అంటాడు?ఒంటిని,ఇంటిని శుభ్రపర్చుకోవాలంటేనీరు కావాలి.జీవులకు నీరే ప్రాణం.నీరులేకుంటే ఈ భూమి మీద ఏ జీవీ బ్రతకలేదు కదా!సకలజీవులకూ నీరే ప్రాణాధారం.అలాంటి నీరు భూమిపై అమృతమే కదా!"అని వివరించాడు మంత్రి "మీరు నా నాలుగ వప్రశ్నకూసమాధానమివ్వాలి.అప్పుడే నా ఓటమి"అన్నాడు భరద్వాజుడు.అడగమన్నాడు మంత్రి సంజయుడు."నేను ఈసభలో ఈమూడు ప్రశ్నలను ఎందుకు అడిగాను? చెప్పండి"అన్నాడుభరద్వాజుడు.మంత్రి చిరు నవ్వుతో "పండితోత్తమా! రాజ్యంలో నిలువనీడలేని ,నా అన్నవారులేని ఎందరో అనాధలు,అభాగ్యులు ఉండవచ్చు.వారినిఆదుకోవటానికి అనంతుడిలాంటి వారు ముందుకురావాలి. లేదా రాజుగారు ఆబాధ్యత తీసుకోవాలనే సందేశం మొదటిప్రశ్న ద్వారా ఇచ్చారు.ఈ బాలుడు మీ కుమారుడు.ప్రతి తల్లితండ్రికి వారి సంతానం నడిచే చంద్రుడే.తల్లిదండ్రులు వారి పిల్లలను తమకుటుంబంలో వెన్నెలనిచ్చేచంద్రుడిలా భావించిముద్దుమురిపాలతోప్రాణంలాపెంచుతారు.పిల్లలు వారితల్లిదండ్రులను వృద్దాప్యంలో అలాగే చూసుకోవాలి.ఈప్రశ్న, ,లోని అంతరార్థం ఇది.నీరు లేకుంటే ప్రాణులు జీవించలేవు.నీరుభూమిపై అమృతం.నీరు వృధాఅవుతోంది.చెరువులు,బావులు త్రవ్వి నీటిని కాపాడుకోవాలి.పొదుపుగా వాడుకోవాలి.ఈసందేశాన్ని మూడవ ప్రశ్నద్వారా ఇచ్చారు.ఈప్రశ్నలద్వారా ప్రజలల్లో ఉత్కంఠ తను,ఆసక్తినిరేకెత్తించి గొప్ప సందేశాలనివ్వడంకోసంఈప్రశ్నలను అడిగారు."అని సమాధానమిచ్చాడు మంత్రి.భరద్వాజుడి ప్రతిభకు,మంత్రి నేర్పుకురాజుతో సహా ప్రజలందరూ ఆశ్చర్యపోయారు.భరద్వాజుడు సభనుండి బయటకొచ్చి ,ఆరాజ్యం మట్టిని తలపై పోసుకుని, సాష్టాంగదండ ప్రణామం చేశాడు.తన ఓటమిని అంగీకరించి మంత్రికి పాదాభివందన చేశాడు.రాజు భరద్వాజుడి ప్రతిభను ప్రశంసించి"పండితోత్తమా!మా రాజ్యప్రజలకు మీప్రశ్నలద్వారా మంచి సందేశాలనిచ్చారు.మా లోపాలను ఎత్తిచూపి,మంచి మార్గాన్ని సూచించిన మీరు ఓడిపోలేదు.గెలుపు మీదే !" అని చెప్పి ఆయన పాదానికి స్వర్ణకంకణం తొడిగి ,ఘనంగా సత్కరించాడు. -డి.కె.చదువులబాబుచరవాణి....9440703716


కామెంట్‌లు