అమ్మ ---------- అమ్మకో చిన్న మాట ఎన్నెన్ని బంధాలనిచ్చావో నాకు జన్మనిచ్చి అయినా నిన్ను మించిన బంధాన్ని చూడలేదిప్పటివరకు నీ కన్నీళ్ళన్నింటినీ నవ్వుల్లో దాచేశావు అదింతకాలమూ తెలీలేదు నాకు నేనెదిగే ప్రతి క్షణం నీకు భారమేనని తెలిసీ నన్ను నవ మాసాలేకాక జీవితాంతమూ మోసావు నీ కాలం అంతమయ్యే వేళ నా సమయం నీకోసం ఉండబోని సందర్భాలు నెలకొంటాయని తెలిసీ నన్ను ఓ కంట కనిపెడుతూనే వచ్చావు బాగున్నానా లేనాని నీ కంటిపాపలో నన్నుంచిన నువ్వు ఏదో బాధ్యతకోసమో ఏదో రుణంకోసమో అన్నట్లు కాకుండా మాతృదేవో భవ అని నిత్యమూ స్మరించేలా చూసుకున్నావు నన్ను నీ జీవితంలో సగభాగం నీ తల్లిదండ్రులకోసం మిగిలిన సగభాగం నీ పిల్లలకోసం కేటాయించావే తప్ప నీకోసం చూసుకోలేదెప్పుడూ నీకోసం నువ్వెప్పుడైనా జీవించేవా నీకంటూ నేనేం చేసినా నిన్ను నాకిచ్చుకున్న నీ మనసుకి సాటిరాదు ఏడు జన్మలపై నమ్మకమేమీ లేదు ఇక మరుజన్మంటూ ఉంటే నువ్వు నా కూతురువైతే అంతకు మించిన భాగ్యం మరేముంటుంది ఒకే ఒక్క విజ్ఞప్తి! నీ పుట్టింరోజునాడైనా నీకోసం నువ్వు ఉండటానికి ప్రయత్నించు - యామిజాల జగదీశ్ (గమనిక ఇదెప్పుడో రాసుకున్నది)


కామెంట్‌లు