తిండిపోతు శంకరయ్య: డి.కె.చదువులబాబు:-- శివపురంలో శంకరయ్య అనే తిండిపోతు ఉండేవాడు.ఏపనీ చేయకుండా సోమరిగా కూర్చుని తింటూ ఉండేవాడు. గున్నఏనుగులా ఉన్నవాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు వచ్చే వారుకాదు.వాడి తండ్రి రామనాథం జన్మలో వాడు మారడని,పెళ్ళికాదని దిగులుపడేవాడు. ఒకరోజు రామనాథం మిత్రుడు జగన్నాథం పట్నంనుండి వచ్చాడు.మాటల మధ్యలో కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుందంటూ తనకొడుకు విషయం మిత్రుడితో చెప్పాడు రామనాథం.మిత్రుడి బాధ చూసి శంకరయ్యను తనవద్ద చేర్చుకుంటానన్నాడు జగన్నాథం. ఆయనకు పట్నంలో వ్యాపారముంది.శంకరయ్యను మరునాడు తనవెంట తీసుకెళ్ళాడు. శంకరయ్య ఆయనతో "మీరు నన్ను మీదగ్గర పనిలో ఉంచుకుంటానని,డబ్బులిస్తానని నాన్నతో చెప్పారటకదా!నాకు ఏ పనీ చేతకాదు.పట్నం చూద్దామని,ఇక్కడ కొంతకాలం గడుపుదామని వచ్చాను."అన్నాడు."నీకు కష్టమైన పనేదీ చెప్పను.పట్నం చూడా లనుకుంటున్నావుకదా!ఖాళీగా తిరగటమేనీపని.నెలకు రెండువేలరూపాయలిస్తానుసరేనా!" అన్నాడు జగన్నాథం.సరేనన్నాడు శంకరయ్య. జగన్నాథం తనకు రావలసిన బాకీదారుల చిరునామాలిచ్చి బాకీలు వసూలు చేయమన్నాడు."ఇందులో కష్టమేమీ లేదు. బాకీలు వసూలయ్యే వరకూ తిరగటమే!" అన్నాడు జగన్నాథం. పట్నంలో తిరగడమే ఉద్యోగమనేసరికి సంతోషంతో చంకలు గుద్దుకున్నాడు శంకరయ్య. జగన్నాథం పెట్టింది తినడం,భారీకాయాన్ని కదిలిస్తూ బాకీవసూళ్ళకు రోజంతా తిరగటం శంకరయ్య దినచర్య అయింది. ఆరునెలల జీతం ఒకేసారి ఇస్తానని చెప్పి జగన్నాథం శంకరయ్యకు పైసాకూడా ఇచ్చేవాడు కాదు.చేతిలో డబ్బు లేకపోవటం వల్ల శంకరయ్య చిరుతిండ్లు తినటంమూనుకున్నాడు.అలా ఆరునెలలు గడిచింది. జగన్నాథం పెట్టిన భోజనం తప్ప చిరుతిండ్లు లేకపోవటం,రోజంతా తిరగటంవల్ల శంకరయ్య సన్నగా తయారయ్యాడు.తన శరీరాన్ని చూసుకునిసంతోషపడిపోయాడు. అతిగా తినకూడదని,తినే ఆహారంలో కొవ్వుపదార్థాలు చాలా తక్కువవుండేలా చూసుకోవాలని,శరీరానికి వ్యాయామం తప్పనిసరని,భారీకాయం అనర్థమని,సరైన ఆహారం తీసుకుంటూ,వ్యాయమంచేస్తూ, దురలవాట్లకు దూరంగావుండి అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రహించాడు శంకరయ్య. జగన్నాథం శంకరయ్యకు తన కూతురునిచ్చి వివాహంచేసాడు.వ్యాపార మెలుకువలు నేర్పి తన వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నాడు. డి.కె.చదువుల బాబు 9440703716


కామెంట్‌లు