మా అవ్వ ----------- ఎలా అక్షరీకరించనూ.... ఆకాశమంతటి మా అవ్వ ఔన్నత్యాన్ని! ఎలా కవిత్వీకరించనూ... భూమాత లాంటి మా అవ్వ ప్రేమ తత్వాన్ని!! వాస్తవంగా .... మా అవ్వ గురించి చెప్పాలంటే.. ఆమె ఆ (లా)లన గురించి రాయాలంటే.. ఏ భాషా సరిపోదు ఏ భావము సరిరాదు నేను కన్ను తెరచినప్పటినుండి తాను కన్ను మూసేంతవరకు మా అవ్వ నాకెప్పుడూ అక్షయ పాత్రనే అయింది. అడ్దాల నాడే కాదు నాకిద్దరు బిడ్డల నాడు కూడా నన్నొక పూవోలె చూసుకుంది నన్నొక రాజోలె పెంచుకుంది నిజానికి.. మా అవ్వ మమతకు మరో రూపం ఆత్మీయతకు ప్రతిరూపం నిస్వార్థానికి నిజరూపం అనుబంధానికి ఆకృతి ఓ(దా)ర్పుకు ప్రకృతి అనురాగానికి ఆలయం ప్రేమకు నిలయం త్యాగానికి పతాక దైవత్వానికి ప్రతీక అందుకే.... మా అవ్వ మాట ఇప్పటికీ ఆచరణీయం! మా అవ్వ బాట ఎప్పటికీ అనుసరణీయం !! మా అవ్వ యాది ఎల్లప్పటికీ చిరస్మరణీయం !!! ( అవ్వ = కన్నతల్లి. తెలంగాణలో ) - బాలవర్ధిరాజు మల్లారం


కామెంట్‌లు