ఇంటి దొంగ..కథ..జాధవ్ పుండలిక్ రావు పాటిలచరవాణి 9441333315--మహిషా పురం లో ఒక ఉన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. ప్రధానోపాధ్యాయుడు విట్టల ఆచార్యుడు ప్రతి తరగతికి ఒక తరగతి నాయకున్ని నియమించాడు. ఎనిమిదవ తరగతి లో 30 మంది విద్యార్థులున్నారు. ఈ తరగతికి నాయకుడు వినోద్. అప్పుడప్పుడు ఎనిమిదవ తరగతి లో దొంగతనం జరిగేది. ఆ తరగతిలోని విద్యార్థుల పుస్తకం, నోటుబుక్కు, పెన్ను. పెన్సిల్ వంటి వస్తువులు తరుచుగా ఎవరో దొంగిలించేవారు. వస్తువులు పోయిన వారు ఏడ్చేవారు. ఏడ్చే విద్యార్థిని వినోద్ ప్రధానోపాధ్యాయుని వద్దకు తీసుకొని వచ్చేవాడు. పోయిన వస్తువు గురించ వినోద్ ప్రధాన ఉపాధ్యాయునికి చెప్పేవాడు. ప్రధాన ఉపాధ్యాయుడు వినోద్ బ్యాగు తప్ప మిగతా విద్యార్థుల బ్యాగులన్ని వెతికేవాడు. కానీ పోయిన వస్తువు మాత్రం దొరికేది కాదు. వినోద్ ఏడ్చే విద్యార్థిని తెచ్చే వాడు కావున ప్రధానోపాధ్యాయుడీకి వినోద్ మీద అనుమానం వచ్చేది కాదు. ఎక్కడ పారేసుకున్నావో చక్కగా జ్ఞాపకం చేసుకో అని ప్రధానోపాధ్యాయుడు వస్తువు పోయిన విద్యార్థికి అనేవాడు. ఇలా తరగతిలో అనేకసార్లు వస్తువులు పోయేవి. ప్రతిసారి వినోద్ ప్రధానోపాధ్యాయుని వద్దకు రావడం ప్రధానోపాధ్యాయుడు వినోద్ బ్యాగు తప్ప మిగతా విద్యార్థుల బ్యాగు పరిశీలించడం జరిగేది. వస్తువు మాత్రం దొరికేది కాదు. దీనితో ప్రధాన ఉపాధ్యాయుడు ఆలోచనలో పడ్డాడు. తరగతిలోనికి ఎవరు వస్తున్నారు? ఎవరు దొంగతనం చేస్తున్నారు? వస్తువులు ఎక్కడికి పోతున్నాయి? అని ఆలోచించేవాడు. మరి ఒక్క రోజు వస్తూ పోయిన విద్యార్థిని తీసుకొని వినోద్ ప్రధానోపాధ్యాయుడు వద్దకు వచ్చాడు. జరిగిన దొంగతనం గురించి చెప్పాడు. ప్రతిసారి అందరూ విద్యార్థుల బ్యాగులను పరిశీలిస్తున్నాను కానీ వినోద్ బ్యాగును పరిశీలించడం లేదు. ఈసారి వినోద్ బ్యాగును పరిశీలించాలని మనసులో భావించాడు ప్రధానోపాధ్యాయుడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లి అందరూ విద్యార్థులను బయటకు పంపాడు. ఆఫీసుకు వచ్చిన వినోదంను వస్తూ పోయిన విద్యార్థికి సైతం ఆట స్థలానికి పంపాడు. విద్యార్థులందరూ ఆటో స్థలానికి వెళ్లారు. అందరి బ్యాగులు పరిశీలించకుండా ప్రధానోపాధ్యాయుడు వినోద్ బ్యాగును మాత్రమే పరిశీలించాడు. అతని బ్యాగులో ఇంతవరకు తరగతిలో పోగొట్టుకున్న విద్యార్థుల వస్తువులన్నీ కనిపించాయి. వస్తువులన్నీ చూసి ప్రధాన ఉపాధ్యాయుడు. ఆ వస్తువులన్నీ ఆ బ్యాగులో అలాగే ఉంచాడు. వినోదు ను పిలిచాడు చూడు వినోద్! నీమీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే నీకు తరగతి నాయకునిగా చేశాను. నిజం చెప్పు వస్తువులన్నీ ఎలా పోతున్నాయి. నిన్ను నేను ఏమీ అనను అబద్ధం చెప్పవద్దు అంటూ ఆప్యాయంగా పలుకరించాడు. వినోద్ కు భయం పట్టుకుంది. వణికిపోతున్నాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. వస్తువులన్నీ బ్యాగు నుండి తీసి ప్రధానోపాధ్యాయునికి ఇచ్చాడు. ప్రధానోపాధ్యాయుడు తన ఆఫీసుకు వినోద్ ఇచ్చిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాడు. ఆట స్థలం లో ఉన్న విద్యార్థులందరినీ పిలిచాడు. ఇదిగో మీ వస్తువులన్నీ దొరికినాయి. పక్క రూములో కనిపించాయి. జాగ్రత్తగా ఉంచుకోండి. అని చెప్పి ఎవరి వస్తువులు వారికి ఇచ్చివేశాడు. వినోద్ గురించి తోటి విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ప్రధానోపాధ్యాయుడు. ఆ రోజు నుంచి వినోద్ దొంగతనం చేయడం మానుకున్నాడు. తన ప్రవర్తన లో మార్పు తెచ్చుకున్నాడు. దీనితో ఎనిమిదవ తరగతి లో ఒక్క వస్తువు కూడా పోలేదు . నీతి: చెడు అలవాట్లు, దొంగతనాలు చేయడం మంచిది కాదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది.


కామెంట్‌లు