చిత్రంతో దొరికిన నేస్తం:- శ్రీధర్ నామాడి -చిరకాల మిత్రుడు ఒమ్మి రమేష్ బాబు తొలుత చిత్రకారుడు. ఆ తర్వాతనే కవీ, కథకుడు అయ్యాడు. ఇవాళ రమేష్ వేస్తున్న బొమ్మలు సంవత్సరాల తరబడి అతనిలో యిగిరిపోక మిగిలిన స్వతస్సిద్ధమైన వర్ణాలు, రేఖల ఆనవాళ్ళు. కుటుంబ పరిస్థితి, శ్రమైక జీవితం, పాత్రికేయ వృత్తి... యవ్వన ప్రాయంలో అతని దైనందిన యేకాంతాన్ని యెన్ని విధాలగానో హరించివేశాయి. ఇక దక్కిన వొకింత సమయంలోంచి విలక్షణమైన కథలూ, మరికొంత కవిత్వమూ అల్లుకొచ్చాడు. అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు కూడ వేసేవాడు. అయితే చిత్రలేఖనానికి తగినంత జాగా అతనికి దొరికింది కాదు. నిజానికి ఆనాడు అందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకొనే అవకాశమే కలగలేదు. అసలు ఓ చిత్తరువుతోనే మా ఇద్దరికీ స్నేహం కుదిరింది. అప్పుడు రాజమండ్రిలో బిఎస్సి ఫస్టియర్ చదువుతున్నాను. కెమిస్ట్రి లేబరేటరీలో రాతబల్ల మీద ఒక పుస్తకం పంకా గాలికి రెపరెపలాడుతుంది. అప్రయత్నంగా ఆ కాగితాల్లోకి చూశాను. మార్క్స్ రూపం కనబడింది. పెన్సిల్ తో వేసిన బొమ్మ అది. అబ్బురపడి పుస్తకం దగ్గరకి వెళ్ళాను. దరిదాపుల్లో యెవ్వరూ లేరు. అక్కడే నిలబడిపోయాను. కొద్ది సేపటికి ఓ కుర్రాడు వచ్చాడు. గద్దర్ పాటలాగ అగపడ్డాడు. 'ఈ పుస్తకం మీదా' అని అడిగాను. అవునన్నాడు. 'మరి మార్క్స్ బొమ్మ?'. నేనే వేశానన్నాడు. అద్భుతంగా ఉందన్నాను. నాకు మార్క్స్ అంటే అభిమానం. చిత్రలేఖనమన్నా ఇష్టమే. ఇక మార్క్స్ ని బొమ్మకట్టినవాడు, సాహిత్యం యెరిగినవాడు యేమవుతాడు? ప్రాణమిత్రుడు కాక. రాజమండ్రిలో మాకు దొరికిన వొకింత తీరిక సమయం సైతం దామెర్ల రామారావుగారి ఆర్ట్ గేలరీలోనే గడిచేది. అవే బొమ్మలు మరల మరల చూసేది. అక్కడి స్టోర్ రూమ్ లో దుమ్ము పట్టిపోయిన అనేక అపురూప చిత్రాలవేపు నిస్సహాయంగా చూసేది. ఆ అరుగుమీద బొమ్మ వేయడంలో లీనమైన మాదేటి రాజాజీ గారి చుట్టపొగనీ, కాన్వాస్ మీద కదిలే ఆ కుంచెనీ, యెప్పటికీ పూర్తికాని ప్రతిమనీ తేరిపార చూసేది. అలానే గడిచింది అన్నిటికంటే మేలైన ఆ అమాయక కాలం. కాకుంటే అడవి అంచున, సారంగధర మెట్టమీద, గౌతమీ గ్రంథాలయం చెట్ల నీడన, గోదావరి వొడ్డున లంగరేసిన పడవల్లోనూ. మన చేతివేళ్ళకందే యెత్తున వందల పిచ్చుకలు గాలిలో వుయ్యాలలూగే రోజులవి. అటు పిమ్మట యెగసిపడిన ఉద్యమం, బ్రతుకుతెరువు ఉద్యోగమూ. అప్పుడే కాదు ఇప్పటికీ రమేష్ కి చిత్రకళ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. చిత్రకారులంటే స్నేహితం, గౌరవమూ. ఆనాడు 'కంజిర' పొయిట్రి బులిటెన్ అక్షరాల్ని శివాజీ గారే యెందుకు రాయాలి? హైదరాబాద్ లో ప్రవేశించాక మేము చూడని ఆర్ట్ గేలరీ లేదు, యే ఆర్ట్ ఎగ్జిబిషనూ వదిలింది లేదు. ఆర్టిస్ట్ లేని ఒక దినపత్రికలో ఆదివారం అనుబంధంలోనూ, సాహిత్య పేజీలోనూ యే కవితని, యే కథని యెలా ప్రచురిస్తే మాత్రం యెవ్వరు కాదంటారు? అయినా సరే లక్ష్మణ్ ఏలే బొమ్మలతోనే వాటిని అచ్చువేయాలని కదా అంత దూరం కాలినడకన బయలుదేరింది. అంత ప్రేమతోనే రమేష్ తన కథల పుస్తకంలోని ప్రతీ కథనీ అన్వర్ బొమ్మలతో అలంకరించుకుంది. ఈనాటికీ అతన్ని ఓ చిత్ర ప్రదర్శనలో వదిలి పెడితే నిద్రాహారాల వూసు మరచిపోతాడు. ఇటీవల ‌'గోమాత' పేరిట జరుగుతున్న అమానుష చర్యలకి నిరసనగా రమేష్ బొమ్మలు వేస్తున్నాడు. కొత్తగా అతనిలోని చిత్రకారుడిని చూసిన పలువురు మిత్రులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ రంగు రంగుల తీగ కొనసాగాలనే శుభాకాంక్షతో అతని నేపథ్య చిత్రాన్ని యిలా పంచుకొంటున్నాను.


కామెంట్‌లు