అర్హత( కథ )-డి.కె.చదువులబాబు-- సురభిరాజ్యాన్ని జీవదత్తుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.ఒకరోజు ఆయనకు జలుబు చేసింది.మంత్రిని పిలిచి సువర్ణముఖి హారాన్ని తెప్పించమని కోరాడు.సురభి రాజ్యానికి దక్షిణ దిశలో చిత్రకర్ణవం అనే అరణ్యముంది.అక్కడ కాట్రాయుడనే మన్నెం దొర ఉన్నాడు.అతని వద్ద మహిమాన్వితమైన సువర్ణముఖి హారముంది.ఆ హారాన్ని ఒక మహాతపశ్శక్తిసంపన్నుడైన మునీశ్వరుని ద్వారా కాట్రాయుడు పొందాడు. ఆహారాన్ని ఒక్కరోజు ధరిస్తే ఎలాంటి జబ్బయినా నయమవుతుంది. మంత్రి పంపిన రాజభటులు కాట్రాయుని దర్శించి ,తాము వచ్చినపని చెప్పారు.అదేసమయంలో తన కొడుకుని ఎత్తుకుని వచ్చిన సదానందుడనే వాడు ,ఆపిల్లవాడిని క్రింద పడుకోబెట్టి కాట్రాయుడికి నమస్కరించాడు.అతని కొడుకు వ్యాధిని ఎందరో వైద్యులు బాగుచేయలేక పోయారని తెలుసుకున్న కాట్రాయుడు,తన కులదైవం మెడలో వున్న సువర్ణముఖి హారాన్ని తీశాడు.మహిమాన్వితమైన ఆ హారం రోజుకి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని తెలిసిన రాజభటులు హారాన్ని తమకివ్వమని కోరారు. "రాజుగారి అనారోగ్యాన్ని వైద్యులు నయం చేయగలరు.నయం కాని పక్షంలోవచ్చిహారాన్ని తీసుకెళ్ళండి."అంటూ సదానందుడి కొడుకు మెడలో హారాన్నివేసాడు కాట్రాయుడు రాజభటులు రాజ్యానికి వెళ్ళి ఆవిషయాన్ని జీవదత్తుడికి చెప్పారు.రాజునైన తనను లెక్క చేయక,ఒకసామాన్యుడి మెడలో హారాన్ని వేయటం రాజుకు ఆగ్రహాన్ని కలిగించింది.చివరికి రాజవైద్యుల వల్ల రాజు జలుబు తగ్గింది.అలాంటి విలువైన హారం కాట్రాయుడి దగ్గర వుండే అర్హత లేదని ,అది తనవద్ద ఉండాలని భావించిన రాజు పథకం ప్రకారం మన్నెం దొరను బంధించి,హారాన్ని స్వంతంచేసుకోవాలనుకున్నాడు. జీవదత్తుడు భటులతో కలిసి ప్రయాణమై చిత్రకర్ణవం అరణ్యంలోని కాట్రాయుడి నివాసానికి వెళ్ళాడు. కోయదొర నివాసం లో దేవత మెడలోహారంఉంది.కత్తులు,భరిసెలు,ధనుర్భాణాలు ధరించిన కోయవీరులు చుట్టూ నిలబడి ఉన్నారు. అక్కడ పులిచర్మం పరచబడిన ఎత్తైన ఆసనముంది. ఆపీఠం దగ్గర ఉన్న చెక్కపాన్పు మీద ఓపాప కళ్ళు మూసుకుని పడుకునిఉంది.పక్కనే కాట్రాయుడు ఆకులు నూరుతూ నేలపై కూర్చుని ఉన్నాడు. కోయవీరులు రాజును ఆహ్వానించి ఓ ఆసనం పై కూర్చుండబెట్టారు.కోయదొర చేస్తున్న పనిని గమనించసాగాడు రాజు. అతను నూరిన ఆకు వసరు తీసి పాపకళ్ళల్లో,చెవులలో పోసి,చెంపలపైన,కంఠానికి పసరురాశాడు.తన చేతులను ఆకుల తో తుడుచుకుంటూ,రాజువద్దకొచ్చి నమస్కరించాడు.ఆపాప కాట్రాయుడిమనుమరాలని,జబ్బుతో వున్నపాపకుఅతను పసరు వైద్యం చేసాడని తెలుసుకుని రాజు ఆశ్చర్యపోయాడు.ఎలాంటి జబ్బయినా ఒక్కరోజులో నయంచేసే మహిమాన్వితమైన హారముండగాదాన్ని ఉపయోగించకుండా స్వంతవైద్యంఎందుకు చేశాడో రాజుకు అర్థంకాలేదు.అదే విషయం కాట్రాయుడిని అడిగాడు. "మహారాజా!రెండ్రోజులు ఆలస్యమైనా ఆకుపసరుతో నయ మయ్యే జబ్బుకు హారమెందుకు?హారాన్ని పాపమెడలో వేస్తే రేపు ఈసమయం వరకూ తీయకూడదు.ఈలోగా ఎవరైనా ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతూ వస్తే వారికి ఉపయోగించటా నికి హారముండదు.అందుకే హారాన్ని ఉపయోగించకుండా పసరు వైద్యం చేశాను."అన్నాడు కాట్రాయుడు.ఆరోజు కాట్రాయుడు హారాన్ని రాజునైన తనకివ్వకుండా ,సదానందుడి కొడుకు మెడలో వేయటానికి గల కారణం రాజుకు బోధపడింది.కాట్రాయుడికి విధి నిర్వహణ పట్ల గలఅంకితభావం,సమధృష్టి, సేవాగుణానికి ముగ్దుడైన రాజు,అతనికి మనస్సులోనే జోహార్లుఅర్పించాడు.అర్హత గుణాన్ని బట్టిలభిస్తుం దని ,నిస్వార్థ మైన మంచి ఆలోచనలు కల్గి వుండాలనిగుర్తించాడు.తన దురాలోచనకు స్వస్తిచెప్పి, అతని ఆతిథ్యం స్వీకరించి తన రాజ్యానికి ప్ర యాణమయ్యాడు జీవదత్తుడు.--డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడప జిల్లా 9440703716.


కామెంట్‌లు