అమ్మను మర్చిపోతే కదా! అమ్మను మర్చిపోతే కదా! గుర్తుకు తెచ్చుకోవలసింది అనుదినం అనుక్షణం అమ్మ మధుర జ్ఞాపకాల జడిలో తడిచి ముద్దయిపోతూ వుంటే అమ్మను మర్చిపోతే కదా! గుర్తుకు తెచ్చుకోవలసింది అనిర్వచనీయ రాగామాలాపించి నన్నీ లోకానికి ప్రేమగా ఆహ్వానించి నవమాసాలు మోసి, బాధల జయించి అలవికాని వేదన పంటి బిగువున భరించి భూమ్మీదకు పువ్వులాగా పదిలంగా దించి కన్ను తెరవక ముందే చన్ను నోటి కందించి కందిపోతానని కింద మెత్తని అరచేతులనుంచి పొద్దస్తమానం నా సేవలోనే తరించి పరవశించి పెంచి పెద్దవాడిని చేసిన అమ్మను మర్చిపోతే కదా! గుర్తుకు తెచ్చుకోవలసింది! ప్రధమంగా నేను కనుతెరిచి చూసినపుడు ప్రపంచమంటే ఒక గుండ్రని రూపు ఆశ్చర్యం ఆనందం కలగలసి ప్రసరిస్తున్న ఓ చల్లని చూపు బోర్లా పడినప్పుడు, దోగాడినప్పుడు మోకాళ్ళపై ముందు కురికినప్పుడు సందర్భం ఏదైనా అమ్మది అవధి లేని సంతోషం నా కాళ్ళ మీద నేను లేచి మొదటిసారి నిలబడినప్పుడు అమ్మకదో అద్భుతమైన వింత అంబరమంటిన ఆనందం ఆరోజు అమ్మ స్వంతం తడబడే అడుగులతో బుడిబుడి నడకలతో తూలి కింద పడబోతే ప్రపంచం తలకిందులైనట్టు అమ్మా! అని వాళ్ళమ్మను తల్చుకొని అరిచింది ఆపదలో అమ్మా! అనడం నాకపుడే నేర్పించింది నిజాయితీగా చెప్తున్నా అమ్మదినం అనగానే నాకు మా అమ్మ చనిపోయిన దినం గుర్తుకొస్తుంది కళ్ళనిండా నీళ్ళు నిండి నా కళ్ళలో కొలువుండే అమ్మ రూపం మసకబారుతుంది అమ్మను మర్చిపోతే కదా! గుర్తుకు తెచ్చుకోవలసింది -దాసరి వెంకటరమణ


కామెంట్‌లు