ఈ రోజు బుద్ద పౌర్ణిమ.: -పిల్లల అభిరుచుల్నీ, అంతర్గత శక్తుల్ని తల్లిదండ్రులు గుర్తించటం గురించి, బుద్దుడికి సంబంధించ ఒక గొప్ప కథతో ఈ రోజు ప్రారంభిద్దాo..బుద్ధుడి శిష్యుల్లో 'సారిపుట్ట' ప్రధముడు. దాదాపు బుద్ధుడంత గొప్పవాడిగా పేర్కొనబడే అతడు, దేవతలకు కూడా నిర్వాణ యోగం బోధించేవాడని ప్రతీతి. చిన్న వయసులోనే ఇల్లు వదిలి ఆరామంలో చేరాడు. కొంత కాలానికి అతడికి ప్రాణ సంకటమైన వ్యాధి వచ్చింది. బుద్ధుడి దగ్గరకు వెళ్ళి "మరణించే ముందు నా తల్లికి క్షమాపణలు చెప్పుకోవాలి. ఆమె అంగీకారం లేకుండా చిన్న వయసులోనే నేను ఇక్కడకు వచ్చేసాను" అని అడిగాడు.బుద్ధుడు దానికి అంగీకారం తెలిపాడు.'సారిపుట్ట' అసలు పేరు 'సారిపుత్ర' (సారి అనే స్త్రీ కొడుకు).చిన్న వయసులోనే ఎంత వద్దంటున్నా వినకుండా కొడుకు బౌద్ధారామాల్లో చేరి పోయాడని తల్లికి కోపం. మనసు మార్చుకుని అతడు వెనక్కి వస్తున్నాడనుకుని ఆశగా వెళ్ళి, అతడింకా సన్యాసి దుస్తుల్లోనే ఉండటం చూసి హతాశురాలయింది. మాట్లాడమని కొడుకు ఎంత బ్రతిమాలినా వినలేదు. ముభావం గా ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకీ కొడుకు మరణం క్రమక్రమంగా దగ్గర పడుతూన్న సంగతి ఆమెకు తెలీదు.అతడికి నిర్యాణస్థితి వచ్చింది. మరణం ఆసన్న మవుతూండగా ఒక చిత్రం జరిగింది. అతడు పడుకొన్న గదంతా దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. పక్క గది లోంచి వస్తూన్న ఆ దేదీప్యమానమైన వెలుగు చూసి అతడి తల్లి విస్మయంతో అక్కడకు పరిగెట్టుకు వచ్చింది.ఆ వెలుగుకి కారణం దేవతలు.తమ గురువు తాలూకు ఆఖరి శుభ వచనం వినడానికి దేవతలందరూ ఆ గదిలోకి వరుసగా ప్రవేశిస్తున్నారు. వారిదే ఆ వెలుగు.ఆమె చేష్టలుడుగి చూస్తోంది.అదొక అద్భుతమైన దృశ్యం..!సాక్షాత్తు దేవతలు తన కొడుకు వచనాలు వినటానికి వస్తున్నారు..!అతడి ముందు చేతులు జోడించి వరుసలో నిలబడు తున్నారు..!కొడుకు గొప్పతనం ఆమెను కట్రాటను చేసింది.అప్పుడే కొడుకు అవసానదశ గురించి కూడా అవగతమైంది.తన కోరిక ఎంత స్వార్థమైనదో అర్థమయింది.పెద్దగా రోదించబోతే, "బంధమే దుఃఖ కారణమమ్మా" అన్నాడు.చేతులెత్తి నమస్కరిస్తూ అతని మంచం పక్కన నేల మీద వాలిపోబోయింది. వారించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతడి కోరిక తీరింది. దేవతలందరూ వింటూ ఉండగా నాలుగు సత్యాలు (వీటినే బౌద్ధంలో 4 నోబెల్ ట్రూత్స్ అంటారు) చెప్తూ భవ బంధ విముక్తుడయ్యాడు. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. (ప్రేమ/ పిల్లల పెంపకం ఒక కళ - పుస్తకం నుంచి)--యండమూరి వీరేంద్ర నాథ్


కామెంట్‌లు