నా బాల సాహిత్య ప్రయాణం-- బెలగాం భీమేశ్వరరావు 9989537835-- 1. రచయిత నవ్వాలన్న కోరిక -నేను 1961- 1962 విద్యా సంవత్సరం లో5 వ తరగతి చదువుతున్న రోజులు. వెలుగు నీడలు సినిమా చూశాను. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో.కాలేజీ స్టూడెంట్ పాత్ర ఆయనిది.కవితలు రాయడం ఆయన హాబీ.హీరో మిత్రులు హీరోను కవీ కవీ అని పిలిచే వారు. ఆ సన్నివేశాలు నా మనసుకు హత్తుకున్నాయి.ఆ సినిమా లోని పాటలు నా కెంతో నచ్చాయి.ఇంట్లో పాడుతుండే వాణ్ణి. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లలచే పాటలు పాడించేటప్పుడు నేను వెలుగు నీడలు సినిమా పాటలు పాడి వినిపించే వాణ్ణి. పాడవోయి భారతీయుడా' 'ఓ రంగయ్యో పూల రంగయ్యో' 'కలకానిది విలువైనది' పాటలు నాకెంతో నచ్చాయి. ఆ పాటలు రచించిన కవి శ్రీ శ్రీ అని ఆయన చాలా గొప్ప కవి అని మా నాన్నగారు ,అన్నయ్యలు చెబుతుండేవారు. మొత్తానికి కవినవ్వాలన్న కోరికను ఆ వెలుగు నీడలు సినిమా నా చిన్న వయసులోనే కలిగించింది. మా ఇంటికి దగ్గర లోనే టౌన్ బ్రాంచ్ హైస్కూల్.అక్కడ 6 నుంచి 8 వరకు తరగతులుండేవి. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.ఆ రోజు ఉదయం ప్రేయర్ బెల్ ఇంకా కొట్టలేదు. మా తరగతి గదిలో నా జాగాలో పుస్తకాలు పెట్టి మేడ మీద గదులకు వెళ్ళాను.మేడ మెట్లెక్కడం దిగడం ఆ చిన్నతనంలో నాకిష్టంగా ఉండేది.రోడ్డు వైపున్న వరండాలోకి పోయి అక్కడి నుంచి వీధి వైపు చూస్తున్నాను. బజారుకు పోయే దారది. వచ్చే పోయే జనంతో సందడిగా ఉంది. ఒక యువకుడు సైకిల్ తొక్కుతూ వస్తుండగా ఒక చిన్న కుర్రాడు దారికడ్డం వచ్చాడు.ముందు చక్రం తగిలి కింద పడ్డాడు. యువకుడు వెంటనే సైకిల్ ఆపి కింద పడిన కుర్రాడిని లేవనెత్తుతున్నాడు. అంతలో పిల్లాడిని వీధి లోకి విడిచిన ఆ తల్లి పరుగెత్తుకు వచ్చింది. ఆమెకు తోడుగా వీధిన పోయే వాళ్ళు వచ్చారు. నీకు కళ్లు లేవా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని సైకిల్ తొక్కుతున్నావా? అని గట్టిగా కేకలు వేస్తూ ఆ యువకుడిని కొట్టినంత పని చేశారు. పాపం ఆ యువకుడు తన తప్పు లేదని ఎంత మొత్తుకున్నావినరు.పడిపోయిన కుర్రాడు చక్కగా ఇంటికి పారిపోయాడు.చేయని తప్పుకు ఆ యువకుడు ఆ మాటలు కాసి సిగ్గుతో తల వంచుకొని పోయాడు.ఆ సంఘటన కథగా రాయా లనిపించింది నాకు.' నిరపరాధి ' ఆని కథ పేరును కూడా నిర్ణయించేశాను. అంతలో ప్రేయర్ బెల్ వినిపించింది.గబ గబ కిందకి దిగి ప్రేయర్ గ్రౌండ్ లోకి వచ్చి నా వరుసలో నిలబడ్డాను.ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి చేరాక మనసులో కథ రాయాలన్న అలజడి ఆరంభమయింది.ఎవరి కంటా పడకుండా 10 వాక్యాలలో కథ తయారు చేశాను. సిగ్గో భయమో నాకప్పుడు తెలియదు. కథను మాత్రం ఎవరికీ చూపలేదు. చదువు మాని కథ రాసుకొనిఉంటావా అని నాన్నగారు తిడతారని భయం.వారం రోజుల తరువాత కథ ఉన్న కాగితం కనిపించ లేదు. అలా నా మొదటి రచన కాలగర్భంలో కలిసిపోయింది.(సశేషం)


కామెంట్‌లు