రచయిత "సుజాతా" గురించి ఓ నాలుగు మాటలు.---తమిళంలో సుప్రసిద్ధ రచయిత అయిన ఎస్. రంగరాజన్ వృత్తిపరంగా శాస్త్రవేత్త. మన దేశంలో మొట్టమొదటగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ఈయన పర్యవేక్షణలోనే రూపొందింది.మొదట్లో రంగరాజన్ ఎస్. రంగరాజన్ పేరుతోనే కథలు రాసేవారు. అయితే అప్పటికే కుముదం అనే వారపత్రికలోనూ ఒకరు ఎస్. రంగరాజన్ పేరుతోనే రచనలు చేస్తున్నారు. దాంతో శాస్త్రవేత్త రంగరాజన్ తన భార్యపేరైన సుజాతను కలంపేరుగా పెట్టుకుని రాయడం ప్రారంభించారు.రంగరాజన్ గారి మరణానంతరం ఆయన స్మృత్యర్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని కలంపేరు విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఆమె చెప్పిన మరికొన్ని విషయాలు చూడగలరు.....ఆయన రాసిన ఓ కథ " సుజాతా "అనే పేరుతో అచ్చయిన తర్వాత దాన్ని తన భార్యకు చూపించారు. ఆమె అచ్చులో తన పేరు చూసి ఎంతో సంతోషించారు కానీ ఆమె తన భర్త కథలు అంత ఇష్టంగా చదివేవారు కాదు. పైగా ఆమె మహిళలు రాసే కథలనే ఎక్కువగా చదివేవారు. రంగరాజన్ గారికి పుస్తకాలే ప్రపంచం. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుండేవారు. లేదా ఏదో ఒకటి రాస్తుండటం ఆయన అలవాటు. కంప్యూటర్, టెక్నాలజీ గురించి తమిళంలో మొట్టమొదటగా ఎక్కువ వ్యాసాలు, కథలూ రాసిందీ ఆయనే. పుస్తకాలు చేతిలో ఉన్నప్పుడు మరేవీ పట్టించుకునేవారు కాదు. స్త్రీలను వర్ణిస్తూ అనేక కవితలు రాయడమైతే రాశారు కానీ వారికోసం షాపింగ్ చేయడం తెలీదు. తన భార్యకు ఏది కొంటే బాగుంటుంది అనేది అస్సలు తెలీదు. ఉద్యోగరీత్యా ఆయన బెంగుళూరులో ఉండేవారు. ఓమారు ఆయన ఏదో పని మీద డిల్లీ వెళ్ళారు. బెంగుళూరులో చలి ఎక్కువ ఉండేది. కనుక డిల్లి నుంచి వస్తున్నప్పుడు ఓ స్వెట్టర్ కొనుక్కు రమ్మన్నారు ఆమె. ఆయన అలాగే అని, ఓ పచ్చటి రంగు స్వెట్టర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రంగు నచ్చని ఆమె ఇంటికి దగ్గర్లోనే ఓ ఎగ్జిబిషన్ కి ఇచ్చేశారు. ఆ ఎగ్జిబిషన్ కే ఈయన ఓ రెండు రోజుల తర్వాత వెళ్ళగా అక్కడ తాను డిల్లీలో కొన్నలాంటి స్వెట్టర్ కనిపించింది. ఇదెక్కడిది అని అడగ్గా "మీ భార్యే ఇచ్చారండి" అని ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు చెప్పారట. అయితే ఆ విషయమై ఇంటికొచ్చి గొడవేమీ పెట్టుకోలేదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నలభై ఏళ్ళపైనే సాగిన తమ వైవాహిక బంధంలో తానెప్పుడూ వాదించడం వంటివి చేయలేదన్నారు. ఎందుకంటే వాదించినా జరగబోయేదేమీ లేనప్పుడు గొడవపడి కుటుంబవాతావరణాన్ని చెడగొట్టుకోవాలనుకుని ఆమె అన్నింటికీ సర్దుకుపోయేవారట. పిల్లల చదువు సంధ్యలు గానీ ఇంటి వ్యవహారాలు కానీ అన్నీ ఆమె చూసుకునేవారు. ఆమె ఏం చేసినా అభ్యంతరం చెప్పేవారుకాదు. ఓమారు ఓ బడా ధనికుడు ఇంటికొచ్చి వీరుంటున్న ఇంటికి దగ్గర్లోనే ఓ పెద్ద ఇల్లు కొనిస్తానన్నారు ఎంతో అభిమానంతో. అయితే రంగరాజన్ తనకున్న ఈ ఇల్లే చాలని సున్నితంగా తిరస్కరించారు. ఆ ధనికుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆయన కొనిపెడతానంటే ఎందుకొద్దన్నారండి అంటే ఆయన "ఆయన కొనిస్తారు. బాగానే ఉంటుంది. రేపటి నుంచి ఆయనకు నేను బానిసగా బతకాలి. అలా నన్ను ఉండమంటావా చెప్పు" అని అడిగేసరికి ఆమె అలాగైతే వద్దులెండి అన్నారు. అలాగే ఓమారు ఓ యువతి ఆయన వద్దకు వచ్చి ఓ సినిమా నటుడిని పెళ్ళి చేసుకోవాలనుందని, ఆ నటుడితో మాట్లాడి ఒప్పించి తనకు పెళ్ళి చేయించమని కోరింది. అయితే ఆయన సినిమా వేరు, జీవితం వేరు అని విడమరిచి చెప్పి బుద్ధిగా చదువుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకో అని ఆమె మనసు మార్చి పంపించేసారు.బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న కొంతకాలానికే ఆయన కన్నుమూశారు. మరో రెండు రోజుల్లో పోతాననగా ఆయన భార్యతో "ఇక తానుంటాననే నమ్మకం లేదు" అని చెప్పినప్పుడు ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఆయన వెళ్ళిపోవడం అంతా శూన్యంలా ఉందని, భర్తకన్నా ఓ బిడ్డను కోల్పోయినంత బాధ కలిగిందని భార్య సుజాత చెప్పి కంట తడిపెట్టారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు