జయకాంతన్ అభిమానిని--తమిళ రచయితలలో జయకాంతన్ అంటే నాకు పరమ ఇష్టం. ఆయన రచనలు ఆలోచనలో పడేస్తాయి. ఆయన కథ నడిపే తీరే వేరు. ఊహకందని మలుపులుంటాయి. ఆయన మాట్లాడిన సభలకు రెండు మూడు సార్లు హాజరయ్యాను. ఆయనను చూడటంకోసమే వెళ్ళాను, అంతేతప్ప ఆయన మాటలకోసం కాదు. కనుక ఆయనను నేరుగా చూశానన్న ఆనందం ఇప్పటికీ అలానే ఉంది. ఓరోజు జయకాంతన్ ని ఇంటర్వ్యూ చేయడానికి ఓ పత్రికా విలేకరి ఆయన ఇంటికి వెళ్ళారు. అప్పుడాయన లుంగీ మీదున్నారు. చొక్కా వేసుకోలేదు. మీరు షర్ట్ వేసుకొస్తే వీడియో తీసుకుంటాం అన్నారు విలేకరి. అప్పుడాయన "నా చొక్కా గదిలో మేకుకి తగిలించి ఉంది. కావాలంటే దానిని ఫోటో తీసుకుండి. కాదు నా మాటలు కావాలనుకుంటే ఇలానే ఉంటాను. మాట్లాడుకుందాం. షర్టయితే వేసుకోను. మీ ఇష్టం" అన్నారు. దాంతో విలేకరి మరో మాట మాటాడక ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు.ఓరోజు ఎంజీఆర్ ఫోన్ చేశారు. అప్పుడు జయకాంతన్ కొడుకు రిసీవర్ తీసుకుని "నాన్నా ఎంజిఆర్ ట. మీతో మాట్లాడాలట" అన్నాడు. జయకాంతన్ ఫోన్ అందుకుని "చెప్పండి, జయకాంంతన్ మాట్లాడుతున్నాను" అన్నారు."ఈరోజు ఏడు గంటలకు కలవండి" అన్నారు ఎంజిఆర్. అప్పుడు జయకాంతన్ "అబ్బే టైమ్ కుదరదండి. నేను ఏడు గంటలకి నా మిత్రులతో పార్టీలో ఉంటాను" అని ఫోన్ పెట్టేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒకరు ఎంజిఆరండి, ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనతో టైమ్ లేదని చెప్పేసారేంటీ అని అడిగారు. అప్పుడు జయకాంతన్ "ఆయనకు నాతో పని గానీ నాకాయనతో పని లేదుగా. అయినా నాకప్పుడు పార్టీ ఉంది. ఉన్న మాటే చెప్పాను" అన్నారు.మరుసటి రోజు ఎంజిఆర్ అయిదు లక్షల రూపాయలతో జయకాంతన్ ఇంటికి వచ్చారు. మీకీ డబ్బులు దేనికైనా ఉపయోగపడతాయి. కాదనక తీసుకోండి అన్నారు ఎంజిఆర్. కానీ జయకాంతన్ "అబ్బే, నాకెలాంటి కష్టమూ లేదు. ఈ డబ్బులతో నాకెలాంటి అవసరమూ లేదు" అని ఆ అయిదు లక్షలు తీసుకోవడానికి తిరస్కరించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఎంజిఆర్ ఆ డబ్బుని వెనక్కు తీసుకెళ్ళిపోయారు.అలాగే ఆయన పుట్టినరోజు నాడు ఓ ధనవంతుడు తన భార్యతో వచ్చి ఓ వెండి ట్రే నిండా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు ఇవ్వగా తనకక్కర్లేదని కచ్చితంగా చెప్పి పంపించేశారు.ఓమారు ఏడుగురు మిత్రులతో కలిసి జయకాంతన్ ఓ అటవీ ప్రాంతంలో పర్యటించారు. చీకటి పడుతున్న వేళ. ఒకరిద్దరు తమకు భగత్ సింగ్ గురించి చెప్పమన్నారు. అలాగేనని జయకాంతన్ దాదాపు గంటన్నరసేపు భగత్ సింగ్ గురించి ఆ ఏడుగురికీ ఆ అడవిలో చెప్పడం మరచిపోలేనని బవా చెల్లదురై అనే ఆయన అన్నారు. ఓరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, మరికొందరు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్న వేదికపై జయకాంతన్ ని మాట్లాడమని పిలిచారు. అప్పుడు జయకాంతన్ "ఈ వేదికపై నేను నమస్కారం పెట్టేటట్లుగా ఎవరూ లేరు. కానీ ఓ తమిళుడు ఎదురైనప్పుడు మరొక తమిళుడు నమస్కరించడం ఓ ఆనవాయితీ అని, ఆ ఆనవాయితీకి భంగం కలిగించడం ఇష్టం లేదు కనుక వేదికపైనున్న పెద్దలకు వందనం అని తన ప్రసంగం కొనసాగించారు. అయితే నాటి కార్యక్రమంలో మాట్లాడిన కరుణానిధి ఓ ప్రముఖ రచయితగా తమకు జయకాంతన్ కావాలంటూ నమస్కరించారు.తన తీరుతెన్నులు తెలియని వారు తనకు పొగరని అంటారు. కానీ నఆ వసరంగా వంగి వంగి సలామ్ చేసేవిధంగా మారిపోయిన సమాజంలో తాను అందుకు భిన్నమని, కానీ అర్థం చేసుకోలేనివారికి తనను గర్విష్టిగా చెప్తారు. కానీ వాళ్ళలా అనుకుంటే తానేమీ చేయలేనని, తన సహజ వైఖరిని ఎవరి కోసమో మార్చుకోబోనని జయకాంతన్ స్పష్టం చేశారు. తనను చూడటానికి వచ్చే రిక్షా కూలీలతో ఆటో డ్రైవర్లతో శ్రామికులతో జయకాంతన్ చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు