మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి .--ఆరవతరగతిలోనో ఏడవతరగతిలోనో ‘మనశ్శాంతి’అనే పాఠం ఉండేది.బాపు మాకు తెలుగు చెప్పేవారప్పుడు.టూకీగా అందులో కథ ఒకరాజు తనరాజ్యమెలా ఉందో చూడటానికి గుఱ్ఱంమీద బయలు దేరి ఓ పల్లెటూరుకి వస్తాడు.అక్కడ ఇంటి ముందు దర్జాగా కూర్చున్న ఓ రైతును ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అనగానే రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది.తనకు అన్ని సంపదలు న్నా,రాజ్యాధికారమున్నా లేని మనశ్శాంతి లేదు ఈ మామూలు పల్లెటూరి రైతుకు ఎలా లభించిందన అని అనుకొని అదే అడుగుతాడు.బాపురే ఏమియంటివి కాపువాడ! నాకు లేని మనశ్శాంతి నీకు గలదె’ దానికి ఆ రైతు నాకేమిటి హాయిగా భూమి దున్నుకుంటాను పంటలు పండిస్తాను నాకెందుకు దిగులు అని ఏదో సమాధానం చెబుతాడు. బాపు పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో ఉల్లాసం నింపుతూ నవ్విస్తూ ఉండేవారు.ఆ తరగతి గదిలో కాపు కులస్థుడైన నా మిత్రుడు తోట వెంకట్రాములును రైతు గా సంబోధిస్తూ పై చరణాన్ని ఒకటికి రెండు సార్లు నాటకీయంగా చదివి నవ్వించిన విషయం మిత్రుడు ఇప్పటికీ కలిసినప్పుడు గుర్తు తెచ్చుకుని సంతోషిస్తాడు.వెంకట్రాములు వాళ్ల అన్న లింబయ్య గారు అలాగే తోట చంద్రయ్య సారు కూడా బాపుకు ప్రియ శిష్యులు. గతంలోనే చెప్పాను మా మిత్రుని గురించి.బళ్లో ఏ నాటకం వేసినా ఆయనకో పాత్ర ఉండేది. ’మధుసేవ’ నాటకంలోనా మిత్రుని సాయెబు పాత్ర ఇచ్చారు అందులో కస్తూరి వేశ్య పాత్రతో మహమ్మదీయ వైభవాన్ని పొగిడే పద్యం ‘భరతదేశంబెల్ల పాలించి సిరులతో తులతూగుతారు మీ తురకవారు’ అనే పద్యం బాగా పేలింది.అలాగే మీకు ఈ దాడీ అంటే గడ్డం ఎందుకు అని ప్రశ్నిస్తే ఓ పేద్ద డైలాగు సాయెబు పాత్రధారియైన వెంకటరాములుతో చెప్పిస్తారు.అంత్యప్రాసలతో ఉండే ఆ డైలాగులో చివరి పదాలు కాపోడికి కాడీ,కమ్మోడికి పాడీ,ఇంకెవరెవరికో మేడీ,జోడీ,బేడీ,బీడీ అని చివరలో ముసల్మాన్ కి దాడీ సహజం అని ముగిస్తాడు.ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఈ రోజు ‘కాపువాడ ‘ముచ్చట్లు చెబుదామను కోగానే ఇదంతా గుర్తుకు వచ్చింది.చిన్న తనంలో చాలా తరచుగా వెళ్లిన వాడ కాపువాడ.తూర్పు గవనికిరువైపు కాపువాడ విస్తరించి ఉంది.ఎన్నం వాళ్ల అన్నదమ్ముల కుటుంబాలు చాలా ఉండేవి.ఎన్నం వారిలో ఎన్నం వీరయ్య కాపుపెద్దగా పరిగణించబడేవాడు.ఎన్నంవాళ్లు,జక్కుల వాళ్లు,దొగ్గలి, మామిడి,తోట,వీరవైని ,నాదం,యాస, ఆవుల,ఎద్దండి,మల్యాల,షేరి బండకింది మొదలైన ఇంటి పేర్లు గలవాళ్లు ఉన్నారు.ఇందులో ఎక్కువగా ఊరికి ఆగ్నేయ భాగంలో ఉన్నా కొందరు మీదివాడకు,కొందరు ఆవుపేటలో ఉండేవారు.వెన్నం ఆగయ్య మా పొలం పనులు చూసేది.తరచుగా వాళ్ల ఇంటికి వెళ్లవలసి వచ్చేది. దాదాపు గా ఏ కాపు వాళ్లింటికి వెళ్లినా వాకిట్లో గోడకాన్చిన నాగండ్లు,గొర్లు,ఎనుగులు సవరించే రాగోలలు,పెద్దబండ్లు ఉండేవి. ఇంట్లోకి వెడితే చిలుక్కొయ్యలకు కణాలు. దొత్తెలు.ఎడ్ల మెడలో వేసే మువ్వలు కనిపించేవి.అప్పటికి సిమెంటు ప్రవేశం జరగలే దింకా..కనుక ఇండ్లన్నీ పెండ పుట్టమన్ను కలిపి అలికిన అరుగులు,గోడల మీద జాజుతో గీసిన తీగెలబొమ్మలు ఎనగర్రలకు కసికి వేలాడదీసిన వెల్లి పాయల చేర్లు,విత్తనానికోసం మొక్కజొన్న కంకులు,పొగాకు అండాలు,గుమ్ములు,గడంచెలు,దిగూళ్లలో దీపపు ప్రమిదలు అదో ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా ఉండేది.ఉదయం పూట ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా పశువుల పేడ నీళ్లో కలిపి చానిపి చల్లిన వాకిలి వాసన ఆహ్లాదకరంగా ఉండేది. కొందరికి ఇంటి ప్రక్కనే పశువుల కొట్టాలుంటే మరికొందరికి నాగుల కుంటనానుకొని ప్రత్యేకమైన కొట్టాలుండేవి.కాపువాడలో మూలమీద కొమ్మనారాయణ దుకాణం ఉండేది. దాదాపుగా రైతులందరు మోకాలు వరకు ధోతి గట్టి,సైను బనీను దొడిగితలకు తెల్లని పగిడీ చుట్టుకునేవారు. అయితే కాపువాడలో నాతో చదువుకునే మిత్రులు కూడా ఉండేవారు.నా ఈడు వాళ్లు చాలా మంది మంచి చదువులు చదువుకుని ప్రభుత్వోద్యోగాలు చేసిన వారున్నారు.ఊరి చుట్టూ పొలాలు, తోటలు,పెరండ్లు,చేన్లు చెలకలుండేవి. దీని వివరణ ఇప్పటి వారికోసం ఇవ్వటం అవసరమనిపిస్తుంది.పొలమంటే వరిపొలం. దీన్నే తరి అంటారు.ఈ పొలాలు కొన్ని కాలువ పారకంతో,కొన్ని చెరువు నీళ్లతో,కొన్ని మోట బావులతో,కొన్ని రాటుతో,కొన్ని కుంటల నీళ్లతో సాగు చేసేవారు.ఒక్క తోటలలో మోటబావులుండి మెక్కజొన్న,జొన్న,కంది,పెసర,మినుము కూరగాయలు పండించే వారు. పంటతో ఉన్న భూమిని చేను అనటం పరిపాటి. వరిచేన,కందిచేను,ప్రత్తిచేను వంటివి.చెలక సాధారణంగా పశువుల మేతకోసం సహజంగా పెరిగిన గడ్డి చేను పశువుల కాపర్లు ఉదయమే అన్ని పశువులను మేతకు తీసుకపోయేవారు. సాయింత్రం ఊళ్లోకి పశువులన్నీ ఇండ్లకు తిరిగి వస్తుంటే ఊరంతా దుమ్మురేగేది. అందుకే దాన్ని గోధూళి వేళ అనే వారు.రైతుల సంవత్సర సమయ సారిణి ఋతువుల ప్రకారం కొనసాగేది. వరి నార కోసం వడ్లన గడ్డి తాళ్ల కడియం మధ్యలో పోసి దాని పై ఇరవై ఒక్కరోజులు పొద్దూ మాపు కడవలతో నీళ్లు పోస్తే అవి చక్కగా మొలకలు వచ్చేవి.ఈలోగా పొలాన్ని తయారు చేసి దానిలో అలికే వారు.అలా కాకుండా కొందరు నారుమడిలో నారు తయారు చేసి నాట్లు వేసేవారు.వరిపొలానికి ఎప్పుడూ నీరుండాలి కనుక వీటిని చూసుకున్ నీరటికాడు ఉండేవాడు.కలుపు తీయడం వరికోతలు ,మెదలు కట్టడం కుప్ప వేయడం బంతికొట్టడం,ధాన్యం తూర్పారబట్టడం అదంతా వారికి తెలిసిన విద్య.ఎండాకాల పనులు వేరే,వానాకాలం పనులు వేరే చలికాలం పనులు వేరే.గడ్డి వాములు పేర్చడం,ఎరువులు చేరవేయడం,దుక్కిదున్ని మరో పంటకు సిద్దం చేయడం, ఎన్నని చెప్పను .అదో కృషీవలుడ వేదంకృషితో నాస్తి దుర్భిక్షం,నిజమే కాని కృషీవలుడు ఆరుగాలం శ్రమపడితే గాని మనందరికీ ఐదువేళ్లూ కలవవు.అందుకే అన్నదాత సుఖీభవ.
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి