చలం సమాధికి పుష్పాంజలి---రెండు రోజుల క్రితం ఓ పెద్దాయనతో చలంగారి సమాధికి నాకు పరిచయమున్న మాధవీలత అనే అమ్మాయి నెలనెలా అందులోనూ పౌర్ణమి రోజున శుభ్రంచేసి పుష్పాంజలి చేస్తుందని చెప్పగానే "అబ్బే, చలంగారేమన్నా గొప్ప మనిషా? ఆయన సమాధికి నమస్కరించడం దండగమారి పని" అని ఏవేవో అంటుంటే చిర్రెత్తుకొచ్చింది. ఆయన డెబ్బయ్ అయిదేళ్ళు. వయస్సుకు మర్యాద ఇవ్వాళన్న ఒకే ఒక్క కారణంతో నేను ఆ తర్వాత చలంగారి గురించి ఆయనతో మాట్లాడటం మానేశాను. మాధవీలత ఓ విచిత్రమైన అమ్మాయి. చలంగారిని చూసిన అమ్మాయి కాదుగానీ చలం పుస్తకాలలో ఆయనను చూసిన కొందరి పేర్లను మనసులో నమోదుచేసుకుని వారినైనా కలిసి ఆనందాలించాలనుకుంది. ఆ క్రమంలోనే నన్నూ కలిసింది. గతంలోనూ చెప్పాను. ఇప్పుడు సందర్భం కనుక మళ్ళీ చెప్తున్నాను. మా మూడో అన్నయ్య ఆంజనేయులుకి చదువు సరిగ్గా రాలేదని చలంగారింట విడిచిపెట్టొచ్చారు మా నాన్నగారు. వాడు నాలుగేళ్ళు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వాడిని ఇంటికి రమ్మంటే రానన్నాడు. కానీ ఆ మాటలూ ఈ మాటలూ చెప్పి వాడిని ఇంటికి తీసుకొచ్చి మద్రాసులోని టీ.నగర్ కేసరి హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ గట్టెక్కించేలా చేశారు. వీడిని చూడటం కోసం మాధవీలత నన్ను కాంటాక్ట్ contact చేశారు. వాడు మద్రాసులో ఉన్నాడని చెప్పాను. అయినా నన్ను ఇంటికొచ్చి కలిశారు. చలంగారి విషయాలు మాట్లాడుకున్నాం. చలంగారి లేఖకుడిగా ఉండిన చిక్కాల కృష్ణారావుగారిని కలవడానికి అత్తిలి వెళ్ళొస్తుండేవారు. ఆయనను నాన్న అని పిలిచేది. మాధవీలతకు పౌర్ణమిరోజున తిరువణ్ణామలై చేరుకుని గిరిప్రదక్షిణ చేయడం, చలంగారి సమాధిని శుభ్రం చేసి పువ్వులు అర్పించి నమస్కరించి రావడంలో నిజమైన ఆరాధన ఉంది. ఆ అమ్మాయి మాటల్లో చలంగారిపై ఆమెకున్న భక్తిభావం తొణికిసలాడుతుంది. కనీసం ఈ విధంగానైనా చలంగారిని చూడగలుగుతున్నానని చెప్తుంటుంది. నాకు చలంగారి సమాధి ఫోటోలను వాట్సప్ లో పంపింది. క్రమం తప్పక అరుణాచలం వెళ్ళొస్తున్న మాధవీలత యాత్రకు పాపం లాక్ డౌన్ అడ్డుగోడై కూర్చుంది. మాధవీలత విషయం "కౌముది" కిరణ్ ప్రభగారితో చెప్పాను. ఆయన చలంగారిమీద కౌముదిలో గొప్ప గొప్ప వ్యక్తులపై టాక్ షో సమర్పిస్తూ వస్తున్నారు. చలంగారిపై విస్తృతంగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రెండు మూడుసార్లు నాతో ఫోన్లో మాట్లాడితే నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పాను. అప్పుడు మాధవీలత గురించికూడా ఆయనతో చెప్పాను.ఇదిలా ఉంటే, ఆరేడు నెలల క్రితం రచయిత, దర్శకుడు అయిన వంశీగారు ఫోన్ చేసి మాధవీలత గురించి అడిగితే చెప్పాను. ఆ అమ్మాయితో మాట్లాడుతానంటే నెంబర్ ఇచ్చానుకూడా. ఓ ఇరవై రోజుల క్రితం చిత్రగారి రెండో అమ్మాయి కాకా (జయశ్రీ)తో మాట్లాడి తిరువణ్ణామలైకి సంబంధించి ఏవైనా ఫోటోలుంటే పంపించమన్నాను. అప్పుడు తను తన కూతురు శాంతితో ఓ ఇరవై ఫోటోలపైనే పంపింది. వాటిలో చలంగారి సమాధి, షౌగారి ఫోటోలు, చిత్రగారు - పిల్లల ఫోటోలు, నర్తకిగారివి, చలంగారు కుమార్తెలతో కలిసి తీయించుకున్న ఫోటోలున్నాయి. వాటిని చూస్తుంటే చలంగారింటికి వెళ్ళినట్లు ఫీలయ్యాను.ఇలా చలంగారంటే అభిమున్న వారితో మాట్లాడటం మానేసి చలమంటే ఎవరో తెలీని పెద్దాయనతో నాలుగు ముక్కలు చెప్పాలనుకోవడం నా బుద్ధితక్కువ.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
సిరిసిరిమువ్వ చెప్పారు…
చలం గారి సమాధి అరుణాచలం లో ఎక్కడ ఉందో చెప్పగలరా! దాని తాజా ఫొటోలు ఏమైనా ఉంటే పెట్టగలరా!