యశోదా గీతాలు---ఓ ముప్పై నలబై ఏళ్ళ క్రితం కావచ్చు.మా అన్నయ్య ఆనంద్ చలంగారి యశోదాగీతాలంటూ ఓ చిన్నిపుస్తకం ఇంటికి పట్టుకొచ్చాడు. అప్పుడు చదివిన ఆ పుస్తకంతో చలంగారి రచనలకు ఆకర్షితుడినయ్యాను. కవిగా చలం అనే దాంటో యశోదా గీతాలలోని తన యశోద స్త్రీ కాదని, ఓ తల్లి అని ఓ మహాత్ముడు చెప్పేరన్నారు చలం. అంతేకాదు, నా కథలలో నా స్త్రీలలో ప్రియురాళ్ళలో నేనెక్కువ భాగం చూపించింది మాతృత్వమనీ అన్నారా మహాత్ముడు. నా స్త్రీలు కులకరని, దొంగ వేషాలు వేయరని, మామూలు చూపులు చూడరని, వారి ప్రేమ ఓ అనివార్యమైన మాతృత్వంగా అనిపిస్తుందని.ఈ మాటలేమో కానీ చలంగారి యశోదా గీతాలు ఎప్పుడు చదివినా ఎన్ని సార్లు చదివినా యశోద మాతృత్వ ప్రేమ పొందిన కృష్ణుడెంత అదృష్టవంతుడో కదూ అనిపిస్తుంది. అదంతా ప్రత్యక్షంగా చలం రాసేరా అనిపించేలా చేసింది నన్ను.ఆ వచనకవితలోని ప్రతి మాటా ప్రేమానురాగాలనూ ఆప్యాయతనూ కలబోసుకుని పుట్టేయా అనిపిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోవడం కన్నా చలం వచనామృతంలోని కొన్ని బిందువులను ఇక్కడ పంచుతాను..."కృష్ణా! చెప్పవూ ఎందుకు అట్లా నవ్వుతావో నన్ను చూసి! ఏదో అర్థం వుంది నీ నవ్వులో.వుత్త వెర్రితల్లిననా? నువ్వే చేశావు నన్నట్లా! నువ్వు నా వొళ్ళో చేరకముందు నేను చాలా సమర్థురాలిని. అందరికీ నేనే నేర్పేదాన్ని అన్ని సంగతులూ. ఇప్పుడు నాకేం చాతకాదు. నువ్వే నా గర్వం. నా ధ్యాస. నా ఉద్దేశం. నువ్వు తప్ప ఏమీ మిగల్చలేదు నువ్వు. నా అహాన్నంతా వెన్నలాగు మింగేశావు. నువ్వయినా మిగలలేదు నాకు. ఏం లాభం నువ్వు నా యింట్లో ఇడుకుంటున్నావన్న మాటే కాని, నా కృష్ణుడని గర్వంగా చెప్పుకుంటానన్న మాటే కాని ఎదటదాని చంకలో కూచుని నన్నెరగనట్లు చూస్తావేం! ప్రతి గొల్లకీ ప్రతి కుర్రడికీ ప్రతి గోవుకీ దూడకీ అంత చవకైపోతే నువ్వు, నీ తల్లిని నాకేం గొప్ప కృష్ణా! నానించి ఒక్క మాట పడవు. అలిగి మూలల చీకట్లో ఒదుగుతావు. కాని నిన్ను గొల్లది చంపలు వాయిస్తుంది. కుర్రడు కింద పడదోస్తాడు. దూడలు నాకుతాయి.పొద్దస్తమానం వాళ్ళ వెంటే తిరుగుతావు. వాళ్ళ కంటిచూపులూ వాళ్ళ అల్లరి గంతులూ వాటి గిట్టల దుమ్మూ మహాభాగ్యమైనట్లు! సేవ అంతా నాదీ. ఆనందమంతా వాళ్ళదీనా అని రోషం వొస్తుంది నాకు.కాని నా మెడని కావలించుకుని ముఖమద్ది గోము చేసేప్పుడు మాత్రం ఇంక ఎవ్వరికీ చిక్కవనీ నువ్వు నా స్వంత చిన్ని కృష్ణుడవేనని కరిగిస్తావు. సేవ ఆనందం కాదా వెర్రి యశోదా! అంటాడు ఇలా మరో పది వచన కవితలు రాశారు చలం.ప్రతిదీ నాకిష్టమే. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు