మానేరు ముచ్చట్లు--ఇన్ని ముచ్చట్లు రాస్తానని అను కోలేదు మొదట్లో.ఏవో కొన్ని ముఖ్య విషయాలు చెప్పి అసలు చరిత్రలోకి వద్దామనుకున్నా. కానీ యాదుల దొంతర ఒకదాని వెంబడి ఒకటి పుట్టుకొస్తున్నాయి.దానికి తోడు పాఠకుల స్పందనలు మరింత ప్రోత్సాహం కలిగిస్తున్నాయి.నిన్న మా తెలుగు పండితులు, వేద మూర్తులు మధు రామమూర్తి గారి తండ్రి మహాదేవ ఘనాపాఠి మమ్మల్ని సాయం కాలాలు కూచోబెట్టి మాకు శ్లోకాలు అవీ ఇవీ నేర్పారని చెప్పాను.అది అటు కొన సాగుతుండగా గుంటూరు నుండి లూథర్ బెన్ని సారు,తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుండి వేమూరి వేంకటప్పయ్య సారు కాస్తా అటూ ఇటూగా పెద్దబడికి కొత్తగా వచ్చారు.నేను ఈ లోగా అంగట్ల బడిలో ఐదు పూర్తి చేసుకుని ఆరవ తరగతి పెద్దబడిలో చేరాను. లూథర్ బెన్ని సారు మాకు ఇంగ్లీషు చెప్పేవారు.అప్పటి వరకు This is Rama, That is Sitha ఫోర్ లైన్ చూచిరాత కాపీలో రాయటమే తప్ప లెస్సన్స్ ఉండేవి కావు. లూథర్బె న్ని సారు గుంటూరు యాస. ఆయన మాకు ఇంగ్లీషుచెప్పేవారు.ఆయన తెలుగర్థమవటమే కష్టమంటే ఇంగ్లీషు అర్థమవటం ఇంకా కష్టం. కొన్ని పదాలకు అర్థాలు తెలిసేవి కాని వాక్యాలు తికమకగా ఉండిఇబ్బందిగా ఉండేది.నా తెలుగు గురించి బాపుకు భరోసా గనుక అప్పట్లోకూడా ఆంగ్లభాషకున్న ప్రాధాన్యతను గుర్తించి లూథర్ బెన్నీ సారు దగ్గరికి ఇంగ్లీషు ట్యూషన్ కు పంపించేవారు.రామమూర్తి సారిల్లు,లూథర్ బెన్ని సారిల్లు దగ్గర దగ్గరే.కనుక కొంత సేపు ఇక్కడ,కొంత సేపు అక్కడ కూచుని ఇక్కడ శ్లోకాలు,అక్కడ గ్రామర్ నేర్చుకు న్నాను.శ్లోకాలు వల్లె వేసాను గనుక కొన్నిగుర్తున్నాయి. ఇంగ్లీషు గ్రామరు ఏం నేర్చాననేది గుర్తు లేదు.కాని ఆయన వేసిన బీజాలు మాత్రం తర్వాత కాలానికి ఉపయోగ పడ్డాయి.ఆయన నేను ఏడవతరగతికి వచ్చిన తరువాత క్లాస్ టీచరు గా ఉన్నారు.కానీ ఆయన కొంతకాలమే పనిచేసి ఆంధ్రావైపు బదిలీ చేయించుకుని వెళ్లినట్లున్నారు.బస్టాండుకు పెద్ద గైనికి మధ్య అప్పట్లో పద్మశాలీల ఇండ్లుండేవి.అవి బహుశః ప్రభుత్వం కట్టించిన ఇండ్లనుకుంటా అన్నీ ఒకే లాగా ఉండేవి.ఆ ఇండ్ల యజమానుల కు ఊళ్లో ఇండ్లుండటంతో ఈ ఇండ్లను ఊరికి కొత్తగా వచ్చిన సార్లకు కిరాయకిచ్చే వారు.లేదా చదువుకునేందుకు వేరే ఊరునుంచి వచ్చిన విద్యార్థులకు ఇచ్చేవారు.బాపయ్య సారున్నప్పుడు ఆయన కూడా అందులో ఒక ఇంట్లో ఉండేవారు. పార్థసారథి సారది అదే ఊరయినా బడికి దగ్గరగా ఉండాలని బడి ఎదురుగా ఉన్న క్వార్టర్ లో ఉండేవారు.రాధాకిషన్ రావు సారు,లూథర్ బెన్ని, రామమూర్తి సారులా చాల మంది ఆ ఎదురుగా ఉన్న ఇళ్లల్లో ఉండే వారు.ఒక్క వెంకటప్పయ్య సారు మాత్రం బస్టాండుకు ఆగ్నేయంలో ఉన్నదొరగారింట్లో ఉండేవారు.లూథర్ బెన్ని తరువాత నా ట్యూషన్ వెంకటప్పయ్య గారి దగ్గరికి మారింది. అప్పటికి మెల్లగాఎనిమిదికి వచ్చాను. ఆయన నాకు జే.వి.రమణయ్య గ్రామర్ చెప్పేవారు. మీకో ముఖ్య విషయం చెప్పాలి.ట్యూషన్ అంటే నెల కాగానే చేతిలో డబ్బులు పెట్టేట్యూషన్ కాదు.నేను వెళ్లినప్పుడు, వాళ్లకు తీరిక గా ఉన్నప్పుడు నడిచిన ఐచ్ఛిక ట్యూషన్లు మాత్రమే.కాకపోతే వాళ్లకు బజారుకు వెళ్లి వస్తు వులు తెచ్చివ్వడమో మంచి నీళ్లో, ఉప్పు నీళ్లో తెచ్చివ్వడం లాంటి బంటు పనులు చేసేవాణ్ని.ట్యూషన్ కంటే అదే ఎక్కువ ఇష్టమనిపించేది.వెంకటప్పయ్య సారింట్లో మరో ఆకర్షణ ఏమిటంటే అప్పుడే రేడియోకు మరో రూపమైన ట్రాన్సిస్టర్ ఉండేది. అదున్న వాళ్లు ఇప్పుడు ఐఫోనున్న వాళ్ల లాగా అన్న మాట.వేంకటప్పయ్య గారి తల్లి గారిని బామ్మగారనే వాళ్లం.బోడితలపై కొంగు కప్పుకుని అప్పుడప్పుడూ ఆమె అంగడికి వెళ్తే ఆమెకు తోడుగా నేనూ వెళ్లేవాణ్ని.ఆమె అలా అబ్బీ అంటూ సాగదీసే తూగోజిల్లా యాస ఊరి వాళ్లకువినోదం.సారు మంచి గాయకులు. రేడియోలో లలిత గీతాలు పాడేవా రు.ఆయన స్కూల్లో పాటల పోటీలు నిర్వహించి నప్పుడు న్యాయనిర్ణేతగావ్యవహరించేవారు. ఆయనను సభల్లో పాడమంటే దేశభక్తి గీతాలు పాడేవారునాకు పల్లవి మాత్రం ఒకటి గుర్తుంది.పడాల రామారావు రచన అది‘ఉప్పొంగి పొంగరా ఓ భరతవీరా భారత స్వాతంత్ర్య సమర రంగాన...........ఇంకా ఏదో లైను తర్వాత రాణిరుద్రమ రౌద్ర రోషానల జ్వాల అని పాడుతుంటే ఒళ్లు గగుర్పొడిచేది.ఆయన కూడా ఒకటి రెండేండ్లు పని చేసి వెళ్లి పోయారు.ఆయనను మళ్లీ కలుస్తా ననుకోలేదు.కానీమ్మత్తుగా బంధువుల పెళ్లికి రాజమండ్రి వెళితే పెళ్లవారి బంధు వర్గంలో ఒకరిగా కన్పించారు. నేనే గుర్తు పట్టి పలుకరించి పరిచయం చేసుకున్నాను. కాకినాడలో సెటిలైనట్లు చెప్పారు.ఇది జరిగి ఇరవయేళ్లు దాటింది.అయితే ఆయన అద్దెకున్నది దొరగారింట్లో అని చెప్పాను గదా!ఆయన గురించీ కొంత చెప్పాలి. వెలమవారిని దొరలను పిలువటం తెలంగాణాలో ఉన్న అలవాటు.అలాగేమా ఊరిలో ఉన్న ఏకైక వెలమ కుటుం బం చీటి రామారావు దొరదే.ఆయన ఆ ఊరికి దాదాపుగా ఆయన ఊళ్లో ఉన్నన్ని రోజులు పంచాయితి బోర్డు ప్రెసి డెంటే.మాకు రాంరావు మామ అని పిలువటం అలవాటు.అప్పట్లో ఊళ్లో ఉన్న ఇల్లు కూలిపోతే ఊరి బయట,బస్టాండు దగ్గర కొత్త బంగ్లా కట్టుకున్నారు. వెంకటప్పయ్య సారు రాకముంద ఎన్నో సార్లు బాపు పనిమీద పంపిస్తే వచ్చేవాణ్ని.వేంకటప్పయ్య సారుకు వారింట్లో వసతి కుదిర్చింది కూడా బాపే.ఆయన పెద్దమ్మాయి అక్క క్లాస్ మేట్.అబ్బాయి ప్రకాశ్ నాకంటే ఒక సంవత్సరం వెనుక.మిగతా ఇద్దర మ్మాయిలు తమ్ముళ్ల క్లాస్ మేట్లనుకుంటా తరువాత బాపు కూడా వాళ్ల ఇంటి దగ్గరి స్థలంలో ఇల్లు కట్టారు.వేంకటప్పయ్య సారు వెళ్లిన తరువాత అప్పుడప్పుడూ వాళ్లింటికి వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాసపత్రిక తెచ్చుకుని చదివి ఇతిచే వాణ్ని.అప్పట్లో మిహిరకులుడు ధారావాహిక చదివిన జ్ఞాపకం.అలా ఒకసారి అందులో ఒక నాటిక పడితే ఆ నాటికను నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా మిత్రులతో నేనే దర్శకత్వం చేపట్టి హీరోయిన్ గా కూడా వేసి స్కూల్లోప్రదర్శించాను.అది రెండవ సారి ఆడ వేషం వేయటం.చైనా యుద్ధం నేపథ్యం కలిగిన నాటిక దాని అసలు పేరు రాజహంస ఐతే శాంతి కపోతం అని మార్చి వేశాను.అంతా బాగానే జరిగింది కానీ చివర్లో ఒక చిన్న పాత్ర స్టేజి మీదకు రాకుండానే నాటిక ముగిసింది.అలా దొరగారింటికి బాపుతో కూడా వెళ్లి వాళ్లు ముచ్చట్లాడుకుంటుంటే వినే వాణ్ని. బాపు ఆయన మంచి మిత్రులు. అప్పట్లో రామారావుగారి అన్న చీటి ముత్యం రావు కరీంనగర్లో పేరుమోసిన వకీలు.రామారావుమామ కుమారుడు ప్రకాశం రావు లెక్చరరుగా హైదరాబాదులో స్థిరపడ్డారు.రామారావు మామ మొదటి సారిఎన్నికైన పంచాయితీ ప్రెసిడెంట్ కాగా,అంతకు మునుపు పంచాయితీ వ్యవస్థ ఏర్పడ్డ తొలినాళ్లలో కొన్ని నాళ్లు అడ్హాక్ప్రెసిడెంటుగా పని చేసిన వల్లంపట్ల మురళయ్య మామది మా పాత ఇంటి ఎదురుంగ ఇల్లే.ఆయన చదువుకోక పోయినా తెలివి తేటలు మాత్రం అమోఘం.వ్యవహార జ్ఞానం తెలిసిన వాడు.వాళ్ల ఇంటిపేరు చెరకు కానీ వల్లం పట్ల నుండి ఇల్లుంటం(ఇల్లరికం) రావడంతో అందరూ ఆయనను వల్లంపట్ల మురళయ్యగారనే పిలిచేవారు.పౌరోహిత్యం వ్యవసాయం రెండూ చేసేవారు.ఆయన లోని విశేషమే మిటంటే ముచ్చట్లు లేదా కబుర్లు ఆసక్తికరంగా చెప్పేవారు.ఇంతవరకు కూడా ఆయన లాగా కుతూహలం రేకెత్తించే విధంగా కబుర్లు చెప్పేవారు నాకు తారసపడలేదంటే నమ్మండి.ప్రతిరోజు సాయంత్రం ఎప్పుడవుతుందా ఇంటిముందర సిమెంటు గద్దె మీద కూచుని మురళయ్య మామ,బాపుఎప్పుడు కబుర్లు మొదలు పెడతారాఅని టీవీ లో ప్రసారమయ్యే సీరియల్ కోసం ఎదురు చూసేవాణ్ని.నా మీద ఆయన ప్రభావం చాలా ఉంది.అందుకే ముచ్చట్లంటే చాలా ఇష్టం ఇప్పటికీ.అమెరికా వెళ్లినపుడు ఒక గ్రథాలయంలో పిల్లలందరనీ కూరిచో పెట్టికథలు చెబుతుందొకామె.మా అమ్మాయినడిగాను ఏమిటని.పిల్లలనుప్రత్యేకంగా తీసుకొస్తారు ఈ స్టోరీ టెల్లింగ్కో సం అని.నాకు వెంటనే మురళయ్య మామ గుర్తుకు వచ్చాడు.మనసులో అనుకున్నా మామా యూ ఆర్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్ అని.ఆయన పెద్దకొడుకు బాపురావు నా స్నేహితుడు.వాళ్లది చాలా పెద్ద ఇల్లు కనుక మా ఇండోర్ గేమ్స్అంటే దాగుడు మూతలు వాళ్లింట్లోనే.మిగతా ఆటలు మా కామన్ వాకిట్లోబాబురావు హైదరాబాదు విద్యుత్సౌధలో పనిచేసేవాడు.ఇప్పుడు లేడు.వాళ్ల కమిడియన ప్రభాకర్ గోదావరి శనిలో సెటిలయ్యాడు.ఫోటో పంపించమంటే పంపించాడు. పార్థసారథి సారు తరువాత ఆయనంతటి గొప్ప ఉపాధ్యాయులు మాకు విజ్ఞాన శాస్త్రం బోధించిన కడార్ల లక్ష్మీరాజం సారు గురించి రేపటి ముచ్చట్లలో.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు