చైనా జపాన్ ప్రసిద్ధ కథలు అనువాదకుడు - సూరాబత్తుల సుబ్రహ్మణ్యం--ఈ కరోనా కాలంలో మంచి తెలుగు కథల పుస్తకం సజెస్ట్ చేయమని మిత్రులు చాలాకాలంగా అడుగుతున్నారు. వారి కోసం 'దక్షిణ భాషా పుస్తక సంస్థ [Southern Languages Book Trust]' 1960లొ ప్రచురించిన 'చైనా జపాన్ ప్రసిద్ధ కథలు' అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.ఈ కథల పుస్తకంలో చైనా, జపాన్ దేశాలకు చెందిన చెరి నాలుగు కథలు, మొత్తం ఎనిమిది కథలున్నాయి. ఏ కథా మనల్ని నిరాశ పరచదు. అన్నీ విడిచిపెట్టకుండా చదవాల్సిన కథలే. కథలకు తగ్గట్టుగా కవర్ పేజీ మీద "విలక్షణ ఘటనా శిల్పాలుగల ఎనిమిది కథలు" అని రాశారు. అందుకు తగినట్లుగానే ఇందులోని కథా వస్తువులు, వాటి శిల్పం అన్నీ విలక్షణమైనవే.ఉదాహరణకు 'పెద్ద పులిగా మారిన పెద్ద మనిషి' కథ ఒకవైపు వ్యంగ్య ధోరణితో ఆసక్తిగా ఉండి మరోవైపు అందులోని గూడార్థం భొదపడుతూ ఉంటుంది. 'పవిత్ర జీవనం' అన్న కథ మారుతున్న జీవన పరిస్థితులకి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్న ఒక స్త్రీ కథ. ఈ కథని రచయిత పేరు లేకుండా 'పుక్కిటి కథ' అని ప్రచురించారు. మనం 'పుక్కిటి కథ' అనే పదాన్ని వినే చాలాకాలం అయి ఉంటుంది. అలానే ప్రసిద్ధ జపాన్ సాహిత్యవేత్త 'షిగా నోయా' రాసిన 'హాన్ చేసిన నేరం' అనే కథ మనల్ని వెంటాడుతుంది. ప్రతి పదాన్ని ఏర్చి కూర్చిన ఈ కథలో హాన్ తన భార్యని ఎందుకు, ఎలా హత్య చేసాడో వివరిస్తూ చివరికి న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో అని చదువరులకు ఆసక్తిగొలుపుతుంది. ఇలా ఇందులోని కథలన్నీ విలువైనవే.పఠన ప్రియులు చదవాల్సిన మంచి అనువాద కథల పుస్తకమిది--మీ అనిల్ బత్తుల


కామెంట్‌లు