మబ్బుల రెక్కలు ఊగుతుంటే తొలి తొలకరి జల్లు మనసును తడిపేది పంట పొలాల గుండెల మీద నా ఎడ్ల బండి కొత్త దారుల్ని తొలిచేది గరిసేడు గత్తం బండిలో పరుగులు తీసేది ఎద్దుల గంటల్లో ఆశలు మోతలు మోగేవి వెన్నెల వొoపిన చందమామ సాక్షిగా ప్రతి మడిలో రాత్రిళ్ళు ఎరువుల కుప్పలు కప్పేవి పనిలోని ఆనందాన్ని ఆ ఆనందంలోని ప్రకృతిని నా కూని రాగాలు పరవశింపజేసేవి తడి తగిలితే చాలు నాగలి కర్రు నాగేటి చాళ్లల్లో మట్టి గుండెల్ని చీ ల్చుకుంటూ ఉరకలు తీసేది ఎన్ని మైళ్ళు నాగలితో నడిచాను ఎన్ని సార్లు విత్తనం తో మొలకెత్తాను తెల్లవారు జాము చంద్రుడు పూస్తున్నప్పటికి నుంచీ సూరీడు వేడెక్కే వరకూ నాగలి తో ప్రయాణం జీవన వేదం అయ్యేది బతుకు పాట అయ్యేది పాట పల్లవించిన బతుకులో నాగలి కర్రు కళ్ళల్లో హరిత వనాల్ని నింపేది ఇప్పుడు నా నాగలి జాడేది ఇనుప యంత్రాల కింద కనుమరుగై పోతున్న నా ఎడ్లబండి ఆనవాళ్లయినా మిగల్చుకోవాలని తల్లడిల్లుతున్నాను... భాస్కర్ ఎనబోతుల


కామెంట్‌లు