ఏల్చూరి మురళికి పద్యమంటే మక్కువ: -"బాలకవి" ఏల్చూరి మురళీధర్ కి పద్యాలంటే చిన్నప్పటి నుంచీ మక్కువెక్కువ. ఆయన పద్యరచనకై కృషి చేస్తున్న రోజులలో ఎస్.ఎస్.ఏల్.సి (శ్రీ రామకృష్ణామిషన్ హైస్కూలు, టీ.నగర్, మద్రాసు) లో ఉండగా శ్రీ రామకృష్ణ మఠంలో ఒకప్పుడు విద్యార్థులకుగాను "శ్రీ వివేకానందస్వామి చికాగో నగరంలో చేసిన ప్రసంగం" తెలుగుసేతను అప్పగించే పోటీ ఒకటి జరిగింది. ఈ పోటీలో చాలా మంది పాల్గొన్నారు. ఈ పోటీలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఏల్చూరి మురళి ఈ కింది పద్యాన్ని చదివారు.... *కచ్ఛపీదివ్యనాదసంకాశ మంద్ర* *మధురగంభీర భవదీయ మాననీయ* *విశ్వసంభావనీయ వాగ్విభవవిదిత* *మోహనాకారమునకు నమోనమోస్తు* అప్పుడు న్యాయనిర్ణేతలు, "ఇది ఎక్కడిది?" అని అడిగారు."ఇది శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారు విరచించిన వివేకానంద చరిత్రంలోనిది" అని మురళి చెప్పారు. అక్కడున్న పెద్దలందరూ ఎంతగానో సంతోషించారన్న విషయాన్ని మురళి నాతో పంచుకున్నారు. తనకు బహుమతి లభించిన ఉదంతం ఎంతో ప్రేరణనిచ్చిందని ఏల్చూరి గుర్తు చేసుకున్నారు.మురళి ఈ మాట అంటుంటే ఎంతో ఆనందమేసింది. మా నాన్నగారిని మరొక్కమారు ప్రత్యక్షం చేసిన మురళికి అభివందనం!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు