*పిచుక - నెమలి రాణి ( జానపద నీతి కథ)* డా.ఎం.హరికిషన్ - 94410 32212-కర్నూలు: -ఒక అడవిలో చాలా పక్షులు వుండేవి. ఆ పక్షులకు నెమలి రాణిగా వుండేది. ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక చిన్న పిచుక వుండేది. అది చాలా చిన్నగా వుండడంతో మిగతా పక్షులు దాని మాటలని లెక్కచేసేవి కావు. కొంచంగూడా విలువ ఇచ్చేవి కావు.ఆ పిచుకకు మూడు చిన్న చిన్న పిల్లలు వున్నాయి. వాటిని అపురూపంగా చూసుకొనేది. ఆ అడవిలో ఒక గద్ద వుండేది. దాని కళ్ళు ఆ పిల్లల పైన పడ్డాయి. ఒకరోజు పిచుక ఆహారం కోసమని బైటకు పోగానే మట్టసంగా ఒక పిల్లను గుటుక్కుమనిపించింది. పిచుక తిరిగి వచ్చి తన పిల్ల కోసం అంతా వెతికింది. కానీ దానికి ఎక్కడా కనబల్లేదు. పాపం అది చానా బాధ పడింది.మరొకరోజు పిచుక ఆహారం కోసం పోయినపుడు గద్ద రెండో పిల్లని గూడా గుటుక్కుమనిపించింది. పిచుక రెండో పిల్ల గూడా కనబడక పోయే సరికి చానా బాధపడింది. ఉరుక్కుంటా.. ఉరుక్కుంటా... నెమలి దగ్గరికి పోయింది. “రాణీ... రాణీ... నా పిల్లలను ఎవరో ఎత్తుకోని పోతున్నారు. కొంచెం విచారించి మిగిలిన ఆ ఒక్క పిల్లనన్నా కాపాడవా" అని అడిగింది. నెమలి ఆ పిచుక మాటలని కొంచం గూడా పట్టించుకోలేదు. “నీ పిల్లలను నువ్వే కాపాడు కోవాలిగానీ... ఇలా అరచి, ఏడిచి ఏం లాభం. ఫో...ఫో... నాకు చానా పనులున్నాయి" అని కసురుకోనింది.పిచుక ఇంటికి పోయింది. బాగా ఆలోచించి ఒక చిన్న బాణం తయారు చేసి చివరన కొశ్శని తుమ్మ ముల్లు చెక్కింది. పక్కనున్న చెట్టు మీద గుబురు ఆకుల మధ్య దాక్కోనింది. తన గూడునే కనిపెట్టుకోని చూడసాగిందికాసేపటికి అక్కడికి గద్ద వచ్చింది. గూటిలో పిచుక లేకపోయేసరికి ఆ ఒక్క పిల్లను కూడా గుటుక్కుమనిపిద్దామని వచ్చి గూటిపైన వాలింది.“దొంగదానా... నువ్వా నా పిల్లలను తింటా వున్నది . ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో" అని కోపంగా ఆ పిచుక సరిగ్గా దాని కంటి మీదకు గురి చూసి బాణం వదిలింది. ఆ బాణం సర్రుమని సక్కగా దూసుకొని పోయి దాని కంటిలో కసుక్కున దిగింది. కన్ను సుర్రుమనే సరికి గద్ద అదిరిపడి లేచి సర్రున పోయి కళ్ళు కనబడక అక్కడే పడుకున్న ఒక గుర్రం మీద పడింది.గుర్రం తనమీద 'ఏం పడిందో ఏమో' అని భయపడి లేచి కంగారుగా ముందుకు ఉరికింది. అదే సమయంలో అక్కడ గింజలు ఏరుకోని తింటావున్న ఒక కాకి గుర్రాన్ని చూసి భయపడి కావు... కావుమంటూ పైకి ఎగిరింది. పైన నెమలి గూడు వుంది. ఆ గూటిలో దాని పిల్లలు వున్నాయి. కాకి చూసుకోక పోయి ఆ పిల్లలను ఢీ కొట్టింది. అంతే... అంత పైనుండి ఆ పిల్లలు ధభీమని కింద పడ్డాయి. ఆ పిల్లలు చానా చిన్నవి కావడంతో వాటికి బాగా దెబ్బలు తగిలినాయి.అది చూసి నెమలి చానా బాధపడింది. కాకిని పట్టుకోని “ఏమే... నీకు కొంచమన్నా బుద్ధుందా... నా పిల్లలను కింద పడగొట్టినావు” అని అడిగింది.దానికి ఆ కాకి “నా తప్పేం లేదు. నా మీదకు వచ్చిన గుర్రాన్ని చూసి భయపడి పైకి ఎగిరా. కాబట్టి తప్పంతా గుర్రానిదే” అనింది.నెమలి గుర్రాన్ని పిలిపించింది. “నీకు కొంచమన్నా బుద్దుందా లేదా... ఎందుకు వేగంగా ఆ కాకి మీదకు పోయినావు” అని అడిగింది.దానికి ఆ గుర్రం “నా తప్పేంలేదు. గద్ద వేగంగా వచ్చి నన్ను ఢీ కొట్టింది. దాంతో భయపడి నేను ముందుకు ఉరికినా, కాబట్టి తప్పంతా ఆ గద్దదే" అనింది.నెమలి గద్దను పిలిపించింది. “ఏమే.. నీకు కొంచమన్నా బుద్దుందా లేదా.. ఎందుకు వేగంగా పోయి పడుకున్న ఆ గుర్రాన్ని ఢీ కొట్టినావు” అని అడిగింది కోపంగా.దానికి ఆ గద్ద “ నా తప్పేమీ లేదు. నేను నా ఆహారం కోసం చెట్టుపైన వాలతా వుంటే ఆ పిచుకే నన్ను బాణంతో కొట్టింది. ఆ భయంతో నేను పోయి కన్నులు కనబడక గుర్రాన్ని ఢీ కొట్టినా. కాబట్టి తప్పంతా ఆ పిచుకదే” అనింది.నెమలి కోపంగా పిచుక దగ్గరికి పోయింది. “నీకు కొంచమన్నా బుద్దుందా లేదా... ఎందుకు ఆ గద్దను బాణంతో కొట్టినావు” అని అడిగింది.దానికి ఆ పిచుక “నా తప్పేం లేదు. అది నా పిల్లలను తినడానికి వచ్చింది. 'నీ పిల్లలను నువ్వే కాపాడుకోవాలి అని నువ్వేగదా చెప్పింది. అందుకే దానిని బాణంతో కొట్టి నా పిల్లలను నేను కాపాడుకున్నాను. అడవికి రాణివయిన నీవు నీతి తప్పి చిన్నదాన్ని గదా అని నా బాధను పట్టించుకోలేదు. కాబట్టి తప్పంతా నీదే" అనింది.నెమలి రాణి నోరు మూసుకోని మట్టసంగా తలవంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది.


కామెంట్‌లు