అత్యాశ--అనగనగా ఓ రోజు ఉదయం రాజు కోటలో అటూ ఇటూ నడుస్తుండగా వీధిలో ఒకడు వేగంగా పరుగెత్తడం చూశాడు. అతను ఏదో ఆందోళనలో ఉన్నట్లు అనిపించి రాజు భటులను పిలిచి అతనిని తీసుకు రమ్మంటాడు. భటులు వెళ్ళి అతనిని రాజు దగ్గరకు తీసుకొస్తారు."ఎందుకు కంగారుగా పరిగెడుతున్నావు" అడుగుతాడు రాజు. "రాజా! ఉత్తర దిక్కున ఓ రోడ్డు పక్కన ఓ రాయుంది. దాని కింద ఓ రెండు నాణాలు దాచాను. అవి తీసుకుని ఈరోజు పుట్టింరోజు చేసుకుంటున్న నా భార్యకు ఏదైనా ఓ కానుక కొనివ్వాలి" అంటాడు. "ఆ రెండు నాణాలు కోసం పోతున్నావా? వాటిని వదిలేసే. నేను నీకు పది నాణాలిస్తాను. అవి తీసుకుని వాటితో ఏదైనా కొనివ్వు" చెప్తాడు రాజు. "మీరు పది నాణాలివ్వడం సంతోషమే. కానీ ఆ రాతి కిందున్న రెండు నాణాలు తీసుకుంటే పన్నెండు నాణాలవుతాయిగా" అంటాడు అతను."ఇదిగో నీకే చెప్తున్నా. దాని సంగతి మరచిపో. నీకు యాభై నాణాలు ఇస్తాను. తీసుకో" చెప్తాడు రాజు. కానీ అతను మళ్ళీ ఆ రెండు నాణాలకోసం వెళ్తానంటాడు. రాజు "వంద నాణాలు ఇస్తాను. వాటి సంగతి మరచిపో" అంటాడు.అప్పటికీ అతను "కాదు రాజా! ఆ రెండు నాణాలు తీసుకునే ఇంటికెళ్తాను" అంటాడు.దాంతో రాజుకి చెడ్డకోపం వచ్చి ఎలాగో అణచుకుని "నీకు సగం రాజ్యం ఇస్తాను. కానీ ఆ రెండు నాణాల సంగతి మరచిపో" అని చెప్తాడు.అప్పుడతను "రాజా! మీరు సగం రాజ్యం ఇవ్వడం సంతోషమే. కానీ ఓ విజ్ఞప్తి" అంటాడు."ఏమిటీ" అడుగుతాడు రాజు."ఏంటంటే, నేను దాచుకున్న ఆ రెండు నాణాలు ఉండే బండరాయి నాకివ్వదలచుకున్న అర్ధ రాజ్యంలోకి వచ్చేట్టు చూడండి" అని అంటాడతను. దాంతో రాజుకి ఒళ్ళు మండి నీకసలు ఒక్క నాణమూఇవ్వను. పో ఇక్కడ్నుంచి" అని గట్టిగా అరుస్తాడు.రెండు నాణాల మీది అత్యాశతో అతను చివరికి రాజు దగ్గర చిల్లిగవ్వ కూడా పొందలేక ఉత్త చేతులతో బయటపడతాడు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు